గుడిసెల్లేని రాష్ట్రాన్ని అందిస్తాం: విజయమ్మ


సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘వైఎస్ కలలు కన్నట్టుగానే గుడిసెల్లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే జగన్ లక్ష్యం. దేశంలో 50ఏళ్లలో 47లక్షల ఇళ్లు కడితే వైఎస్ తన ఐదేళ్ల మూడు నెలల పాలనలో ఏకంగా 48 లక్షల ఇళ్లు కట్టి చూపించాడు. ఇప్పుడు జగన్ ఏడాదికి 10లక్షల చొప్పున రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. వాటిని అక్కాచెల్లెళ్ల పేరిటే రిజిస్టర్ కూడా చేయించి ఆ ఇళ్లపై రుణాలందిస్తానని చెబుతున్నాడు. ఆ మహానేతలో ఉన్న దీక్ష, తెగువ, పట్టుదల జగన్‌బాబులో కూడా ఉన్నాయి. ఒకసారి మాట ఇచ్చాడంటే వాళ్ల నాయన మాదిరిగానే ఆ మాట తప్పేవాడు కాదు. నన్ను నమ్మండి. జగన్‌బాబును ఆశీర్వదించండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో విజయమ్మ వైఎస్సార్ జనభేరి నిర్వహించారు. ‘‘నాడు రాజశేఖరరెడ్డి నుంచి నేడు నా బిడ్డలు జగన్‌బాబు, షర్మిలపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు మేము మర్చిపోలేం. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు. మా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మిమ్మల్ని మా గుండెల్లో ఉంచుకుంటాం. కష్టసుఖాల్లో మీకు అండగా నిలుస్తాం’’ అని ప్రజలకు హామీ ఇచ్చారు.  

 

 పదేపదే విజయమ్మ వాహనం తనిఖీ

 తనిఖీల పేరుతో పోలీసుల అత్యుత్సాహం


సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మరోసారి అవమానానికి గురిచేశారు. 2012లో ఉపఎన్నికల సం దర్భంగా ఇదే జిల్లాలో రెండు ప్రాంతాల్లో వాహనాలతో పాటు విజయమ్మ సూట్‌కేసులను మగపోలీసులు తనిఖీ చేయగా, మళ్లీ అదే రీతిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రామచంద్రాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న విజయమ్మ బసచేసే వాహనాన్ని తనిఖీ చేసే విషయంలోను పోలీసులు అతిగా వ్యవహరించారు. కోలంక వద్ద   బస్సును తనిఖీ చేసే పేరుతో కె.గంగవరం ఏఎస్‌ఐ సత్యనారాయణ నానా హంగామా చేశారు.

 

అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీకి గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే అన్న విషయాలను కూడా పట్టించుకోకుండా వాహనాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించకపోవడంతో ఆ సమాచారాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు తె లియజేశారు. మళ్లీ తనిఖీ చేయమని వారు ఆదేశించడంతో పోలీసులు మరోసారి దంగేరువద్ద హడావుడి చేశారు. భోజన విరామ సమయంలో విజయమ్మ బసచేసే బస్సును మరోసారి తనిఖీ చేశారు. ఒక మహిళకు సంబంధించి ఎలాంటి తనిఖీలనైనా విధిగా ఆడ పోలీసులతో నిర్వహించాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా పాటించలేదు. పైగా, దంగేరులో తనిఖీ సమయంలో ఏఎస్‌ఐ ఒక్కరే అణువణువూ పరిశీలించారు. పోలీసుల వైఖరిపై  వైఎస్సార్ అభిమానులు మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు,చిరంజీవి, జైరాం రమేష్ వంటి నేతలు జిల్లాలో పర్యటించినప్పుడు ఎలాంటి తనిఖీలూ చేయకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top