ఆ పా‘పాలు’ మాకొద్దు! | India No to non vegetarian milk from America | Sakshi
Sakshi News home page

ఆ పా‘పాలు’ మాకొద్దు!

Jul 20 2025 4:58 AM | Updated on Jul 20 2025 1:07 PM

India No to non vegetarian milk from America

అమెరికా నుంచి ‘మాంసాహార పాల’కు నో

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత ప్రభుత్వం

వాణిజ్య అవరోధం అంటున్న అగ్ర రాజ్యం

యూఎస్‌ పాలు వస్తే రూ.లక్ష కోట్లకుపైగా నష్టం!

ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారత్‌. అంతేకాదు వినియోగంలోనూ మనది అగ్రస్థానమే. అందుకే, మన డెయిరీ మార్కెట్లోకి ప్రవేశించాలని అగ్ర రాజ్యం ఉవ్విళ్లూరుతోంది. భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ‘మాంసాహార పాల’ అంశం తెరపైకి వచ్చింది. ఈ పాలను భారత్‌కు ఎగుమతి చేస్తామని యూఎస్‌.. కుదరదని మనదేశం పట్టుపడుతున్నాయి. 

మనదేశంపై ప్రతీకార సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ఆగస్టు 1 గడువు ముగిసేలోపు ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనడంలో ఇరుపక్షాలు తలమునకలయ్యాయి. వాణిజ్య చర్చల నేపథ్యంలో మన పాడి పరిశ్రమ తలుపులను అమెరికా దిగుమతులకు తెరవడానికి మనదేశం  చూపుతున్న ప్రతిఘటన కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదన్నది మాత్రం సుస్పష్టం. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఆవును గోమాతగా, ఆవు నుంచి వచ్చే పాలు, పేడ అన్నింటినీ అత్యంత పవిత్రమైన వస్తువులుగా భావించే దేశం మనది. రోజువారీ ఆహారంలోనూ, సనాతన ధర్మ సంప్రదాయాల్లోనూ పాలు, పెరుగు, నెయ్యికి ఉన్న విలువ అందరికీ తెలిసిందే. అలాంటి గోవుకు మనం గడ్డి, ఇతర శాకాహార దాణాను మాత్రమే వినియోగిస్తాం. కానీ, విదేశాల్లో అలా కాదు. జంతువుల ఆధారిత దాణా కూడా వినియోగిస్తారు. ఇప్పుడు ఇదే భారత్‌ – అమెరికా వాణిజ్యంలో చర్చనీయాంశంగా మారింది. దిగుమతి చేసుకునే పాలకు ‘జంతువుల ఆధారిత దాణా తీసుకోని ఆవుల నుండి సేకరించాం’ అన్న కఠిన ధ్రువీకరణ ఉండాలని భారత్‌ పట్టుపడుతోంది.

అమెరికా ఏమంటోంది?
మన డిమాండ్లను ‘అనవసర వాణిజ్య అవరోధం‘ అని అమెరికా పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వద్ద కూడా ఈ విషయాన్ని లేవనెత్తింది. 2024 నవంబర్‌లో అమలులోకి వచ్చిన ‘నవీకరించిన పాల ధ్రువీకరణ’లో అలాంటి ఆందోళనలను భారత్‌ పేర్కొనలేదని అగ్ర రాజ్యం అంటోంది.

అదే జరిగితే..
కుటుంబ వినియోగ వ్యయ సర్వే (2023–24 ప్రకారం) దేశంలో సుమారు 94%  జనాభా పాలు, పాల ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. ప్రపంచం డెయిరీ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యూఎస్‌ ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే ఇక్కడి మార్కెట్లోకి చవక పాలు, పాల ఉత్పత్తులు వెల్లువెత్తుతాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విశ్లేషణ ప్రకారం.. యూఎస్‌ డెయిరీ ఉత్పత్తుల దిగుమతులను ప్రభుత్వం అనుమతిస్తే భారత్‌ ఏటా ఏకంగా రూ.1.03 లక్షల కోట్ల నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

మాంసాహార పాలు అంటే..
మాంసం లేదా రక్తం వంటి జంతువుల ఆధారిత దాణాను ఆహారంగా తీసుకునే ఆవుల నుండి వచ్చేవే మాంసాహార పాలు. 
» వివిధ నివేదికల ప్రకారం.. యూఎస్‌లో పశువులకు ఆహారంగా జంతు ఆధారిత దాణా కూడా వాడుతున్నారు. 
»  పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు లేదా కుక్కల మాంసం, వ్యర్థాల ఆధారంగా తయారైన దాణా వీటిలో ఉంది. 
» పశువులకు ప్రోటీన్‌ కోసం పంది, గుర్రపు రక్తాన్ని, అలాగే బలిష్టంగా తయారయ్యేందుకు పశువుల భాగాల నుండి తీసిన కొవ్వును ఆహారంగా ఇస్తున్నారట.

ధ్రువీకరణ ఉండాల్సిందే..: ఆహార దిగుమతులకు భారత పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ పశువైద్య ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. ఇది పాల ఉత్పత్తులు సహా అన్ని రకాల ఉత్పత్తులు జంతువుల ఆధారిత దాణా తీసుకోని ఆవుల నుండి వచ్చాయని నిర్ధారిస్తుంది. ఈ నిబంధనను డబ్ల్యూటీఓ వేదికగా అమెరికా విమర్శించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌ఆర్‌టీ) నేషనల్‌ ట్రేడ్‌ ఎస్టిమేట్‌ నివేదిక ప్రకారం.. జంతువుల ఆధారిత దాణా తీసుకున్న ఆవుల నుండి సేకరించిన పాలతో తయారైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై భారత్‌ తన నిషేధాన్ని కొనసాగిస్తోంది. 

సుంకాలు ఎక్కువే..: ప్రస్తుతానికి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తోంది. చీజ్‌పై 30%, వెన్న 40%, పాలపొడిపై 60% సుంకం ఉంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల దిగుమతులు కూడా మనకు లాభదాయకం కావు.

భారత్‌ – పాల ఉత్పత్తి
» 1998 నుంచి ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మనమే నం.1. ప్రస్తుతం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% వాటా మనదే.
» దేశంలో పాల ఉత్పత్తి 2014–15లో 146.31 మిలియన్‌ టన్నుల నుంచి 2023–24లో 239.30 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ప్రపంచ దేశాల మొత్తం పాల ఉత్పత్తి 2023–24లో 981 మిలియన్‌ టన్నులు.
» దేశంలో తలసరి పాల లభ్యత అప్పట్లో రోజుకు 319 గ్రాముల నుంచి ఇప్పుడు 471 గ్రాములకు చేరింది.
»  ప్రపంచ సగటు తలసరి పాల లభ్యత 2024లో 329 గ్రాములు.
»  దేశ జీడీపీలో 4–5% వాటా డెయిరీ రంగానిదే.
» కేంద్ర ప్రభుత్వ ‘ప్రాథమిక పశు సంవర్థక గణాంకాలు 2024’ ప్రకారం.. 2023–24లో దేశంలో పాల ఉత్పత్తిలో ఆవులదే అగ్రస్థానం. అన్ని రకాల గోవులూ కలిపి మొత్తం పాలలో సుమారు 55%  ఉత్పత్తి చేస్తున్నాయి.
»  పాల ఉత్పత్తిలో మన తరవాత అమెరికా (11.04%), పాకిస్తాన్‌ (6.73%) ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement