కెరీర్ కౌన్సెలింగ్

కెరీర్ కౌన్సెలింగ్


 నేను డెయిరీ రంగంలో ఉపాధిని కోరుకుంటున్నాను. డెయిరీ రంగంలో ఉన్న కోర్సులు, అర్హతలతోపాటు కెరీర్ ఏ విధంగా ఉంటుందో వివరించండి?

పాల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో డెయిరీలు ఉన్నాయి. దీంతో డెయిరీ రంగంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో మిల్క్ ప్రాసెసింగ్, స్టోరేజీ, ప్యాకేజింగ్, రవాణా, పంపిణీ వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

 

 డెయిరీ కోర్సులు: డిప్లొమా స్థాయిలో డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ ఉన్నాయి. ఎంఎస్సీలో డెయిరీ కెమిస్ట్రీ/ టెక్నాలజీ, డెయిరీ ఇంజనీరింగ్, డెయిరీ మైక్రో బయాలజీ, డెయిరీ సైన్స్ కోర్సులూ, బీటెక్‌లో డెయిరీ టెక్నాలజీ, ఎంటెక్‌లో డెయిరీ కెమిస్రీ ్ట/టెక్నాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ, పీహెచ్‌డీ లో డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రో బయాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ప్రవేశానికి  ఇంటర్మీడియెట్ (10+2) బైపీసీలో ఉత్తీర్ణత సాధించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

 

 కెరీర్: డెయిరీ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఐస్‌క్రీమ్ యూనిట్లు, క్వాలిటీ కంట్రోల్ యూనిట్లు డెయిరీ టెక్నాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మేనేజర్, ఎడ్యుకేషనిస్టు, డెయిరీ టెక్నాలజిస్టు, మైక్రో బయాలజిస్టు, న్యూట్రీషనిస్టు, డెయిరీ సైంటిస్టు, ఇండస్ట్రీ సూపర్‌వైజర్, డెయిరీ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల్లో స్థిరపడొచ్చు. సొంత డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

 

 వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వరకు ఆర్జించొచ్చు. తర్వాత అనుభవం ఆధారంగా నెలకు రూ.15 వేలకు పైగా వేతనం పొందొచ్చు.

 

డెయిరీ కోర్సులను అందిస్తున్న సంస్థలు



నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

 వెబ్‌సైట్: www.ndri.res.in

ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ- ఆనంద్

 వెబ్‌సైట్: www.aau.in

ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ

 వెబ్‌సైట్: www.igau.edu.in

 కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ యూనివర్సిటీ-బీదర్

 వెబ్‌సైట్: www.kvafsu.kar.nic.in

 మన రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ - తిరుపతి డెయిరీ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్; ఎంఎస్సీలో డెయిరీంగ్ కోర్సులను అందిస్తోంది.

 వెబ్‌సైట్: www.svuu.edu.in

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top