ఏడాది గడచినా ఏ సాయమూ లేదు

Farmers living in agriculture - Sakshi

నివాళి

వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కురువ నారాయణ పంటలు పండక అప్పులపాలయ్యాడు. చంద్రబాబు హామీ ప్రకారం పూర్తిగా రుణ మాఫీ జరగలేదు. పేరుకుపోయిన అప్పుల భయంతో సొంత పొలంలోనే 2018 జనవరి 2న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్‌ రూరల్‌ మండల పరిధిలోని తాడూరు. నారాయణ ఆత్మహత్య చేసుకొని ఏడాది గడచినా ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందలేదు.నారాయణకు భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు మల్లికార్జున, కుమార్తె సుజాతమ్మ ఉన్నారు. అయితే, నారాయణ భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యం వల్ల చనిపోగా, కూతురు కుటుంబ కలహాల వల్ల అల్లుడి చేతిలో హతమైంది. కుమారుడు మల్లికార్జునకు పెళ్లయింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. నారాయణకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో నాలుగెకరాలు గుత్తకు తీసుకొని కంది, వేరుశనగ పంటలను వేసేవారు.

పంటనే నమ్ముకున్న ఆయన తీవ్రంగా నష్టపోయారు. కొన్ని సీజన్లుగా పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆంధ్రా బ్యాంకులో రూ. లక్ష పంట రుణంతో పాటు బయటి వ్యక్తుల దగ్గర మరో రూ.4.80 లక్షలు అప్పులు మిగిలాయి. తొలి విడతలో రూ. 36 వేల వరకు మాత్రమే రుణ మాఫీ జరిగింది. పంటలు సరిగ్గా పండక, ప్రభుత్వం పట్టించుకోక, అప్పులు తీర్చే మార్గం లేక నారాయణ తీవ్ర మనస్తాపం చెందారు. పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి విచారణ చేసిన ఆర్‌డీఓ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు. అయినా, నేటి వరకు నయాపైసా సహాయం అందలేదని, దిక్కుతోచడం లేదని నారాయణ కుమారుడు మల్లికార్జున ఆవేదన చెందుతున్నారు. 
రామాంజినేయులు, సాక్షి, 
డోన్‌ రూరల్, కర్నూలు జిల్లా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top