మెతుకుసీమలో నేతల దౌడ్ | Sakshi
Sakshi News home page

మెతుకుసీమలో నేతల దౌడ్

Published Sun, Apr 27 2014 2:15 AM

మెతుకుసీమలో  నేతల దౌడ్ - Sakshi

- ఒకే రోజు పోటెత్తిన అగ్ర నాయకులు నర్సాపూర్‌లో సుష్మా..
 - సంగారెడ్డిలో ఆజాద్ నారాయణఖేడ్, జహీరాబాద్,
 - జోగిపేటలో కేసీఆర్
 - జహీరాబాద్‌లో చంద్రబాబు
 

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల వేళ  మెతుకుసీమకు అగ్రనాయకులు పోటెత్తారు. పోలింగ్‌కు కేవలం మూడే రోజులు మిగిలి ఉండటంతో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు జిల్లాకు వరుస కట్టారు. కుదిరితే హెలికాప్టర్‌లో.. లేకుంటే రోడ్డు మార్గంలో ‘దౌడ్’ తీస్తున్నారు. శనివారం బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ నర్సాపూర్‌లో పర్యటించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ  నాయకుడు గులాంనబీ ఆజాద్ సంగారెడ్డి నియోజకవర్గంలో తిరిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జహీరాబాద్‌లో పర్యటించారు.

 రాజకీయ అనిశ్చితిలో కేసీఆర్: సుష్మాస్వరాజ్
 నర్సాపూర్ సభలో సుష్మాస్వరాజ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయడం చూస్తుంటే రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయినట్టు అర్థమవు తుందన్నారు. ‘రాష్ర్టంలో టీఆర్‌ఎస్ వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు, లేకుంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆయన కలలు నేరవేరవు. ఇక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాదు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావడం ఖాయం. ఆంధ్రకు నీళ్లను ఇవ్వను అని పంచాయితీ పెట్టుకునే బదులు నదీ జలాలను తెలంగాణకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఆలోచన చేస్తే మంచిది’ అని ఆమె అన్నారు.

 గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిష్టర్: కేసీఆర్
 జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ మాజీ మంత్రి గీతారెడ్డి మీద విరుచుకుపడ్డారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిష్టర్ అని, ఆమె సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. త్వరలోనే జైలుకు వెళ్లబోయే గీతారెడ్డికి ఓటు వేస్తే దండగేనని జహీరాబాద్ ప్రజలను ఉద్దేశించి అన్నారు.

 అందోల్‌లో కేసీఆర్ వచ్చే సమయానికి సభా వద్ద జనం పలుచగా ఉండటంతో ఆయన కేవలం నాలుగే నిమిషాలు ప్రసంగించారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్.. బీజేపీతో కలవదని తేల్చి చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.

 మరోసారి అవకాశం ఇవ్వండి: ఆజాద్
 సంగారెడ్డిలో గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. సెక్యులర్ భావాలు కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని జగ్గారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఐఐటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మరో మారు అవకాశం ఇస్తే మెట్రో రైలు కూడా పట్టుకొస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement