
ముట్టుకుంటే... స్పర్శలో ప్రేమ ఉండాలి.. ఆప్యాయత ఉండాలి.. సంరక్షణ ఉండాలి.. గౌరవం ఉండాలి. అలాంటి స్పర్శతో జీవం పులకిస్తుంది. మహిళ వికసిస్తుంది. కానీ ఆ టచ్‌లో వాంఛ ఉంటే.. ఆ చేతిని ఏ ఆడపిల్లకైనా తెగ నరకాలనిపిస్తుంది... గౌరవాన్ని మలినం చేసే టచ్‌ని సమాజంలోంచి చంపేసి, తుద ముట్టేయాలనిపిస్తుంది. ఆ స్పర్శ ఒక మగవాడి చేతిది కాదు. వాడిలో ఉన్న దురహంకారానిది. అది చావాలి.
దాదాపు టూ ఇయర్స్ అయిందేమో కలిసి... తెల్లగా ఉన్నారు కానీ నల్లపూస అయిపోయారు?
(నవ్వేస్తూ). షూటింగ్స్, ఇల్లు. ఎప్పుడూ ఇంతే. సినిమా రిలీజ్ అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం వస్తాను. అందుకే ఎక్కడా కనిపించను. యాక్చువల్లీ షూటింగ్ వరకూ ఓకే కానీ ప్రమోషనల్ కార్యక్రమాలంటే నాక్కొంచెం కష్టమే. సినిమాలకంటే మేకప్ కంపల్సరీ. ఇప్పుడు కూడా లైట్‌గా అయినా మేకప్ వేసుకోవాలి కదా. అది నచ్చదు.
మీలాంటి అందగత్తెలకు మేకప్ ఎందుకులెండి?
అందం గురించి పెద్దగా పట్టించుకోను. మీరన్నట్లు నేను అందగత్తెని అని ఎప్పుడూ ఫీలవ్వలేదు. ఆఫ్ స్క్రీన్ మేకప్ లేకుండానే నాకు నేను నచ్చుతాను. మేకప్ వేసుకున్నప్పుడు నేను నాలా ఫీల్ అవ్వను.
టైమ్‌తో సంబంధం లేని జాబ్, లొకేషన్‌లో కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. స్ట్రెస్ ఎలా తట్టుకుంటారు?
నేనెప్పుడూ స్ట్రెస్ తీసుకోను. షూటింగ్ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. వర్క్ అంటే ప్యాషన్. అన్నీ ఎంత సవ్యంగా ఉన్నా ఒక్కోసారి స్ట్రెస్ అయిపోతాం. అలాంటప్పుడు నా స్ట్రెస్ అంతా నావాళ్లపై పడేసి, హ్యాపీగా ఉంటాను.
మీ స్ట్రెస్‌ను తట్టుకునే ఒక ఐదుగురి పేర్లు చెబుతారా?
వల్లీ (లైన్ ప్రొడ్యూసర్, కీరవాణి వైఫ్) గారు, రమా (స్టైలిస్ట్, రాజమౌళి మిసెస్) గారు, భానుగారు (హెయిర్ స్టైలిస్ట్), ప్రశాంతి గారు (కాస్ట్యూమ్ డిజైనర్), యూవీ గ్యాంగ్... వీళ్లందరూ నా స్ట్రెస్‌ను తట్టుకోగలరు. అందుకే వాళ్ల మీద వదిలేస్తా (నవ్వేస్తూ).
మీ ఫ్యామిలిలో మీ స్ట్రెస్‌ను తట్టుకునేది?
అమ్మానాన్న ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకున్నారు. మళ్లీ వాళ్లను కష్టపెట్టడమెందుకు? అందుకే అన్నయ్యను బలి చేస్తా (నవ్వుతూ). నాకు సిస్టర్స్ లేరు. అందుకే వదినను బాగా చూసుకుంటా.
ఇంతకీ ‘భాగమతి’లో ఏం నచ్చి ఒప్పుకున్నారు ?
ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం యూవీ క్రియేషన్స్. వాళ్లతో ఇంతకుముందు ‘మిర్చి’ సినిమా చేశాను. 2012లో ఈ సినిమా స్క్రిప్ట్‌ను నా దగ్గరకు తీసుకువచ్చారు. కేవలం ఆ బ్యానర్ మీద ఉన్న నమ్మకం, వాళ్లు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ కచ్చితంగా నెక్స్›్టలెవల్‌కు తీసుకుని వెళుతుందనే ఫీలింగ్ ఉంది. అశోక్ (డైరెక్టర్) గారు చెప్పిన కథ బాగా నచ్చింది. దేవసేన, రుద్రమదేవికి టోటల్లీ డిఫరెంట్‌గా, మోడరన్‌గా భాగమతి ఉంటుంది. ‘బాహుబలి’ సినిమా కన్నా ముందే ఈ కథ విన్నాను. డేట్స్ లేక చేయలేదు. నా కోసం నాలుగేళ్లు వెయిట్ చేశారు.
