ప్రొద్దుటూరులో పచ్చనోట్లు | Rs 46 lakh unaccounted cash seized by election officials | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో పచ్చనోట్లు

Apr 29 2014 2:54 AM | Updated on Aug 29 2018 8:54 PM

ప్రొద్దుటూరులో పచ్చనోట్లు - Sakshi

ప్రొద్దుటూరులో పచ్చనోట్లు

ఓట్లకోసం నోట్లు వెదజల్లాలనే ఒక టీడీపీ అభ్యర్థి బండారం బయటపడింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ వద్ద ఒక గదిలో దాచిన రూ.46,19,200 సోమవారం అధికారులు పట్టుకున్నారు.

టీడీపీ అభ్యర్థి బంధువు మిల్లులో రూ.46 లక్షలు స్వాధీనం
 ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఓట్లకోసం నోట్లు వెదజల్లాలనే ఒక టీడీపీ అభ్యర్థి బండారం బయటపడింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ వద్ద ఒక గదిలో దాచిన రూ.46,19,200 సోమవారం అధికారులు పట్టుకున్నారు. ఈ మిల్లు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ సమీప బంధువు రమణయ్యది. ఈ సొమ్ము ఎన్నికల కోసం దాచిందేనని రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం చెప్పారు. స్థానిక కొర్రపాడు రోడ్డులో రమణయ్యకు శ్రీవెంకటేశ్వరా ఇండస్ట్రీస్ ఉంది. ఈ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోనే శ్రీకర్ కాటన్ ట్రేడర్స్, మరో రెండు మిల్లులు ఉన్నాయి. సుధాకర్‌యాదవ్ మేనల్లుడు మేకల శ్రీనివాసులుయాదవ్ ఇక్కడ డబ్బు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  
 
 ఈ మిల్లులో నగదు దాచారని పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని మిల్లుల్లో తనిఖీ చేశారు. శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ సమీపంలో ఉన్న గది తాళం తీయమని కోరగా తాళంచెవులు లేవని సిబ్బంది చెప్పారు. మిల్లు యజమాని రమణయ్యకు సీఐ ఫోన్ చేసి తాళం తీయాలని చెప్పగా అతను సెల్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం తదితరుల సమక్షంలో గది తాళాన్ని పగులగొట్టి బీరువాలో రూ.46,19,200 నగదును గుర్తించారు. ఈ మొత్తాన్ని ఆదాయపన్ను అధికారులకు అప్పగించారు. కాగా, మిల్లు వద్దకు వచ్చి తాళం తీయాలని పోలీసులు రమణయ్యకు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. పైగా అతడు రాకపోగా రూ.5 లక్షలిస్తా.. వెళ్లిపొండి అని ఒక పోలీసు అధికారితో బేరానికి దిగినట్లు తెలిసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అర్బన్ సీఐని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement