రాయపాటి ఇన్ .. మోదుగుల ఔట్?

రాయపాటి ఇన్ .. మోదుగుల ఔట్? - Sakshi

అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ :నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు నేడు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అదే ముహుర్తానికి మోదుగుల టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ, లేదా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్‌సభలో ఎంపీ మోదుగుల తన వాణి గట్టిగా వినిపించారు.

 

 లోక్‌సభలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ లోకసభ సభ్యుల దాడికి సంబంధించిన వీడియోలను ఆయన ఆదివారం విడుదల చేశారు. తనపై దాడి చేయటమే కాకుండా తాను పార్లమెంటులోకి కత్తిని తీసుకువచ్చానని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంతో తీరని అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నారు. దీంతో అయన లోక్‌సభకు వెళ్లి తన పరువును నిలుపుకోవాలని భావించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బావ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బరిలో ఉండటంతో చంద్రబాబు మోదుగులకు టిక్కెట్టు ఇచ్చేది లేదని తేల్చారు. ఆ స్థానం నుంచి ఎంపీ రాయపాటికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో తన అభిప్రాయాలకు తగిన గుర్తింపు లేదని మోదుగుల భావించారు. తానెప్పుడు తన బావపై పోటీ చేయనని ప్రకటించలేదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ తనను విశ్వసించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సోమవారం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేసేది లేదని ఆయన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. 

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top