ఒక హీరోయిన్ కోసం ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయటం అంటే మీ మీద పెద్ద బాధ్యత ఉన్నట్లే. భయం అనిపించలేదా?
వేరే హీరోయిన్‌తో కావాలంటే తీయొచ్చు. అయినా నాకోసం ఆగారు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా నేను చేస్తేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అందుకే వెయిట్ చేశారు. ఎప్పటిలానే బాధ్యతగా ఈ సినిమా చేశా. అశోక్‌గారికి చాలా నాలెడ్జ్ ఉంది. బాగా తీశారు.
వరల్డ్ వైడ్‌గా మిమ్మల్ని పాపులర్ చేసిన ‘బాహుబలి’ గురించి రెండు మాటలు...
మొదట్లో ఈ ఫేమ్ సింక్ అవ్వలేదు. మెల్లి మెల్లిగా ‘ఓకే... ఇది మనకు వచ్చిన పేరే’ అనుకున్నాను. మళ్లీ ‘బాహుబలి’లాంటి సినిమా చేస్తానో లేదో కానీ, ‘ఇట్స్ ఎ స్వీట్ మెమరీ’.
‘నీ పెళ్లెప్పుడు?’ అని మీరు, ప్రభాస్ ఒకరినొకరు అడుగుతుంటారా?
అలాంటి టాపిక్ రాదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్లది. నిజానికి మనం చాలామంది సెల్‌ఫిష్‌గా ఉంటాం. మనం కోరుకున్నవాళ్లను పెళ్లి చేసుకోవాలనిపిస్తే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా చేసేసుకుంటాం. పెళ్లనేది పర్సనల్ మేటర్. ఎవర్ని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ల చాయిస్. ఎందుకంటే పెళ్లి ఫంక్షన్ అయిపోయాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత కలిసి ఉండాల్సింది భార్యాభర్తలే కదా.
మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు.. అమ్మానాన్న ఒత్తిడి చేయరా?
అమ్మ నాన్నలకు ఉంటుంది. బట్.. ఎప్పుడూ గట్టిగా అడగలేదు. అమ్మ డెస్టినీని నమ్ముతుంది. పెళ్లనేది దేవుడు డిసైడ్ చేయాలి. ప్రతి దానికీ రైట్ టైమ్ ఉంటుంది. అది రావాలి. యాక్చువల్లీ రైట్ పర్సన్ మీట్ అవ్వాలి. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అతనితోనే గడపాలనిపిస్తే పెళ్లి అయిపోతుంది.
ఇంత పెద్ద ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తి ఒక్కరూ తారసపడలేదా?
అనిపించలేదని కాదు. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. కొన్నిసార్లు అనుకున్నా కానీ కుదర్లేదు.
‘బాహుబలి 2’లో ఓ సీన్‌లో ఒకతను అమ్మాయిల్ని అసభ్యకరంగా తాకితే.. మీరు అతని వేలు కట్ చేస్తారు. రియల్ లైఫ్‌లో అయితే ఏం చేయాలనిపిస్తుంది?
చంపేయాలనేంత కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ప్రమోషన్స్‌కి పబ్లిక్‌లోకి వెళతాం కదా. అక్కడ కొంతమంది తాకడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య హైదరాబాద్‌లో నాకలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ మూమెంట్‌లో చంపేయాలనేంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేం కదా. అందుకే కొట్టాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వక్రబుద్ధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారనుకుంటా.
హాలీవుడ్ నటి యాష్లీ జెడ్ ఇండస్ట్రీలో ఉన్న ‘క్యాస్టింగ్ కౌచ్’ మీద ‘మీటూ’ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే, కొందరు హీరోయిన్స్ వాయిస్ రైజ్ చేశారు. దాని గురించి మీరేమంటారు?
‘మీటూ’ గురించి ఐడియా లేదు. బట్.. సెలబ్రిటీస్ ఇలాంటి విషయాల పై మాట్లాడటం మంచి పరిణామమే. మన ఇండియాలోనే తీసుకుంటే 60శాతం కంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే వేధింపులకు గురవుతున్నారని పోల్స్ చెబుతున్నాయి. ఆ వేధింపుల గురించి బయటకు చెప్పటానికి భయపడుతున్నారు. మనం ఎప్పుడైనా పక్కవాళ్లతో కంపేర్ చేసుకుంటాం... చెబితే ఏమనుకుంటారోనని. పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలరు.
‘క్యాస్టింగ్ కౌచ్’ సంఘటనలు మీకూ ఎదురయ్యాయా?
