కార్డియాలజీ కౌన్సెలింగ్ | Cardiology counseling | Sakshi
Sakshi News home page

కార్డియాలజీ కౌన్సెలింగ్

Jul 9 2015 12:50 AM | Updated on Sep 3 2017 5:08 AM

కార్డియాలజీ కౌన్సెలింగ్

కార్డియాలజీ కౌన్సెలింగ్

నా వయసు 58 ఏళ్లు. నాకు ఇటీవలే నెలసరి ఆగిపోయింది. ఆ తర్వాత గుండెదడ రావడం, తరచూ చెమటలు పోయడం

మందులు వాడితే సరిపోదా?
 నా వయసు 58 ఏళ్లు. నాకు ఇటీవలే నెలసరి ఆగిపోయింది. ఆ తర్వాత గుండెదడ రావడం, తరచూ చెమటలు పోయడం జరుగుతున్నాయి. ఈ వయసులో ఇలా జరుగుతుందని చదివాను. కానీ మొన్న రాత్రి ఈ దడ విపరీతమైపోయి హాస్పిటల్‌కు వెళితే, ఈసీజీ మొదలైన పరీక్షలు చేసి మందులిచ్చారు. నేను ఒక గంటలో మొత్తంగా మామూలైపోయాను. కానీ వారు నాకు ‘యాంజియోగ్రామ్’ అవసరమని చెప్పారు. నాకేమో ఇప్పుడు బాగానే ఉన్నాను కనుక మందులు సరిపోతాయని అనిపిస్తోంది. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు.
నాగవర్ధన, చిత్తూరు

 నెలసరి ఆగిన తర్వాత తరచుగా కొందరికి ‘పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్’లో అలా జరుగుతుందని చదివి ఉంటారు. కానీ రాత్రి నిద్ర సమయంలో మెలకువ వచ్చి, ఈసీజీలో మార్పు వచ్చినట్లయితే, అప్పుడు గుండెకు రక్తప్రసారం తగ్గి కూడా ఇవే లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ చెప్పినట్లుగా యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకొని, ఆ ఫలితాలను బట్టి మందులు ఏ విధంగా వాడాలో నిర్ధారణ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం.

 నా వయసు 75 ఏళ్లు. నాకు పదేళ్ల క్రితం బైపాస్ ఆపరేషన్ జరిగింది. గత ఆర్నెల్ల నుంచి ఏమాత్రం నడిచినా ఆయాసంతో పాటు ఛాతీ బరువుగా అవుతోంది. తిన్న తర్వాత ఏమాత్రం నడవలేను. ఎలా ఎందుకు జరుగుతోంది. నేనేం చేయాలో వివరించండి.
 - రత్నం, జగ్గయ్యపేట

 మీరు వివరించిన దాన్ని బట్టి మీకు ‘యాంజైనా’ అనే కండిషన్ ఉందేమో అనిపిస్తోంది.  మీకు బైపాస్ అయి పదేళ్లు అవుతోంది కాబట్టి మీకు అమర్చిన కాలి నుంచి తీసి, అమర్చిన రక్తనాళాలలో మళ్లీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా నిపుణులైన గుండె వైద్యులను సంప్రదించి, ఏ రక్తనాళాల్లో అడ్డంకులు మళ్లీ వచ్చాయో తెలుసుకోండి. ‘యాంజియోగ్రామ్’ పరీక్ష ద్వారా వాటిని తెలుసుకొని, ఆ అడ్డంకులను స్టెంటింగ్ ద్వారా తొలగించినట్లయితే మీరు మళ్లీ మామూలుగానే జీవనం సాగించగలుగుతారు. అయితే ఆ తర్వాత కూడా నియమబద్ధమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఆరోగ్యనియమాలు పాటిస్తూ, వైద్యుల సలహాతో కొన్ని మందులు వాడుతూ ఉండటం చాలా అవసరం.
 
 

Advertisement
Advertisement