
వైఎస్సార్‌సీపీకి 145 స్థానాలు
జయ నామ ఉగాది తెలుగు కొత్త సంవత్సరంలో గ్రహగతులు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి తెలిపారు.
జయనామ ఉగాది పంచాంగ శ్రవణంలో మారేపల్లి రామచంద్రశాస్త్రి
సాక్షి, హైదరాబాద్: జయ నామ ఉగాది తెలుగు కొత్త సంవత్సరంలో గ్రహగతులు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీమాంధ్రలో ఆ పార్టీ 140 నుంచి 145 స్థానాలు విజయం సాధిస్తుందని చెప్పారు. ఇతర పార్టీలు కలసికట్టుగా వచ్చినా, విడివిడిగా పోటీ చేసినా విజయం మాత్రం ధర్మం వైపే ఉంటుందన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీలు ఎన్ని పొత్తులు కుదుర్చుకున్నా అపజయాన్ని తప్పించుకోలేవని, వాళ్లు కలసినా పరస్పరం ఓట్ల మార్పిడి జరగదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం పంచాంగ శ్రవణం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండటంతో పార్టీ ముఖ్యనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పి.ఎన్.వి.ప్రసాద్, వాసిరెడ్డి పద్మ, బి.జనక్‌ప్రసాద్, గట్టు రాంచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. జగన్‌మోహన్‌రెడ్డికి అద్భుతమైన, ఉజ్జ్వలమైన భవి ష్యత్తు ఉందని, ఆయన ప్రజలకు నిస్సందేహంగా స్థిరమైన పరిపాలనను అందిస్తారని శాస్త్రి చెప్పారు.
గత ఏడాది విజయ నామ ఉగాది సందర్భంగా విజయమ్మ సమక్షంలో జరిగిన పంచాంగ శ్రవణంలో కూడా జగన్ జైలు నుంచి అతి త్వరలో బయటకొచ్చి జనంలోకి వెళతారని ఇదే వేదిక మీది నుంచి చెప్పామని... ఆ ప్రకారమే ఆయన విడుదలై జనంలో ఉన్నారని గుర్తుచేశారు. రాజు సరైన రాజలక్షణాలు కలిగి ఉంటే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, కొత్త రాష్ట్రంలో అనేక భాగ్యనగరాలు నిర్మించుకుంటారని తెలిపారు. ప్రజల గురించి ఆలోచించే వారు ఎపుడూ ఎన్నికలకు భయపడరని చెప్పారు. ఎన్నికలంటే భయపడని పార్టీకే విజయం వరిస్తుంద న్నారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలేమిటో తెలుసుకుని, వారి మనసెరిగి పరిపాలించారని అందుకే ఆయన ప్రజల హదయాల్లో నిలిచి పోయారని కొనియాడారు. వార్థక్యంలో ఉన్న కొందరు నేతలు ఇక పక్కకు తప్పుకుని యువకులకు అధికారపగ్గాలు వస్తే అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని చెప్పారు.
వైఎస్ జగన్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (తానె) ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. సోమవారం ఉగాది రోజున ‘తానె’ ఈ-మెయిల్ పంపింది. జయనామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు నెదర్లాండ్స్‌లోని తెలుగు ప్రతినిధు లు సందేశంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా నెందర్లాండ్స్‌లో ‘తానె 2014 ఉగాది ఉత్సవాలు’ పేరిట ప్రత్యేక సంబరాలు జరుపుతున్నామని, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. నెదర్లాండ్స్‌లోని హైటెక్ క్యాంపస్‌లో జరిగే ఈ ఉత్సవాలకు అక్కడి 200కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.