లేదండి. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. ‘సూపర్’ టూ ‘భాగమతి’ నేను ఎవరితో వర్క్ చేసినా నాతో బాగానే బిహేవ్ చేశారు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా చెబితే నమ్మబుద్ధి కాదు. యాక్చువల్లీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పార్టీలకు వెళ్లకపోతే, ప్రోగ్రామ్స్‌కి అటెండ్ కాకపోతే చాన్సులు రావని అంటుండేవారు. నేను నమ్మేదాన్ని కాదు. మనకేం కావాలో మనం తెలుసుకోవాలి. నా వరకు నేను ఎవరైనా ‘ఇలానే చేయాలి’ అని కండీషన్స్ పెడితే ‘చేయను’ అని తెగేసి చెప్పేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది పేరెంట్సే నేర్పించాలి. పేరెంట్స్ సరైన గైడెన్స్ ఇవ్వకపోతే పిల్లలు చెడు దారులు పడతారు.
ఓకే.. ఆ మధ్య కేరళలో ఓ గుడికి వెళ్లారు. ఆ తర్వాత బెంగళూరులో ఓ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రీజన్ ఏంటి?
ఇప్పుడే కాదండి.. చిన్నప్పటి నుంచీ కూడా పూజలు చేయడం నాకు అలవాటు. తరచూ తిరుపతి వెళతాను. ‘భాగమతి’లో మలయాళ నటుడు జయరామ్ నటించారు. ఆయన చెబితే కేరళలో ఓ టెంపుల్‌ని విజిట్ చేశాను. నా కోసం నేనెప్పుడూ మొక్కుకోను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కోసం మొక్కుకుంటా. 2011లో ఒకరి కోసం మొక్కుకుని, చిలుకూరి వెళ్లి, 108 ప్రదక్షిణాలు చేశాను. ఇంకో మొక్కు కూడా ఉంది. మళ్లీ వెళ్లాలి.
మీ కోసం మొక్కుకునేది ఎవరు?
మా అమ్మానాన్న, అన్నయ్య, వదిన, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యాన్స్ కూడా నా కోసం పూజలు చేస్తారనుకుంటున్నా. ఇంతమంది ఉండగా నాకోసం నేను దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు?
పెద్ద సినిమాలు చేస్తున్నారు కాబట్టి సక్సెస్ కోసం, పెళ్లి అవ్వాలని గుడికి వెళుతున్నారేమో అనిపించింది...
అలా ఏం లేదండి. చాలామంది ఇలానే ఊహించుకుంటున్నారు.
ప్రభాస్‌తో మీ రిలేషన్ ఏంటి? అనే టాపిక్ లేకుండా ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. అదేమైనా కోపంగా ఉంటుందా?
మేం ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాం. పైగా ఇద్దరం పెళ్లి కానివాళ్లమే. అందుకని ఏదేదో అనుకుంటారు. అది నేచురల్. అయితే చెప్పిన విషయాలను వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తే మాత్రం బాధగా ఉంటుంది.
ఫ్రభాస్ కెరీర్ పెద్దగా షేప్ అవ్వటం ఎలా అనిపిస్తుంది?
ప్రభాస్ వెరీ ఫోకస్డ్. మంచి వ్యక్తి. ఫ్రెండ్స్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. తన కెరీర్‌ని ఈ రేంజ్‌లో చూడటం హ్యాపీగా ఉంటుంది. ఆ మాటకొస్తే.. ‘వియ్ ఫీల్ హ్యపీ ఫర్ ఈచ్ అదర్’.
‘బాహుబలి’లో మీరు పడవ ఎక్కడానికి ప్రభాస్ తన రెండు చేతులు చాచితే, వాటి మీద నడుచుకుంటూ వెళతారు. రియల్‌గా అంత ప్యాంపర్ చేసే భర్త రావాలనిపిస్తుంటుందా?
(నవ్వేస్తూ). నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి స్వీట్ స్వీట్ మూమెంట్స్ అంటే ఇష్టం. బేసిక్‌గా నేను డ్రీమర్‌ని. అయితే అలా జరగడం అసాధ్యం కదా.
ఒకవేళ మీకెవరైనా లవ్ ప్రపోజ్ చేయాలంటే ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేయాలని కోరుకుంటారా ?
అందరూ ఇలానే చేయాలని కోరుకోకూడదు. కొందరు మాటలతో చెప్పలేకపోవచ్చు. కొందరు వాళ్ల ప్రేమను మనకోసం వాళ్లు చేసే పనుల ద్వారా చూపిస్తుంటారు. అలానే కొందరు జస్ట్ ఒక్క హగ్ ఇచ్చినా ఆ స్పర్శలో మొత్తం ప్రేమ తెలిసిపోతుంది. ‘యాక్షన్ స్పీక్స్ లౌడర్ దేన్ వాయిస్’ అని నేను నమ్ముతాను.
ఫైనల్లీ మీకెలాంటి వెడ్డింగ్ కావాలి?
చాలా సింపుల్ వెడ్డింగ్. గ్రాండ్‌గా అంటే మేకప్ వేసుకోవాలి కదా (నవ్వుతూ) .
– డి.జి. భవాని