కాంగ్రెస్ వైపు ఇ. పెద్దిరెడ్డి చూపు? | Enugala Peddireddy to join Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ వైపు ఇ. పెద్దిరెడ్డి చూపు?

Apr 14 2014 3:49 PM | Updated on Aug 14 2018 4:21 PM

కాంగ్రెస్ వైపు ఇ. పెద్దిరెడ్డి చూపు? - Sakshi

కాంగ్రెస్ వైపు ఇ. పెద్దిరెడ్డి చూపు?

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.

హుజూరాబాద్: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానవర్గం నుంచి ఆయనకు ఆహ్వానం అందగా.. ఆ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నెల 16న కరీంనగర్‌లో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభలో పెద్దిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య కాంగ్రెస్‌లో చేరాలని పట్టుబట్టడంతో ఆయన అంగీకరించినట్లు సమాచారం. తన రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై తన అనుచరులతో చర్చించి నేడోరేపో అధికారికంగా ప్రకటించనున్నారు.
 
టీడీపీలో సరైన గుర్తింపు లేకనే...
ఇనుగాల పెద్దిరెడ్డి 1995, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర పర్యాటక, కార్మిక శాఖామంత్రిగా పనిచేశారు. 2004లో ఓటమిపాలయ్యాక టి.దేవేందర్‌గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో కీలకభూమిక పోషించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదానికి ఆకర్షితులై నవ తెలంగాణ పార్టీని అందులో విలీనం చేశారు. ప్రజారాజ్యం తీరుపై అసంతృప్తి చెంది మళ్లీ టీడీపీలో చేరారు.

2009లో పెద్దిరెడ్డి పోటీ చేసిన హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేరే వ్యక్తిని ప్రోత్సహించడం,  హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డికి సహకరించడంతో చంద్రబాబు తీరుపై అసంతృప్తి చెందారు. ఇటీవలే రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడ కూడా పెద్దిరెడ్డికి చుక్కెదురైంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం రావడంతో ఆయన అటువైపే మొగ్గుచూపినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement