ప్రవక్త దృక్కోణంలో హక్కులు... బాధ్యతలు

Everyone in the community has some rights and responsibiliti - Sakshi

ఇస్లాం వెలుగు

సమాజంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ముహమ్మద్‌ ప్రవక్త(స), ప్రజల సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ, ధర్మం వారికిచ్చినటువంటి హక్కులను కూడా విశద పరిచారు. ముఖ్యంగా మానవ హక్కులను గురించి, వ్యక్తిగత స్వేఛ్ఛను గురించి విడమరిచి చెప్పారు. పరుల సంపదను హరించడం గురించి ఖురాన్‌ ఆదేశాలను వివరిస్తూ, ‘మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా, అక్రమంగా కబళించకండి’. అని చెప్పారు. అల్లాహ్‌ ఆదేశం ఇలా ఉంది. ‘ఒకజాతి ప్రజలు మరోజాతి ప్రజలను అవహేళన చేయవద్దు. ఒకరికొకరు తమ ప్రతిష్టలకు భంగం కలిగించుకో వద్దు. మారుపేర్లతో ఒకరినొకరు పరిహసించుకోవద్దు. ఒకరి వెనుక ఒకరు చెడుగా మాట్లాడుకోవద్దు.

నిందలు వేసుకోవద్దు. ప్రవక్త మహనీయులు తమ చివరి హజ్‌ యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగం కూడా చరిత్రాత్మకమైనది:’ప్రజలారా! బాగా వినండి. అజ్జానకాలపు దురాచారాలన్నీ అంతమైపొయ్యాయి. అరబ్బు వ్యక్తికి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై, తెల్లవారికి నల్లవారిపై, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీ సేవకులను తక్కువ దృష్టితో చూడకండి. మీరు తినేలాంటి భోజనమే వారికి పెట్టండి. మీరు ధరించే లాంటి బట్టలే వారికీ సమకూర్చండి. మహిళలూ మీలాంటివారే. మీకు వారిపై ఏవిధంగా హక్కులున్నాయో, అదేవిధంగా వారికీ మీపై హక్కులున్నాయి. పరస్పరం హాని తలపెట్టుకోరాదు. ప్రాణాలు తీసుకోరాదు. ప్రళయకాలం వరకు కూడా..నేను మీకోసం రెండువస్తువులు వదిలి వెళుతున్నాను. మీరువాటిని దృఢంగా పట్టుకోండి.

ఎన్నటికీ దారి తప్పరు. ఒకటి పవిత్రఖురాన్, రెండవది సున్నత్, అంటే నా సాంప్రదాయం’. అంతేకాదు, మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకోకండి. ఇతరులపై గూఢచర్యానికి పాల్పడకండి. మీ స్వగృహం తప్ప ఇతరుల ఇళ్ళలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించకండి’’ అని హితవు చేశారు. ఏవ్యక్తినైనా శిక్షించాలంటే, న్యాయస్థానంలో అతడి నేరం రుజువుకావాలి. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించాలని ఆదేశిస్తూ, వారి మతవిశ్వాసాలకు, హక్కులకు భంగం కలిగే చర్యలన్నిటినీ ఆయన నిషేధించారు. ఈ విధంగా ప్రవక్తమహనీయులు సమస్త హక్కులనూ నిర్వచించారు. మానవులు ఆ అమృత ప్రవచనాలను అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, సమాజం అన్నిరకాల అసమానతలకు, లోపాలకు అతీతంగా విశిష్ట సత్సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అల్లాహ్‌ మనందరికీ విజ్ఞానాన్ని, సద్బుద్ధినీ ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top