మోతుబరి పందెం కోళ్లు 

Vardelli Murali Editorial On Three Capitals Support Rally - Sakshi

జనతంత్రం

పద్మశ్రీ నాజర్‌... 
ఐదారు దశాబ్దాల కిందట ఆంధ్రరాష్ట్రంలో పరిచయం అక్కరలేని పేరు. తెలుగువారి సొంతమైన బుర్రకథను బహుజనరంజకం చేసిన కళాకారుడు. చరిత్ర పుస్తకాల కంటే, శ్రీనా«థుని కావ్యం కంటే కూడా మిన్నగా పల్నాటి యుద్ధగాథను జనబాహుళ్యంలోకి తీసుకొనిపోయింది నాజర్‌ బుర్రకథే అంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎన్టీఆర్‌ నటించిన సినిమా ఇందుకు మినహాయింపు అయితే కావచ్చు. 
‘వినరా భారత వీరకుమారా... విజయం మనదేరా! 
ప్రాకటముగ నే జెప్పెడు కథనూ ప్రాజ్ఞులార వినుడీ!! 
అంటూ నాజర్‌ బృందం బుర్రకథను మొదలు పెట్టిన తర్వాత, అది పూర్తయ్యే వరకు జనం అందులో లీనమైపోయేవారని చెబుతారు. ఈ కథలో అంతర్వాహినిగా ఉన్న సామాజిక విప్లవాంశాన్ని బయటకు లాగి జన ప్రబోధక గానంగా మలిచాడు నాజర్‌. దాదాపు తొమ్మిదివందల సంవత్సరాలకు పూర్వమే కులమత భేదాలు లేవనీ, మనుషులందరూ సమానులేననీ చాటి చెప్పి సహపంక్తి (చాప కూడు) భోజనాలను ప్రారంభించినవాడు పలనాడు మంత్రి బ్రహ్మనాయుడు. 

మాల కన్నమదాసును చేరదీసి పెంచి సేనాపతిగా నియమించిన సాహసి బ్రహ్మనాయుడు. ఆ సంస్కర్తను ప్రశంసిస్తూ ఉద్వేగంగా కథ చెప్పేవాడు నాజర్‌. బ్రహ్మనాయుడి సమానత్వం సిద్ధాంతం నాటి కులీనవర్గాల్లో చాలామందికి నచ్చలేదు. నాయకురాలు నాగమ్మ పంచన చేరి కుట్రలు చేస్తారు. బ్రహ్మనాయుడి సంస్కరోణోద్యమాన్ని దెబ్బతీయడానికి మోసపూరితమైన కోడి పందేలు జరుగుతాయి. ఆ తర్వాత యుద్ధం... మారణహోమం. ఈ కథంతా ఇక్కడ అప్రస్తుతం కావచ్చు. కానీ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తాను విశ్వసించిన సర్వజన సమతావాదం నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గని బ్రహ్మనాయుడి సంకల్పబలం – నిమ్నవర్గాలు తమ సహపంక్తిన కూర్చోవడం ఇష్టంలేని కులీన దురహంకారం తొమ్మిది శతాబ్దాల తర్వాత కూడా ఏదో రూపంలో ఇంకా కొనసాగడం ఈ కథనూ, నాజర్‌ గానాన్ని సందర్భోచితం చేశాయి. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ యవనికపై ఈ రెండు అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శ్రీ వికారినామ సంవత్సరం మకర సంక్రాంతి వాకిట కొన్ని దురహంకారపు పందెంకోళ్లు విషపుకత్తులు తగిలించుకొని కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. 

