మండపేట బరిలో సినీ నటి హేమ | Telugu Actress Hema to contest for Mandapeta Assembly seat | Sakshi
Sakshi News home page

మండపేట బరిలో సినీ నటి హేమ

Apr 18 2014 3:51 PM | Updated on Aug 14 2018 4:21 PM

మండపేట బరిలో సినీ నటి హేమ - Sakshi

మండపేట బరిలో సినీ నటి హేమ

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఆసక్తి రేపారు హేమ.

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు మార్చుకున్నారు. చిన్ననాటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 250 పైగా సినిమాల్లో నటించిన హేమ మంచి నటిగా గుర్తింపు పొందారు. బుల్లి తెరపై కూడా అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల  బరిలోకి దిగుతున్నట్టు హేమ వెల్లడించారు. మండపేట అసెంబ్లీ జేఎస్పీ అభ్యర్థిగా తాను ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు చెప్పారు. కాకతాళీయంగానో, కాలక్షేపం కోసమో తాను పోటీ చేయడంలేదని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలన్న స్థిర సంకల్పంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు. మండపేటలో హేమ ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. సొంత జిల్లా వాసులు ఆమెను ఏ మేరకు ఆదరిస్తారో?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement