
ప్రీ–ఓన్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ యాపిల్ హవా
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్
సాక్షి, స్పెషల్ డెస్క్ : ఐఫోన్.. ఇది చాలామందికి స్టేటస్ సింబల్. బ్రాండ్ న్యూ ఫోన్కే కాదు.. పాతదైనా సరే ఐఫోన్కు ఏమ్రాతం క్రేజ్ తగ్గలేదు. ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఐఫోన్ హవా నడుస్తోంది. అమ్మకాల సంఖ్య పరంగా సామ్‌సంగ్ మనదేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నప్పటికీ.. వృద్ధి రేటులో మాత్రం ఆపిల్ నంబర్‌వన్‌గా నిలిచింది. మనదేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్లో సామ్‌సంగ్, యాపిల్ తరవాత వన్ ప్లస్, షియోమి వంటివి ఉన్నాయి.
యాపిల్ తయారీ ఐఫోన్–16 విడుదలై, అందుబాటులోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అమ్మకాలతో పోలిస్తే.. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్–17 మోడల్ విక్రయాలు చైనా, యూఎస్‌లో 14% అధికంగా నమోదయ్యాయి. భారత్‌లోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కేవలం కొత్త ఐఫోన్లకే గిరాకీ ఉందనుకుంటే పొరపాటే.. మార్కెట్‌ను బట్టి ప్రపంచవ్యాప్తంగా పాత ఐఫోన్ల కోసమూ కస్టమర్లు ఎగబడుతున్నారు.
భారత్‌లో చేతులు మారుతున్న (సెకండ్ హ్యాండ్) పాత ఫోన్లలో అయిదింట మూడు ఐఫోన్లేనని రీసేల్ ప్లాట్‌ఫామ్ ‘క్యాషిఫై’ చెబుతోంది. ప్రీమియం మోడళ్ల పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. ఆ సంస్థ సర్వే ప్రకారం కొనుగోలుదారుల్లో దాదాపు మూడోవంతు మంది.. రూ.21,000 నుంచి రూ.35,000 వరకు సెకెండ్ హ్యాండ్ ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెరుగుతున్నఆకాంక్ష
ఇప్పటికే మొబైల్ ఫోన్ల విస్తృతి పెరగడం, కస్టమర్లు ఎక్కువ కాలంపాటు మొబైల్స్ వినియోగిస్తున్న కారణంగా యూరప్, యూఎస్‌ఏ, జపాన్ వంటి మార్కెట్లలో 2025 జనవరి–జూన్ మధ్య ప్రీ–ఓన్డ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడం విశేషం.
ప్రీమియం మోడళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం ప్రీ–ఓన్డ్ అమ్మకాలకు కారణమవుతోంది. ప్రజల్లో అత్యధికులకు యాపిల్ ఫోన్లను కలిగి ఉండాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. కానీ తలసరి ఆదాయం ఆ స్థాయిలో లేదు. అందుకే కొత్త ఫోన్ కొనలేకపోయినా.. కనీసం సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.
భారత్‌లో 5 శాతం
జనవరి–జూన్ కాలంలో 2024తో పోలిస్తే 2025లో పాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఆఫ్రికాలో 6 శాతం, భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో చెరి 5 శాతం దూసుకెళ్లింది. యూఎస్‌ఏ, చైనా, లాటిన్ అమెరికా, జపాన్ దేశాలు చెరి 3 శాతం, యూరప్‌లలో ఒక శాతం వృద్ధి నమోదైందని మార్కెట్ పరిశోధన సంస్థ ‘కౌంటర్‌పాయింట్’ వెల్లడించింది. అయితే అన్ని మార్కెట్లలోనూ రీఫర్బిష్డ్ విభాగంలో యాపిల్ ఐఫోన్ల హవా నడుస్తుండడం విశేషం.
19 శాతం పెరిగి..
భారత్‌లో రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తొలి స్థానంలో ఉన్న సామ్‌సంగ్ విక్రయాలుఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 1 శాతం తగ్గాయి. గెలాక్సీ ఎస్22, ఎస్21 అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఉన్నాయి.ఐఫోన్ 13, 14 సిరీస్ లను వినియోగదారులు ఇష్టపడు తుండటంతో యాపిల్ అమ్మకాలు ఏకంగా 19 శాతం పెరిగి, రెండో స్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ వెల్లడించింది.
ఐఫోన్ ముచ్చట్లు
» ప్రపంచవ్యాప్తంగాఐఫోన్ కస్టమర్లు..156 కోట్లకుపైమాటే
» 2024లోఅంతర్జాతీయంగా ఐఫోన్ అమ్మకాలు.. 23 కోట్లకుపైనే
» గతఏడాది భారత్‌లో అమ్ముడైన ఐఫోన్స్.. 1.2 కోట్లు
» భారత్‌లో 2024–25లో కంపెనీ ఆదాయం 13 శాతం వృద్ధితో 900 కోట్ల డాలర్లు
» 2025లో వాడేసిన, రిఫర్బిష్డ్ ఫోన్లప్రపంచ మార్కెట్ విలువ 6500 కోట్ల డాలర్లకుపైనేఉంటుందని అంచనా.