ఇదీ సందర్భం 
ఎనిమిది నెలల కింద జరిగిన ఎన్నికల్లో అప్పటి పాలకపార్టీ తెలుగుదేశం ఘోరపరాజయాన్ని మూటకట్టుకుంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గరనుంచీ ఇంతటి దారుణ పరాభవానికి ఎన్నడూ గురికాలేదు. పేరుకు ప్రత్యక్ష పొత్తులు లేకపోయినప్పటికీ, గడిచిన ఐదారేళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తూ, జనంలో ఆ పార్టీ అధినేతకు పార్ట్‌నర్‌గా ముద్ర పడిన పవన్‌కల్యాణ్‌ పార్టీతో లోపాయికారీ సంబంధం నడిచింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతటి అఖండ విజయాన్ని వైఎస్‌ జగన్‌ పార్టీ సాధించింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా, మెజారిటీ మీడియా విద్వేష ప్రచార ప్రవాహాన్ని కూడా ఎదురొడ్డి వైఎస్‌ జగన్‌ ఒంటి చేత్తో సాధించిన గెలుపు దేశచరిత్రలోనే సాటిలేనిది. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించినవి రెండు అంశాలు. ఒకటి: అమరావతి రాజధాని కలను సాకారం చేయాలంటే, రెండు: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే తననే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజలు దిమ్మతిరిగే ఓటమిని బహూకరించారు. అంటే రాజధాని వ్యవహారంలో, పోలవరం వ్యవహారంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ప్రజలు నిర్ద్వంద్వంగా, నిస్సందేహంగా, శషభిషలకు తావు లేకుండా తిరస్కరించినట్టే. ప్రస్తుతం తెరపైకి వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన జనాభీష్టం మేరకే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రాజధానుల వ్యవహారంలో ముందుకు పోవాలనుకుంటే మళ్లీ ప్రజల తీర్పును కోరాలని ప్రతిపక్షం చేస్తున్న డిమాండ్‌ను వ్యవహార భాషలో ‘దింపుడు కళ్లం ఆశ’గా పరిగణిస్తారు. ఈ ఆశతోనే రాష్ట్రంలో ఒక కృత్రిమ ఉద్యమాన్ని అనుంగుమీడియా అండదండలతో సృష్టించడా నికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్ని రాలిపోయిన కంకుల్ని మూటకట్టుకొని, కొందరు రాలు గాయి కుంకల్ని వెంటేసుకొని భిక్షాటన పేరుతో చుట్టుపక్కల జిల్లాల్లో నిప్పురాజేయడానికి చెమటోడ్చుతున్నారు. 

మోతుబరుల ఉద్యమం 
చంద్రబాబు ప్రారంభించిన ఈ ఉద్యమానికి సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు ఏబీకే ప్రసాద్‌ ‘మోతుబరుల ఉద్యమం’గా నామకరణం చేశారు. తుళ్లూరు ప్రాంత రైతుల పేరిట సాగుతున్న ధర్నాల్లో పాల్గొనేందుకు వస్తున్న వారిని చేరవేస్తున్న వాహనాలను చూసి స్థానికులు బేజారెత్తుతున్నారు. రేంజ్‌రోవర్, బెంజ్‌... వగైరా టాప్‌ బ్రాండ్‌ కార్లన్నీ ధర్నా ప్రాంతానికి చేరువలో బారులు తీరుతున్నాయట. కేవలం ఈ కార్లను చూసి వెళ్లేందుకే చుట్టుపక్కల నుంచి వచ్చిపోతున్నారట. ఇదిగో ఈ మోతుబరుల ఉద్యమాన్నే రాష్ట్రవ్యాప్తం చేయడానికి చంద్రబాబు సొంతపార్టీ, దాని మిత్రపక్షాలు, పత్రికాపక్షాలు, టీవీ పక్షాలు, రహస్యమిత్రులు అందరూ కలిసి ప్రస్తుతం 24/7 పనిచేస్తున్న ఒక వార్‌ రూమ్‌నే నడుపుతున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేర్పించిన తన ఏజెంట్ల ద్వారా మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆ పార్టీని సమీకరించాలనీ బాబు విశ్వప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో తన మిత్రుడైన పవన్‌ను బీజేపి మిత్రుడిగా రంగంలోకి దించి అతని ద్వారా బీజేపని ప్రసన్నం చేసుకొని మోతుబరి ఉద్యమానికి గుర్తింపు తెచ్చేలా వ్యూహం తయారుచేశారని సమాచారం. ఈ మోతుబరి ఉద్యమ ప్రహసనంలో మీడియా పోషిస్తున్న పాత్రను చరిత్ర మరవదు. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రంలోని వంద లాది పట్టణాల్లో వేలాదిమందితో జరుగుతున్న ప్రదర్శనల వార్తలను పూర్తిగా బ్లాకవుట్‌ చేసి గోరంత మోతుబరి ఉద్యమాన్ని కొండంతగా చేసి చూపడం నిత్యకృత్యంగా మారింది. తెలుగువారి దురదృష్టమేమిటో... చాలా సందర్భాల్లో చరిత్ర సహజ గమనానికి మీడియా ద్రోహం చేసింది.

మద్రాసు రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం విడిపోయిన తర్వాత 1955లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టులు అధికారంలోకి రావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే కమ్యూనిస్టు నేతల సభలకు జనం తండోపతండాలుగా హాజరయ్యారు. ఇక అప్పుడు చూపెట్టాయి తెలుగు పత్రికలు తమ తడాఖాను. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అందరి ఆస్తులూ లాగేసుకుంటారనీ, ఆడవాళ్ల మెడలోని నగలను పుస్తెల తాడుతో సహా జాతీయం చేస్తారనీ, అసలు ఆడవాళ్లనే జాతీయం చేస్తారనే అధమస్థాయి దాకా వెళ్ళింది మీడియా దుష్ప్రచారం. ఈ నీచ ప్రచారాన్ని భరించలేక ఆవేదనతో, ఆగ్రహంతో ‘‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’’ అని మహాకవి శ్రీశ్రీ కామెంట్‌ చేశాడు. ఆయన ఆంధ్రపత్రిక పేరొక్కటే పేర్కొన్నా, అప్పట్లో దాదాపు అన్ని పత్రికలూ ఈ పాతకంలో భాగస్వాములే. మళ్లీ ఆ స్థాయి నీచ ప్రచారాన్ని తెలుగు మీడియా 2014లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రయోగించింది.

ఆయన ఆ ప్రచారాన్ని చాలావరకు తట్టుకోగలిగినా, ఇతరేతర కారణాల వల్ల స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అరిగిపోయిన మీడియా రికార్డును మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోలేదు. మళ్లీ ఆరేడు నెలల్లోనే ఏదోఒక సెంటిమెంట్‌ ద్వారా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, దాని ద్వారా రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై భారీ కుట్ర జరుగుతున్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కుట్రలో భాగంగానే మోతుబరి ఉద్యమం మొలకెత్తింది. ఉద్యమానికి మద్దతుగా వ్యక్తులను, వర్గాలను, పార్టీలను, వ్యవస్థలనూ సమీకరించడం కోసం, ప్రభావితం చేయడం కోసం దాదాపు వెయ్యికోట్ల రూపాయలను ఇప్పటికే సమీకరించినట్టు సమాచారం. వీధుల్లో భిక్షాటన తంతు కేవలం లెక్క చూపడంకోసం మాత్రమే. 

నేపథ్యం: 
అపార ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చి, ఏడాది కూడా పూర్తికాకముందే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై భారీ కుట్రను ప్లాన్‌ చేయడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి: సమాజంలోని పేదవర్గాలను బలోపేతం చేయడంకోసం దేశంలో కనీవినీ ఎరుగని విధంగా చేపట్టిన విప్లవాత్మక చర్యలపై కొందరు మోతుబరుల కన్నెర్ర. ఇలాగే కొనసాగనిస్తే ఇకముందు ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడం అసాధ్యమని నిర్ధారణ. రెండు: అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ద్వారా వేలకోట్లు సంపాదించుకోవచ్చన్న మోతుబరుల లక్ష్యానికి గండిపడే అవకాశం ఉండటం. మూడు: అధికారంలో వున్న కాలంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు చేసిన అక్రమార్జన, అవినీతిపై విచారణ మొదలయితే శిక్షలు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నందువల్ల కలవరపెడుతున్న జైలు ఊచలు. 

ఈ మూడు గండాల నుంచి చంద్రబాబు అండ్‌ కో బయటపడాలంటే ఏదో చేయాలి. ఎంత ఖర్చయినా సరే! అందుకే ఈ హడావుడి. అందుకే ఈ కలవరం. ఏదో రకంగా కేంద్రం పెద్దలతో సఖ్యతకోసం చేయని ప్రయ త్నం లేదు. నడపని రాయబారం లేదు. ప్రభుత్వ  పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రకటించినప్పుడే ఈ ముఠా తెలుగు సెంటిమెంట్‌ను రగిలించడానికి ప్రయ త్నించింది. కానీ,పేద వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదురుకావడంతో వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కువేసి, ఇప్పుడు రాజధాని సెంటిమెంట్‌ను ఎగదోసే ప్రయత్నాలు చేస్తున్నది. 

బహుపరాక్‌! 
మాల కన్నమదాసును సేనాపతిగా నియమిస్తే కన్నెర్రచేసిన పెత్తందారీ వర్గాల వారసులు మళ్లీ కాలుదువ్వుతున్నారు. కష్టజీవులారా తస్మాత్‌ జాగ్రత్త. ఐక్యంగా నిలబడి కలబడితేనే తుది విజయం దక్కుతుంది.  
వెనుకబడిన వరాలు, దళిత, గిరిజన, మైనారిటీ అగ్రవర్గ పేదల సాధికారతపై దాడిచేసేటందుకు సెంటిమెంట్‌ ముసుగేసుకున్న తోడేళ్లు పొంచివున్నాయి. అభ్యుదయవాదులారా! మీ దారి ఎటు? పీడితులవైపా? తోడేళ్లవైపా? ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top