‘డ్రైవర్స్ ఫెటీగ్’తో ప్రమాదాలు జరగవచ్చు! | Sakshi
Sakshi News home page

‘డ్రైవర్స్ ఫెటీగ్’తో ప్రమాదాలు జరగవచ్చు!

Published Thu, Nov 5 2015 11:37 PM

'Driver fatigue' accidents can happen with!

స్లీప్ కౌన్సెలింగ్
 

నా భర్త కార్ డ్రైవర్. ఐటీ ఉద్యోగులను పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం వంటివి చేస్తుంటారు. నైట్‌షిఫ్ట్‌లు చేస్తుంటారు. ఉద్యోగపరంగా ఆయన నిద్ర వేళలు ఏమాత్రం క్రమబద్ధంగా ఉండవు. ఇటీవల చాలా త్వరగా సహనం కోల్పోతున్నారు. వెంటనే కోపం వచ్చేస్తుంది. డ్రైవింగ్ సమయంలో కునుకుపట్టి రెండు సార్లు యాక్సిడెంట్స్ చేయబోయారు. నా భర్త విషయంలో తగిన సలహా ఇవ్వగలరు.
 - విజయలక్ష్మి, రంగనాథపురం

 మీరు చెబుతున్న లక్షణాల ద్వారా మీ భర్త ‘డ్రైవర్స్ ఫెటీగ్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ఈ తీవ్రమైన సమస్య వల్లనే జరుగుతున్నాయి. నిద్రలేమి వల్ల మనం ఏదైనా సంఘటనకు ప్రతిస్పందించే వేగం తగ్గుతుంది. దాంతో అనుకున్నంత అప్రమత్తంగా ఉండలేము. ‘డ్రైవర్స్ ఫెటీగ్’ సమస్య వల్ల దృషి ్టకేంద్రీకరణ శక్తి కూడా తగ్గుతుంది. మెదడు ఎంత వేగంగా స్పందించాలనే విషయంలో ఆలస్యం జరగడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అయితే తాము డ్రైవింగ్‌ను కొనసాగించాలా లేదా ఆగి తగినంత విశ్రాంతి తీసుకోవాలా అన్న విషయం డ్రైవ్ చేసేవారికి తెలుస్తుంది. అయినా కొందరు అలాగే డ్రైవింగ్‌ను కొనసాగించి రిస్క్ తీసుకుంటుంటారు.

 ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు ఇవి:  అదేపనిగా సుదీర్ఘంగా డ్రైవ్ చేస్తూనే ఉండటం  అర్ధరాత్రి దాటాక 2 నుంచి 4 గంటల టైమ్‌లో డ్రైవ్ చేయడం  మద్యం తీసుకొని డ్రైవింగ్ చేయడం  తగినంత నిద్రపోకుండా వాహనం నడపడం  మత్తు కలిగించే మందులు తీసుకొని డ్రైవ్ చేయడం  నైట్‌షిఫ్టుల్లో డ్రైవింగ్... ఈ అన్ని సందర్భాల్లోనూ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాటిని నివారించడానికి...  డ్రైవింగ్‌కు మీరు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉన్నారా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోండి  అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరుగంటల వరకు డ్రైవింగ్‌కు దూరంగా ఉండండి. ఆ సమయంలో పరిస్థితులకు స్పందించే అప్రమత్తత కొరవడుతుంది  రెండు ప్రయాణాలకు మధ్య తగనంత వ్యవధి ఉంచుకోండి  డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కాస్త బ్రేక్ తీసుకోండి.  డ్రైవ్ చేస్తున్నప్పుడు కునికిపాట్లు పడుతున్నట్లు అనిపిస్తే వాహనాన్ని సురక్షితమైన చోట ఆపి కాస్త కాఫీ తీసుకోండి లేదా కనీసం 15 నిమిషాల పాటు నిద్రపోండి  డ్రైవ్ చేయాల్సి వచ్చేనప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తీసుకోకండి  జలుబు, ఫ్లూ, దగ్గు మందులు తీసుకున్నప్పుడు డ్రైవ్ చేయకండి. అవి కాస్త మత్తును కల్పిస్తాయి. మీ భర్త పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే డ్రైవర్స్ ఫేటీగ్ నుంచి దూరం కావచ్చు. ఆయనంతట ఆయన తన సమస్య అధిగమించలేకపోతే ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలవండి.
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్

 
నా వయసు 48 ఏళ్లు. నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నాను. క్రియాటినిన్ 6.4 ఎంజీ/డీఎల్. యూరియా 204 ఎంజీ/డీఎల్. నాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. డాక్టర్‌గారు ఏవీ ఫిస్టులా ప్రొసిజర్ ఆపరేషన్ చేయించుకొమ్మన్నారు. నాకు ఏ లక్షణాలూ కనిపించడం లేదు. అలాంటప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకోవడం అవసరమా?
 - దివాకర్, సంగారెడ్డి

మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్-4లో ఉన్నారు. ఇప్పుడు ఏ లక్షణాలూ కనిపించనప్పటికీ మీకు భవిష్యత్తులో డయాలిసిస్ అవసరమవుతుంది. డయాలసిస్ ప్రక్రియలో నిముషానికి 200 మి.లీ. రక్తాన్ని బయటకు పంపించి, కృత్రిమ మూత్రపిండాల ద్వారా వడపోసి మళ్లీ శరీరంలోకి పంపుతారు.. చేతిపై ఉండే రక్తనాళాల ద్వారా ఇంత రక్తాన్ని వడపోయడం కష్టం. అందుకే ఏవీ ఫిస్టులా అంటే లోపలి పెద్ద రక్తనాళాన్ని పైన ఉండే చిన్న రక్తనాళానికి కలపడం. దీని ద్వారా శరీరంలో పైన ఉండే చిన్న రక్తనాళాల్లో సైతం రక్త ప్రవాహాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నెల నుండి రెండు నెలల తర్వాత చిన్న రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరుగుతుంది. అప్పుడు ఈ రక్తనాళాన్ని డయాలసిస్‌కు ఉపయోగించుకోవచ్చు. ఇది ముందే చేయించుకోవడం వల్ల హాస్పిటల్ ఇన్‌పేషెంట్‌గా చేరకుండానే ఔట్‌పేషెంట్‌గా డయాలసిస్ చేయంచుకోవచ్చు. పైగా ఎమర్జెన్సీ డయాలసిస్‌లో వాడే క్యాథెటర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌తో పాటు ఇతర దుష్ర్పభావాలను నివారించుకోవచ్చు. అందుకే ఈ ఏవీ ఫిస్టులా ఆపరేషన్ ముందే చేయించుకోవడం మంచిది.
 
నా వయసు 22 ఏళ్లు. అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు కుడివైపు కిడ్నీ లేదని తెలిసింది. క్రియాటినిన్ 1.0 ఎంజీ/డీఎల్ ఉంది. యూరియా 28 ఎంజీ/డీఎల్ ఉంది. నాకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
  - ప్రకాశరావు, గుంటూరు

 కొంతమందికి పుట్టుకతో ఒక కిడ్నీయే ఉంటుంది. అయితే వారిలో ఒక కిడ్నీయే ఉన్నప్పటికీ అది నార్మల్‌గా పనిచేస్తుంటే ఎలాంటి ఇబ్బందులూ రావు. ఒక కిడ్నీ ఉన్నవాళ్లల్లో కొంతమందికి మూత్రంలో ప్రొటీన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు (బీపీ) కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇలా ఉన్నట్లయితే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బ తినకుండా ఉండటానికి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. మూత్రంలో ప్రొటీన్ పోకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. నొప్పి నివారణ మందుల వంటి పెయిన్‌కిల్లర్స్ కిడ్నీకి హాని చేస్తాయి. కాబట్టి వాటితో పాటు కిడ్నీకి హాని కలిగించే మందులు వాడకూడదు.
 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా భార్యకు గర్భం వచ్చిన ఏడో వారంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించాం. ఆమెది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని, గర్భసంచిలో కాకుండా ప్రెగ్రెన్సీ కుడివైపు ఉండే ట్యూబ్‌లో వచ్చిందని డాక్టర్ చెప్పారు. అయితే గుండెచప్పుళ్లు వినిపిస్తున్నాయని అన్నారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలోనూ గుండె శబ్దాలు వినిపిస్తాయా? ఇప్పుడు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని చెబుతున్నారు. ఇది మందులతో తగ్గదా? గతంలోనూ ఒకసారి ఆమెకు గర్భం వచ్చినప్పుడు ఎడమవైపు ఇలాగే జరిగి, ఆ వైపు ఉన్న ట్యూబు తొలగించారు. ఇప్పుడు ఇలాగే జరిగితే భవిష్యత్తులో గర్భధారణ ఎలా జరుగుతుంది? దయచేసి వివరించండి.
 - ఆర్.కె., కొత్తగూడెం


 గర్భసంచిలో కాకుండా ట్యూబ్‌లోనే గర్భం ఉండే పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కండిషన్‌లోనూ గుండెచప్పుళ్లు వినిపిస్తుంటాయి. అలాగే మీరు చెప్పినట్లుగా ఈ పరిస్థితిని మందులతోనూ తగ్గించవచ్చు. అయితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కుగా ఉన్నా లేదా గుండెచప్పుడు వినిపిస్తున్నా లేదా ప్రెగ్నెన్సీ హార్మోన్ (బీటా హెచ్‌సీజీ) ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్నా అప్పుడు మందులు వాడటం వల్ల ఫలితం తక్కువగా ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అది అకస్మాత్తుగా కడుపులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోడానికి శస్త్రచికిత్సను డాక్టర్లు సూచిస్తుంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి లాపరోస్కోపిక్ సర్జరీ మంచి ప్రత్యామ్నాయం. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ట్యూబ్ ఉంచాలా లేదా అనే నిర్ణయాన్ని అప్పటి పరిస్థితిని బట్టి డాకర్లు తీసుకుంటారు. ఇక ఆమెకు అకస్మాత్తుగా రక్తస్రావం అయితే మాత్రం ఓపెన్ సర్జరీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ భార్య రక్తం గ్రూప్ నెగెటివ్ అయితే ఆమెకు ‘యాంటీ-డీ’ అనే ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమెకు రెండు ట్యూబులు తొలగించినా మీరు ఆందోళన చెందకండి. ఆమె సురక్షితంగా ఉండే ఆ తర్వాత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని పిలిచే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) మార్గాన్ని అనుసరించవచ్చు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement