ఇక బ్యాటరీ ఖర్చయిపోదు...

 battery does not cost - Sakshi

స్మార్ట్‌ఫోన్లు కొనేవారెవరైనా కచ్చితంగా అడిగే ప్రశ్న.. బ్యాటరీ సామర్థ్యం ఎంత? మిసోరీ యూనివర్శిటీ శాస్త్రవేత్త దీపక్‌ కె.సింగ్‌ పరిశోధనల కారణంగా సమీప భవిష్యత్తులో ఈ ప్రశ్నకు అర్థమే ఉండదు. ఎందుకంటే సామర్థ్యాన్ని ఏకంగా వంద రెట్లు పెంచడమే కాకుండా.. వేడి కూడా పుట్టని సరికొత్త పదార్థాన్ని ఈయన అభివృద్ధి చేశారు! వినూత్నమైన ఆకారం కలిగి ఉండే ఈ పదార్థం అయస్కాంత ధర్మాల ఆధారంగా పనిచేస్తుందని అంచనా. సిలికాన్, జెర్మేనియం వంటి అర్ధవాహకాలతో ఇప్పటివరకూ సెమీకండక్టర్‌ డయోడ్‌లు, ఆంప్లిఫయర్లు తయారు చేస్తూండగా తాము వీటి స్థానంలో అయస్కాంత ఆధారిత పదార్థాలను వాడితే మేలని గుర్తించామని దీపక్‌ సింగ్‌ తెలిపారు.

ఫలితంగా విద్యుత్తు ప్రవాహ సమయంలో జరిగే నష్టాలను తక్కువస్థాయికి చేర్చామని, దీనివల్ల బ్యాటరీ వంద రెట్లు ఎక్కువ కాలం నడవడంతోపాటు విద్యుత్తు నష్టం వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని కూడా లేకుండా చేయగలిగామని ఆయన వివరించారు. డయోడ్లతో పాటు ట్రాన్సిస్టర్లు, యాంప్లిఫయర్ల వంటి వాటిని కూడా అయస్కాంత పదార్థాల ఆధారంగా తయారుచేస్తే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ కొత్తరకం పరికరాలతో తయారైన స్మార్ట్‌ఫోన్‌ను ఐదు గంటలపాటు ఛార్జ్‌ చేస్తే 500 గంటలపాటు పనిచేస్తుందని అంచనా.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top