దైవ సాక్షాత్కారం | christmass special information | Sakshi
Sakshi News home page

దైవ సాక్షాత్కారం

Dec 25 2017 12:04 AM | Updated on Dec 25 2017 12:04 AM

christmass special information - Sakshi

క్రీస్తు పేరెత్తిన వారిని బంధించి, చిత్రహింసలు పెట్టడంలోని అపరిమిత ఆనందానికి దాసుడనై ఉండగా ఒకనాటి మధ్యాహ్నం – యెరూషలేము నుంచి దమస్కునకు వెళుతున్నపుడు – విర్రవీగుతున్న పౌలు అహంకారానికి దారి మధ్యలో కర్రసాయం కావలసి వచ్చింది! భరించలేని వెలుగొకటి అకస్మాత్తుగా అతడి కళ్లను కమ్మింది. దివ్యమైన ఆ వెలుగు అతడి చుట్టూ ప్రకాశించింది. మూర్ఛిల్లిన విధంగా నేలపై పడ్డాడు పౌలు.

‘‘సౌలా... సౌలా... నీవెందుకు హింసించుచున్నావు’’ అంటోంది అదృశ్య స్వరం. ‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగాడు పౌలు... తన అంధకారంలోంచి లేవకుండానే. ‘‘నజరేయుడైన యేసును’’ అనే పలుకు వినిపించింది. పౌలు చుట్టూ ఉన్నవాళ్లు ఆ వెలుగును చూశారు కానీ, ఆ మాటలు వారికి వినిపించలేదు. అంత వెలుగును చూశాక పౌలు ఒక్కసారిగా అంధుడైపోయాడు. ‘‘ప్రభువా, నన్నేమి చెయ్యమంటావు’’ అని అడిగాను. వెంటనే దమస్కు వెళ్లమని ఆయన పౌలును ఆజ్ఞాపించారు. అక్కడికి వెళ్లాక ఏం చెయ్యవలసిందీ తెలుస్తుందని సముదాయించారు. లేచి, దమస్కు వైపు పగటిపూట చీకట్లో తడుముకుంటూ నడిచాడు. అననీయ అనే భక్తుడు అక్కడ పౌలును కలిసి ‘‘సౌలా... సహోదరా, దృష్టిని పొందుము’’ అని చెప్పిన తక్షణం పౌలు ఈ ప్రపంచాన్ని చూడగలిగాడు.

పౌలుకు మెల్లిగా ప్రభువు మహిమ తెలుస్తోంది! దమస్కు నుంచి యెరూషలేము తిరిగి వచ్చి క్రీస్తును వెతుక్కున్నాడు. దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడై ప్రభువుని చూశాడు! తన పాపాలకు „ýమాపణ వేడుకున్నాడు. స్తెఫను అనే విశ్వాసిని రాళ్లతో కొట్టి చంపుతుండగా చూస్తూ నిలబడి, హంతకుల వస్త్రాలకు కావలిగా ఉన్న తన దుర్మార్గానికి ప్రాయశ్చిత్తాన్ని కోరాడు. యేసు కనికరించాడు. నేటి నుంచి నువ్వు ‘సౌలు’ కాదు, ‘పౌలు’గా పిలవబడతావు అని దీవించాడు.

దేవుడు కనిపిస్తాడా? కనిపిస్తాడు! కనిపిస్తే చూడగలమా? చూడగలం! ఈ క్షణం వరకు మనం గడిపిన జీవితానికి, మారుమనసు పొంది కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన క్షణానికి మధ్య దేవుడి సాక్షాత్కారం అవుతుంది! మహోజ్వలమైన వెలుగులో ఆయనను చూసే శక్తి మనకు లేకపోవచ్చు. పరివర్తన వల్ల మనలో కలిగే ప్రతిమార్పూ దైవాంశకు ప్రతిరూపమే. ఈ మాటను లోకానికి చాటుతూ, ఖండాలు తిరిగాడు క్రైస్తవ మత ధర్మదూతగా మారిన పౌలు. ఆయనే సెయింట్‌ పాల్‌.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement