చెప్పుకోవాలన్నా చెప్పుకోలేని బాధ...

చెప్పుకోవాలన్నా చెప్పుకోలేని బాధ...


మన సమాజానికి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ‘బాధితులు అనగా మహిళలు, పీడకులు అనగా పురుషులు’ అనేది కూడా అలాంటి అమూల్య నిశ్చితాభిప్రాయమే! మగవాడు బలవంతుడు, ఆడది బలహీనురాలు అనేది కూడా సమాజానికి గల మరో నిశ్చితాభిప్రాయం. కర్మకాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సీన్ రివర్సయి... ఎవడైనా మగాడు బలహీనుడిగా తేలితే... ఇక వాడి బతుకు నరకప్రాయంగా మారుతుంది.ఇంట్లో భార్య గాఠిగా ప్రైవేటు చెబితే, కుక్కిన పేనులా ఓర్చుకుని పంటిబిగువున బాధను దిగమింగాలే గానీ, పొరపాటున గావుకేకలు పెట్టాడో.. ఇక వాడి బతుకు వీధిన పడ్డట్లే! అలాగని ఇదంతా ఆధునిక చట్టాల వల్ల వాటిల్లిన అధునాతన అనర్థమేమీ కాదు, పురుష పుంగవులపై పీడన పురాతన కాలం నుంచే ఉంది. దురదృష్టవశాత్తు అలాంటి నిర్భాగ్యుల గాథలేవీ చరిత్రకెక్కలేదు. ఇందుకు పెద్ద కారణమేమీ లేదు, చరిత్రను రాసిన వాళ్లు కూడా మహిళాజన పక్షపాతులు కదా! మచ్చుకు ఒక ఉదంతాన్ని ముచ్చటించుకుందాం...

 

 అగ్రరాజ్యాలలో ఒకటిగా ఎన్నదగిన ఫ్రాన్స్ శతాబ్దాల కిందటే ఆధునికతకు మార్గదర్శిగా వెలుగొందేది. ఫ్యాషన్‌కు పుట్టినిల్లయిన ఫ్రాన్స్‌ను అప్పటి చరిత్రకారులు సాక్షాత్తు భూతల స్వర్గంగా వేనోళ్ల కొనియాడేవారు. అంతటి భూతల స్వర్గ సమానమైన ఫ్రాన్స్‌లో సైతం సామాన్య పురుషాధముల బతుకులు కడు హీనంగా ఉండేవి. ఐదారు శతాబ్దాల కిందట ఫ్రాన్స్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. అప్పట్లో అక్కడ పెళ్లాం చేతిలో దెబ్బలు తిన్న మగాళ్లు నోర్మూసుకుని పడి ఉండాల్సిందే! వీధికెక్కి లబోదిబోమంటూ గగ్గోలుపెడితే, పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది.పెళ్లాం చేతిలో దెబ్బలు తిని గగ్గోలు పెట్టే మగాళ్లను గాడిద మీదకెక్కి ఊరేగించేవాళ్లు. అలాంటి మగాధముడిని పిల్లా జెల్లా కూడా గేలిచేస్తూ వెంబడించేవాళ్లు. ఇక అప్పటి నుంచి సదరు మగాధముడు ఊరందరికీ ఉచిత వినోదంగా మారేవాడు. మగాళ్ల పట్ల ఇలాంటి దారుణాలు మరెన్ని జరిగాయో మరింత లోతుగా పరిశోధిస్తే గానీ వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు. దాష్టీకాలకు పాల్పడే మగాళ్లను చరిత్ర క్షమించదని బెదిరిస్తూ ఉంటారు గానీ, దాష్టీకాలకు గురైన మగాళ్ల పట్ల ఇంతటి వివక్ష చూపిన చరిత్రను మగపుట్టుక పుట్టిన వాడెవడైనా క్షమించగలడా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top