ఏడేళ్ల పోరాటానికి రూ.25 పరిహారం

A case has been lodged with the Gujarat High Court for seven years - Sakshi

గెలుపు

ఆమె ఏడేళ్లు పోరాడింది. నష్టపరిహారంగా 25 రూపాయలు మాత్రమే కోరుకుంది! ఇంతకీ ఆమె గెలిచిందా? ఇంకెవర్నైనా గెలిపించిందా?!

చీకటి పడ్డాక మన దేశంలో స్త్రీలను అరెస్ట్‌ చెయ్యకూడదు. అది చట్టం. చీకటి పడడం అనే మాటనే చట్టం ‘సూర్యాస్తమయం’ అంది. సూర్యాస్తమయం అయ్యాక స్త్రీలను అరెస్ట్‌ చెయ్యడం నేరం. పోలీసులు చేసిన అలాంటి ఒక నేరం మీద ఏడేళ్లుగా గుజరాత్‌ హైకోర్టులో ఒక కేసు నడుస్తోంది. చివరికి మొన్న సోమవారం  తీర్పు వెలువడింది. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్‌ చేసి తీసుకెళ్లిన ఆ మహిళకు (కేసు వేసిన మహిళ) పోలీసులు కోర్టు ఖర్చుల నిమిత్తం 2,500 రూపాయలను పరిహారంగా చెల్లించాలని జడ్జి తీర్పు ఇచ్చారు. తర్వాత ఆ మహిళ వైపు చూసి, ‘అమ్మా.. మీకు ఆ మొత్తం సరిపోకపోతే, మరికొంత మొత్తం కోరవచ్చు’ అని సూచించారు.

‘25 రూపాయలు చాలు న్యాయమూర్తి గారూ’ అన్నారు ఆవిడ! కోర్టు హాల్లో అంతా అమెను మెచ్చుకోలుగా చూశారు. ‘సొంత ఖర్చులు పెట్టుకుని ఇంతకాలం ఆమె కేసు నడిపింది పరిహారం కోసం కాదనీ, పోలీసులైనా సరే చట్ట విరుద్ధంగా ప్రవర్తించకూడదని చెప్పడానికేనని’ తెలిసి అంతా ఆమెను అభినందించారు. ఆమె పేరు వర్షాబెన్‌ పటేల్‌. ఉంటున్నది గుజరాత్‌లోని వడోదరలో. 2012 నవంబర్‌ 5 రాత్రి ఒక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆమె ఇంటికి వచ్చి, చీటింగ్, ఫోర్జరీ నేరారోపణలపై ఆమెను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. ‘చట్ట విరుద్ధంగా (మేజిస్ట్రేట్‌కు అనుమతి తీసుకోకుండా) ఆ మహిళను అరెస్ట్‌ చెయ్యవలసి అవసరం ఏమిటి?’ అని దిగువ కోర్టు న్యాయమూర్తి అడిగినప్పుడు, ‘మేజిస్ట్రేట్‌ అందుబాటులో లేరు.

వెంటనే అరెస్ట్‌ చెయ్యకుంటే సాక్ష్యాధారాలను ఆమె నిర్మూలించే అవకాశం ఉండడంతో అప్పటికప్పుడు ఆమెను అరెస్ట్‌ చెయ్యక తప్పలేదు’ అని ఇన్‌స్పెక్టర్‌ వివరణ ఇచ్చాడు. దీనిపై వర్షాబెన్‌ పటేల్‌ హైకోర్టును ఆశ్రయించారు. కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా నిరుత్సాహపడకుండా, నీరసించి పోకుండా పోరాడుతూనే ఉన్నారు. చివరికి విజయం సాధించారు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 46(4) నిషే«ధాజ్ఞల ప్రకారం ఒక మహిళను సూర్యాస్తమయం తర్వాత గానీ, సూర్యోదయానికి ముందు గానీ.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, అది కూడా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా అరెస్ట్‌ చెయ్యకూడదు. ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో తను గెలవడం కన్నా, చట్టాన్ని ఓడిపోకుండా నిలబెట్టగలిగానని వర్షాబెన్‌ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top