సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన వెంకటగిరి నియోజకవ ర్గంలోని రాపూరుకు వచ్చారు.
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన వెంకటగిరి నియోజకవ ర్గంలోని రాపూరుకు వచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి ప్రతి చోటా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేతను పలకరించేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువకులు రోడ్లపై బారులుదీరారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు.
పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు జగన్ రోడ్‌షో జనంతో కిక్కిరిసి పోయింది. మిద్దెలు, మేడలపై సైతం జనం కిక్కిరిశారు. సుమారు 50 నిమిషాలపాటు రోడ్‌షో సాగింది. జగన్ ప్రతిచోటా వాహనం నిలిపి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘రాబోయే కాలం మనదే, మంచి జరుగుతుంది’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ‘మా రాజన్న బిడ్డ మీరు.. ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసుకుంటాం’ అంటూ జగన్‌ను జనం ఆశీర్వదించారు. కాబోయే సీఎం జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు.
వేలాదిగా తరలి వచ్చిన జనంతో రాపూరు కిటకిటలాడింది. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం జనంలో ఉత్సాహం నింపింది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఫ్రీగా చేస్తానని చెప్పడమేమిటని జగన్ నిలదీయడంతో ఈలలు, కేకలతో జనం స్పందించారు. బాబు తన పాలనలో రైతులు, వృద్ధులను పట్టించుకోలేదని, పేదల ఆరోగ్యం అసలు ఆయనకు పట్టలేదని జగన్ వివరించారు.
చివరిలో జగన్ విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాలకు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో ‘విశ్వసనీయతకే మా ఓట్లు’ అంటూ జనం పెద్ద ఎత్తున స్పం దించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నిన్ను సీఎంని చేసుకుంటామం టూ ఉత్సాహంగా ఈలలు, కేకలతో తమ అభిప్రాయం తెలిపారు. తాను సీఎం అయిన మరుక్షణమే రైతుల కోసం రూ. 3వేల కోట్ల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకోసం రూ. 2వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడంతోపాటు డ్వాక్రా రుణాల రద్దు, వృద్ధుల పింఛన్ పెంపు, అమ్మఒడి పేరుతో విద్యార్థులను ఉచితంగా చదివించడం తదితర పథకాలపై సంతకాలు చేస్తానని చెప్పారు. తొలిరోజు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగిన జగన్ పర్యటనకు విశేష స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
కొమ్మిని ఆశీర్వదించండి
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు మంచి వ్యక్తి అని, ఆయన అందరికీ మంచి చేస్తారని విశ్వాసం తనకుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు.
వరప్రసాద్‌ను గెలిపించండి...
తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ మంచి వ్యక్తి అని, ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేసిన ఆయన ప్రజలకు మంచి చేస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు.
ఘనస్వాగతం
వైఎస్సార్ జిల్లాలోని చిట్వేలు మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆశీర్వదించండి
: కొమ్మి లక్ష్మయ్యనాయుడు
వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు కోరారు. రాపూరులో జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలనే పుత్రప్రేమతోనే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికాడని కొమ్మి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం పోరాడిందన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు. జగన్ సీఎం అయితే ఆ పథకాలు మళ్లీ అమలవుతాయన్నారు. అసంపూర్తిగా ఉన్న ఎస్‌ఎస్‌కెనాల్‌ను పూర్తి చేసుకోవడంతో పాటు వెంకటగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.
జగన్ సీఎం అయితేనే
రాష్ట్రాభివృద్ధి: వరప్రసాద్
మహానేత వైఎస్సార్ లాంటి సమర్థుడైన వ్యక్తి సీఎం కావాలంటే జగన్‌ను గెలిపించుకోవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పిలుపునిచ్చారు. విభజన పుణ్యమాని రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృ ద్ధి చేసుకోవచ్చన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.