ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే అభ్యర్థులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిద్ధార్థజైన్ హెచ్చరించారు.
తణుకు, న్యూస్‌లైన్ : ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే అభ్యర్థులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిద్ధార్థజైన్ హెచ్చరించారు. గురువారం తణుకులో నెక్ కల్యాణ మండపంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అభ్యర్థులు, రాజకీయపక్షాల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ అధికారులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, అయితే ఓటర్లను వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. ఓటర్లను మద్యం, డబ్బు, ఇతర ప్రలోబాలకు గురిచేస్తే అభ్యర్థులపై చర్యలు తప్పవన్నారు.
అలాగే ఓటర్లు కూడా డబ్బుకు అమ్ముడుపోయినా ఏదైనా వస్తువులు ఇస్తేనే ఓటు వేస్తామని చెబితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మునిసిపల్ ఎన్నికలకు ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రచారాన్ని ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాలని, పోలింగ్ తేదీకి 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలన్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు, మైక్‌లకు తక్షణమే అనుమతి లభించేలా మండల కేంద్రాలు, మునిసిపాలిటీల్లో సింగిల్‌విండో విధానంలో అనుమతులు అందిస్తున్నట్టు తెలిపారు.
ప్రతి ఓటరుకు ఫొటోతో కూడిన ఓటరుస్లిప్ అందిస్తామన్నారు. ఓటు హక్కు ఎక్కడ ఏబూత్‌లో వినియోగించుకోవాలో ఆ సమాచారాన్ని ఓటర్‌స్లిప్‌లో స్పష్టంగా పొందుపర్చుతామన్నారు. శాంతి యుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అందరూ సహకరించాలన్నారు.
జేసీ బాబూరావు నాయుడు, అదనపు జేసీ నరసింగరావు, తణుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగరాజువర్మ, కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు, కొవ్వూరు డీఎస్పీ రాజగోపాల్, మునిసిపల్ కమిషనర్ కె.సాయిరాం పాల్గొన్నారు.