
గణేశ్ నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
నాదర్‌గుల్‌కు చెందిన చైతన్య, ఫీర్జాదిగూడకు చెందిన రిషితేజ దుర్మరణం
మరో ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
బడంగ్‌పేట్/ ఉప్పల్: లండన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువకులు దుర్మరణంపాలయ్యారు. మృతులను నాదర్ గుల్‌కు చెందిన చైతన్యయాదవ్ (అభి), పీర్జాదిగూడకు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్‌కు చెందిన తర్రె ఐలయ్యయదవ్, మంగమ్మ దంపతులకు చిన్న కుమారుడు చైతన్యయాదవ్ (23) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో లండన్ వెళ్లాడు.
బోడుప్పల్ లోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ అమృత కాలనీలో నివా ముండే రాపోలు రవీందర్‌రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు రిషితేజ (21)హైదరాబాద్‌లో బీబీఏ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం గత మే నెలలో లండన్ వెళ్లాడు. వీరు మరికొందరు తెలుగు విద్యార్థులతో కలిసి అక్కడ నివా సం ఉంటున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని స్నేహితులంతా గణనాథున్ని ప్రతిష్టించారు.
ఆదివారం సా యంత్రం నిమజ్జనం కోసం 9 మంది రెండు కార్లలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు మలుపు వద్ద వారి కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వెనుక వస్తున్న ట్రక్కు రెండు కార్లను ఢీకొట్టడంతో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో చైతన్య యాదవ్, రిషితేజ మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
రెండు కుటుంబాల్లో విషాదం
ఇద్దరు యువకుల మరణంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. చైతన్యయాదవ్ మరణవార్తతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రిషితేజ చివరగా తల్లి కిరణ్మయితో ఆదివారం మాట్లాడాడు. ‘నిద్ర వస్తోంది.. లేచాక మాట్లాడతాను అని చెప్పిన మాటలే చివరివి అయ్యాయి’అని అతడి తండ్రి రవీందర్‌రావు కన్నీరు మున్నీరయ్యాడు.