ఈవెంట్ | Sakshi
Sakshi News home page

ఈవెంట్

Published Mon, Apr 18 2016 1:41 AM

book unveil events and stories discussion

తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘం ఏర్పాటు
‘ఇంతవరకూ రాసిన చరిత్రలో దొర్లిన తప్పులను సరిదిద్దుతూ, తెలంగాణ కేంద్రంగా కొత్తగా చరిత్రను నిర్మించే’ లక్ష్యంతో అడపా సత్యనారాయణ అధ్యక్షుడిగా, దేమె రాజారెడ్డి గౌరవాధ్యక్షుడిగా ‘తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘం’ ఏర్పడింది. స్థానిక, ప్రాంతీయ, ఉపజాతీయ చారిత్రక సంబంధాలపై లోతైన అధ్యయనం చేయడమే గాకుండా, వివిధ జిల్లాల్లో చరిత్ర పరిశోధక కేంద్ర శాఖలను ఏర్పాటుచేసి జిల్లాల వారి చరిత్రను కూడా నిర్మించాలనీ; చారిత్రక, పురావస్తు, నాణేలు, శాసనాలు, రాత ప్రతులు, అపురూప గ్రంథాల సేకరణ, రాష్ట్రస్థాయి ప్రదర్శనశాలను ఏర్పాటుచేయడంతోపాటు, రాష్ట్రేతర ప్రాంతాలకు తరలిన తాళపత్ర గ్రంథాలు, విలువైన కళాఖండాలను తెలంగాణకు తెప్పించాలనీ కూడా సంఘం తీర్మానించింది. కాలక్రమంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటుచేసుకోవడమే గాకుండా, అర్కయివల్ మెటీరియల్ అంతా ఒక దగ్గరికి చేర్చేందుకు కృషి చేయాలనీ; తెలంగాణ చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలనీ కూడా సంఘం తన లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. ఈ సంఘం తరపున తేనున్న పత్రికకు సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకులుగా ఉంటారు.
 
 కవిసేన మేనిఫెస్టో- సాహిత్య చర్చ
 శ్రీత్యాగరాయ గానసభ, భీమన్న సాహిత్య నిధి ఆధ్వర్యంలో- ఏప్రిల్ 21న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో శేషేంద్ర శర్మ ‘కవిసేన మేనిఫెస్టో’ నూతన ముద్రణ ఆవిష్కరణ, చర్చ ఉంటాయి. ననుమాస స్వామి, ముక్తేవి భారతి, కళావేంకట దీక్షితులు, బన్న ఐలయ్య, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, వి.పి.చందన్ రావు పాల్గొంటారు.
 
 శివలెంక రాజేశ్వరీదేవి పుస్తకావిష్కరణ
 నామాడి శ్రీధర్ సంపాదకత్వలో ‘ప్రేమలేఖ’ ప్రచురిస్తున్న శివలెంక రాజేశ్వరీదేవి కవితల, స్మృతుల సంకలనం ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 24న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్‌లో జరగనుంది. రావు బాలసరస్వతీదేవి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, అంబటి సురేంద్రరాజు పాల్గొంటారు.
 
 మా కథలు- 2015
 2015లో ప్రచురించబడిన కథలతో, ‘తెలుగు కథ రచయితల వేదిక’ ఆధ్వర్యంలో, సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కథాసంకలనం తేనున్నట్టు కన్వీనర్ సీహెచ్.శివరామప్రసాద్ తెలియజేస్తున్నారు. కథకులు తమ కథలను మే 10లోగా పంపాలి. చిరునామా: కన్వీనర్, తె.క.ర.వే. స్వగృహ అపార్ట్‌మెంట్, సి బ్లాక్, జి-2, భాగ్యనగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72. ఫోన్: 9390085292
 
 బలివాడ కథానికల పోటీ
 బలివాడ కాంతారావు జయంతి(జూలై 3) సందర్భంగా సహృదయ సాహితి-విశాఖపట్నం వారు భారత్ నిధి ఫౌండేషన్‌తో కలిసి కథానికల పోటీ నిర్వహిస్తున్నారు. ప్రథమ బహుమతి 10 వేలు. ద్వితీయ 5 వేలు, తృతీయ 3 వేలు. బహుమతుల ప్రదానం జయంతి రోజున ఉంటుంది. సామాజిక ఇతివృత్తంతో ఈ పోటీ కోసమే రాసిన కథల్ని మే 20లోగా పంపాలి. చిరునామా: శేఖరమంత్రి ప్రభాకరరావు, స.సా. కార్యదర్శి, 409, ఆర్ ఆర్ టవర్స్, మహారాణిపేట, విశాఖపట్నం-530002; ఫోన్: 9885874474
 
 దాశరథి ఉపదేశగీత కోసం...
 నది మాసపత్రికలో రెండేళ్లపాటు ధారావాహికగా వచ్చిన దాశరథి రంగాచార్య భగవద్గీత వచనానువాదం ‘ఉపదేశగీత’ను పుస్తకంగా తేనున్నామనీ, అయితే, 17వ భాగపు (నవంబర్ 2013) సంచిక లభించడం లేదనీ, కావున, ఆ ప్రతి ఉన్నవారు ఎవరైనా అందజేయగలరనీ, వి.జయప్రకాష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్: 9550002354
 
రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు
సంస్కృత వేదాన్తంలో ఆళ్వార్ల(తమిళ) ప్రబంధాలలో నిష్ణాతులైన ముగ్గురు పండితులకు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లోని కోడం దామోదర్ ఫంక్షన్ హాలులో ‘రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు’ ప్రదానం చేయనున్నామని ఆహ్వాన సంఘం కార్యదర్శి సముద్రాల శఠగోపాచార్య తెలియజేస్తున్నారు.

గ్రహీతలు: నేపాల్ కృష్ణమాచార్య, కె.వి.నర్సింహాచార్య, ఎస్.రమాకాంతాచార్య. పురస్కర్త: చిన్న జీయర్ స్వామి.

Advertisement
Advertisement