కానిస్టేబుల్ అశోక్ థోర్బులేపై జరిగిన దాడి ఘటనలో తన భార్య ప్రమేయమేమీ లేదని శివసేన నేత, ఆ పార్టీ దక్షిణ మధ్య ముంబై అభ్యర్థి రాహుల్ శేవాలే పేర్కొన్నారు.
ముంబై: కానిస్టేబుల్ అశోక్ థోర్బులేపై జరిగిన దాడి ఘటనలో తన భార్య ప్రమేయమేమీ లేదని శివసేన నేత, ఆ పార్టీ దక్షిణ మధ్య ముంబై అభ్యర్థి రాహుల్ శేవాలే పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తన భార్యను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన గురించి శివసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎమ్మెన్నెస్ పార్టీకి చెందిన వాహనంలో వెళ్లిన తర్వాతే కానిస్టేబుల్ థోర్బులే గాయపడ్డాడని చెబుతూ అందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపారు. దాడి జరిగిన సమయంలో తన భార్య కామిని ఘటనాస్థలంలో లేదని, అయినప్పటికీ ఆమెతోపాటు శివసేనకు చెందిన 16 మందిపై పోలీసులు కేసు పెట్టారని, ఇందులో నిజానిజాలు నిగ్గు తేలాల్సిన అవసరముందన్నారు.
తన భార్యను కేసులో ఇరికించేలా ఎమ్మెన్నెస్ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారని శేవాలే ఆరోపించారు. ఎమ్మెన్నెస్ నేతలు ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బులు పంచారని, అందుకు తగిన ఆధారాలు కూడా తమవద్ద ఉన్నాయన్నారు. కానిస్టేబుల్‌పై జరిగిన దాడి ఘటనలో శివసేన కార్యకర్తలెవరు కూడా పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని శేవాలే డిమాండ్ చేశారు. థోర్బులేపై దాడి చేసిన వ్యక్తి పదునైన ఆయుధంతో దాడికి తెగబడ్డాడని, అతనికి నేరచరిత్ర కూడా ఉందన్నారు. దాడి జరిగిన సమయంలో ఎమ్మెన్నెస్ నేత, ఆ పార్టీ పుణే లోక్‌సభ అభ్యర్థి దీపక్ పైగుడే అక్కడే ఉన్నారని, ఆయన సమక్షంలోనే దాడి జరిగిందని, ఆ సమయంలో పైగుడే అక్కడ ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సిన అవసరముందని, పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు జరపాలని శేవాలే డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెన్నెస్, శివసేనల మధ్య జరిగిన ఘర్షణలో ఏప్రిల్ 23న ట్రాంబే ప్రాంతంలో కానిస్టేబుల్ అశోక్ థోర్బుడే గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు పార్టీలు ప్రత్యర్థి పార్టీని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. శివసేన నుంచి బయటకొచ్చి ఎమ్మెన్నెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇరు పార్టీల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనూ ఎమ్మెన్నెస్ కారణంగానే శివసేన అనేక చోట్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.