
పిల్లలు బొద్దుగా లేదంటే ఊబకాయంతో ఉంటే చాలామంది ముచ్చటపడతారుగానీ.. వీరు సకాలంలో బరువు తగ్గించుకోవడం ద్వారా పెద్దయ్యాక మధుమేహం బారిన పడకుండా తప్పించుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. కచ్చితంగా చెప్పాలంటే పదమూడేళ్ల వయసు వచ్చేనాటికి పిల్లలు ఊబకాయులుగా లేకపోతే వారు పెద్దయ్యాక మధుమేహం బారిన పడే ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం చెబుతోంది. డెన్మార్క్‌లోని దాదాపు 62 వేల మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఆ దేశంలో తప్పనిసరి మిలటరీ సర్వీసు నిబంధన ఉన్న విషయం తెలిసిందే. పాఠశాలతోపాటు ఈ సర్వీసు సమయంలో నమోదు చేసిన వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీరి ఆరోగ్యంపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించుకోగలిగారు.
ఆ తరువాత జాతీయ ఆరోగ్య సమాచారం కింద వీరిలో ఎవరికైనా మధుమేహం వచ్చిందా? అన్నదాన్ని పరిశీలించారు. రెండింటినీ పోల్చి చూడటం ద్వారా సకాలంలో బరువు తగ్గిన పిల్లలకు పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. పిల్లలు బొద్దుగా అందంగా కనిపిస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోవచ్చుగానీ.. వారు సకాలంలో పెరిగిన ఒంటిని తగ్గించుకుంటే మేలన్న విషయం తమ అధ్యయనం చెబుతోందని స్టీవెన్ గోర్ట్‌మేకర్ అంటున్నారు.