విదర్భపై మావో నీడ?! | Maoists effected in lok sabha elections on vidarbha | Sakshi
Sakshi News home page

విదర్భపై మావో నీడ?!

Mar 18 2014 10:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

విదర్భ రీజియన్‌లో నామినేషన్ల రెండో రోజైన మంగళవారం పది స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

నాగపూర్: విదర్భ రీజియన్‌లో నామినేషన్ల రెండో రోజైన మంగళవారం పది స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి అకోలా నారాయణ్ గవహంకర్, అమరావతి నుంచి రాజు మంకర్(స్వతంత్ర), చంద్రభాన్ ఖోబ్రగేడ్(స్వతంత్ర), పంకజ్ మసూర్కర్(హెచ్‌జేపీ), భండారాగోండియా నుంచి రామేశ్వర్ ఠాక్రే(ఎస్పీ), యావత్మల్వాషిమ్ నుంచి ఒక సందీప్ దోకటే(స్వతంత్ర) తమ నామినేషన్లను అందజేశారు.
 
 సాక్షి, ముంబై : లోక్‌సభ ఎన్నికల మొదటి విడతలో విదర్భలో మావోయిస్టుల ప్రభావం కన్పించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున పోలీసులను అక్కడ మోహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. ఎన్నికలను అడ్డుకునేందుకు నక్సల్స్ పలుమార్లు ప్రయత్నించారు. ఈసారి కూడా గడ్చిరోలి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు మావోయిస్టులు ల్యాండ్‌మైన్లు (మందుపాతరలు) అమర్చేందుకు ఆస్కారం ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం. రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో భద్రత కారణంగా తొలివిడత ఎన్నికలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇక్కడ ఉన్న పది నియోజకవర్గాలలో గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో మావోల ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. దీంతో ఎన్నికలు నిర్వహించడం పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్‌కు సవాల్‌గా మారనుందని చెప్పవచ్చు.

 అత్యంత సమస్యాత్మక జిల్లా...
 విదర్భల్లోని గడ్చిరోలి జిల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పేర్కొంటారు. ఈ జిల్లాలో మావోల ప్రభావం అధికంగా ఉంది. ఇటీవల జరిగిన అనేక హింసాత్మక సంఘటనలు.. అదే విధంగా తరచూ జరిగే సంఘటనలు ఇటు ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రభుత్వం, పోలీసులను సైతం కలవరపరుస్తున్నాయి. పునర్విభజన అనంతరం గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడ్చిరోలి జిల్లాలో మూడు, చంద్రాపూర్ జిల్లాలో రెండు, గోందియా జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి.  ఈ లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 30 శాతం పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన భామరాగఢ్, ఎటాపల్లి, ధానోరా, కుర్‌ఖేడా, సిరోంచా, కోరచీ, అహేరీ మొదలగు తాలూకాలలో ఉన్నాయి.

వీటిలో కూడా గరాపత్తి, కోస్‌మీ, కసన్‌సూర్, జారావండీ, కోఠీ, బినాగుండా, గట్టా, పెండరీ, కోటగుల్, తాడ్‌గావ్ మొదలగు గ్రామాల్లో పోలీసులు, భద్రత దళాలకు భద్రత విషయం సవాల్‌గా మారనుంది. ఈ పరిసరాల్లోని అనేక గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు కూడా సరిగాలేవు. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు స్థావరాలను ఏర్పాటుచేసుకుని అవసరమైనప్పుడు రోడ్లపై ల్యాండ్ మైన్‌లను (మందుపాతరలు) పేల్చేందుకు ఉపయోగించుకుంటున్నారు.

 ఎన్నికల బహిష్కరణకు మావోల యత్నం...
 రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ మావోయిస్టులు గడ్చిరోలి జిల్లాలో ఎన్నికలను అడ్డుకునేందుకు యత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఇంతవరకు వారినుంచి ఎలాంటి ప్రకటనలు వెలుపడకపోయినప్పటికీ గత చరిత్రను పరిశీలిస్తే పలుమార్లు పోలింగ్‌కు ముందుగా ఎన్నికలను బహిష్కరించడం, ఓట్లు వేయొద్దని గ్రామీణ ప్రజలను బెదిరించడం వంటి ఘటనలకు దిగిన సందర్భాలున్నాయి.  అదేవిధంగా హత్యలు, ఎన్నికల అధికారులను అడ్డగించడం, బ్యాలెట్‌బాక్సులను ఎత్తుకెళ్లడం వంటి దుశ్చర్యలకు దిగేవారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బినాగుండాలో పోలింగ్ నిర్వహించిన అనంతరం బ్యాలెట్ బాక్సులతో తిరిగి వస్తుండగా తాత్కాలిక సూపరింటెండెంట్ శిరీష జైన్ హెలికాప్టర్‌పై మావోయిస్టులు గ్రనేడ్లతో దాడులు జరిపారు. అయితే  ఆ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.  

 2007లో జిల్లాపరిషత్ ఎన్నికల్లో జెడ్పీ మాజీ అధ్యక్షుడు బండోపంత్ మల్లేల్‌వార్ ఎన్నికల ప్రచార వాహనానికి ధానోరా తాలూకాలో మావోలు నిప్పంటించారు. బినాగుండాలో ఎన్నికల కేంద్రం వద్ద పోలీసులపై దాడి చేశారు. ఇటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులతో పాటు ప్రభుత్వం, పోలీసులు, భద్రత దళాలకు సవాలుగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement