చిగురిస్తున్న డాలర్ కల.. | America positivity towards Indian students | Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న డాలర్ కల..

Published Mon, Mar 17 2025 4:02 AM | Last Updated on Mon, Mar 17 2025 4:04 AM

America positivity towards Indian students

భారతీయ విద్యార్థులపై అమెరికా సానుకూలత

దేశాలపై ఆంక్షల కొరడా.. భారత్‌కు మాత్రం ఊరట

ప్రస్తుతానికి పార్ట్‌టైం ఉద్యోగాలపై వీడని పీటముడి  

భవిష్యత్‌లో ఈ నిబంధనల సడలింపునకు అవకాశం 

విద్యార్థుల్లో పెరుగుతున్న ఆశలు  

భారతీయుల అమెరికా కలలు మళ్లీ చిగురిస్తున్నాయి. విద్య, పర్యాటక వీసాల విషయంలో భారత్‌ పై అగ్రరాజ్యం కాస్త సానుకూల దృక్పథంతో ఉండటం కలిసొచ్చే అంశం. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. అక్రమ వలసల పేరుతో వేట కొనసాగుతోంది. తాజాగా 41 దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ దేశాలను మూడు కేటగిరీలుగా విభజించి పర్యాటక వీసాలపై ఆంక్షలు పెట్టాలని నిర్ణయించినట్టు అమెరికన్‌ మీడియా పేర్కొంది.  

ఈ మూడు జాబితాల్లోనూ భారత్‌ ప్రస్తావన లేకపోవడంతో మనవాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాత రోజులు మళ్లీ రాబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తాత్కాలిక ఉద్యోగాలపై కూడా భారతీయులకు ఊరట లభిస్తుందని ప్రవాస భారతీయులూ అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్‌

41 దేశాలు... మూడు కేటగిరీలు 
41 దేశాల నుంచి వచ్చే పర్యాటక, విద్యాపరమైన వీసాలపై ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలుగా విభజించారు. రెడ్‌ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 11 దేశాలను చేర్చా­రు. వాణిజ్య మైత్రి కొనసాగుతున్న ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలున్న దేశాలను ఆరెంజ్‌ కేటగిరీలో పెట్టారు. 

ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా 10 దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశా­లను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు.  

మనవాళ్ల అవసరం ఉండబట్టే.. 
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11.26 లక్షలు. వారిలో 29% భారతీయులే. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కీలకమైన ఉద్యోగాల్లోనూ భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో గతంలో చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్లు. ఈ స్థానాన్ని భారత్‌ అధిగమించింది. ఈ కారణంగానే ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలపై ఆంక్షలు  విధించే సాహసం అమెరికా చేయడం లేదనేది కన్సల్టెన్సీల అభిప్రాయం. 

అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ రూపొందించిన ఓపెన్‌ డోర్స్‌ రిపోర్టులోనూ ఇదే వెల్లడైంది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది 10% పెరిగి 1,96,567కు చేరింది. అండర్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13% పెరిగి 36,053కు చేరింది. అమెరికాలోనే ఉపాధి పొందాలని భావిస్తూ.. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) తీసుకుంటున్న భారతీయుల సంఖ్య 97,556 (2024లో 41% ఎక్కువ)కు చేరింది. 

ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఐటీ సెక్టార్‌లో పనిచేసే సామర్థ్యం భారతీయులకే ఉందని ఓపెన్‌ డోర్స్‌ రిపోర్టు పేర్కొంది. దీంతో భవిష్యత్‌లోనూ భారతీయ వీసాలపై పెద్దగా ఆంక్షలు ఉండవనే సంకేతాలు వస్తున్నాయని ప్రవాసులు అంటున్నారు.

శుభ సంకేతాలే
ఆంక్షల విషయంలో భారత్‌ను కొంత సానుకూలంగా చూడటం శుభ పరిణామం. అయితే, తాత్కాలిక ఉద్యోగాల విషయంలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. నిబంధనలకు విరుద్ధంగా చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేయాలనే ఆలోచనలో విద్యార్థులు ఉండొద్దు. 

ఇప్పటికీ అమెరికాలో ఇలాంటి వారిని గుర్తించేందుకు ట్రంప్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. అయితే, వాణిజ్యపరంగా చూస్తే, ఆంక్షల వల్ల మానవవనరుల కొరత ఉంది. కాబట్టి ఎక్కువ కాలం ఆంక్షలు ఉండకపోవచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను ఏరేసిన తర్వాత భారతీయులకు కొంత స్వేచ్ఛ ఉండే వీలుంది.  –వి.నరేష్, అమెరికాలో గ్రీన్‌ కార్డ్‌ ఉన్న భారతీయుడు

కొంత ఊరట లభించినట్టే
మూడు కేటగిరీల్లో భారత్‌ లేకపోవడం ఆశాజనకం. అమెరికాలో విద్యకు వెళ్లే ప్రతీ విద్యార్థి అక్కడ తాత్కాలిక ఉపాధి కోసం యత్నిస్తారు. మనవాళ్లకు కష్టపడి పనిచేసే స్వభావం ఉంది. అమెరికన్‌ కంపెనీలు ఈ విషయాన్ని గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న భయాలు భవిష్యత్‌లో తొలగిపోతాయని భావిస్తున్నాం.  – ఈవీఎల్‌ఎన్‌ మూర్తి (కన్సల్టెంట్‌ సంస్థ ఎండీ, హైదరాబాద్‌)

వీసాలపై అమెరికా ఆంక్షలు విధించే 3 కేటగిరీ దేశాలు
రెడ్‌ జోన్‌: అఫ్గానిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తరకొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనెజువెలా, యెమన్‌

ఆరెంజ్‌ జోన్‌:  బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెరాలియోన్, సౌత్‌ సూడాన్, తుర్క్‌మెనిస్తాన్‌

ఎల్లో జోన్‌:  అంగోలా, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరాన్, కేప్‌వెర్డ్, చాడ్, కాంగో, డీఆర్‌ కాంగో, డొమినీసియా, గునియా, గాంబియా, లైబేరియా, మాలావి, మాలి, మారింటానియా, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవీస్, లూసియా, సావో టామ్‌ అండ్‌ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement