అరుదైన మేధావి!

Stephen Hawking Rare and Intelligent - Sakshi

మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్‌ హాకింగ్‌ కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8న ఒక అమ్మ కడుపున జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ జన్మ దినం రోజైన మార్చి 14న కన్నుమూసిన హాకింగ్‌ భౌతిక శాస్త్రాన్నీ... ప్రత్యేకించి విశ్వనిర్మాణ శాస్త్రాన్నీ ఒడిసిపట్టినవాడు. అందులోని ఎత్తుల్నీ, లోతుల్నీ మధించి లోకులకు తేటతెల్లమైన రీతిలో విప్పి చెప్పినవాడు. ఈ భూగోళం మనుగడపైనా, ఇక్కడి మానవాళి భవిష్యత్తుపైనా ఎంతగానో బెంగపెట్టుకున్నవాడు. వీళ్లందరికీ ఒక సురక్షితమైన గ్రహాన్ని చూపించి కాపాడాలని తపన పడినవాడు. ‘ఇది ఊహ కాదు... కల్పన కాదు, నూటికి నూరుపాళ్లూ వాస్తవం. సమయం మించిపోతోంది సుమా’ అంటూ పిలుపునిచ్చినవాడు. ఎవరెలాపోతే మనకేం అనుకునే లోకంలో మానవాళి భద్రత గురించి ఇలా ఆలోచించడం వింతగానే అనిపిస్తుంది. విశ్వాంత రాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని హెచ్చరించినప్పుడు అందరూ ఆయన్ను వెర్రి వాడిగా లెక్కేశారు. 

గ్రహాంతరజీవులు(ఏలియన్స్‌) మనకన్నా బాగా తెలివైనవాళ్లు అయివుండొచ్చునని, ప్రయోగాల పేరిట వాళ్లని నిద్ర లేపితే ఈ భూమి మనకు కాకుండా పోవచ్చునని కూడా హాకింగ్‌ హెచ్చరించారు. నిత్యం అంకెలతో సావాసం చేస్తూ జీవించినంతకాలమూ వాటితో ఆడుకున్న హాకింగ్‌... గణితంలో ఆసక్తి ఉండే వారంతా ‘పై డే’ (22/7= 3.14)గా పిలుచుకునే రోజైన మార్చి 14నే యాదృచ్ఛి కంగా కన్నుమూశాడు. విశ్వరహస్య పేటికను ఛేదించి అందులోని ప్రతి అంశాన్నీ పామర జనానికి కూడా విప్పి చెప్పిన హాకింగ్‌ను నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ప్రకృతి చిన్న చూపు చూసింది. కండరాల కదలికల్ని స్తంభింపజేసే మాయదారి అమియోట్రోఫిక్‌ లాటరల్‌ స్కెలరోసిస్‌(ఏఎల్‌ఎస్‌) అనే వ్యాధి ఆవహించి అరుదైన ఆ మేధావిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. అయితే అది శరీరాన్ని చేతనారహితం చేసిందే మోగానీ మెదడును తాకలేకపోయింది. 

ఆలోచనలకు ఆటంకాలు సృష్టించలేకపోయింది. వాటిని వ్యక్తీకరించే కంఠాన్ని నొక్కిపెట్టి ఉంచిందేమోగానీ ఆయన సంక ల్పాన్ని నిరోధించలేకపోయింది. చక్రాల కుర్చీకే అతుక్కుపోక తప్పని స్థితి ఏర్పడ్డా, ఆలోచనలు మెరుపు వేగంతో విశ్వాంతరాళాన్ని నిరంతరరాయంగా అన్వేషిస్తూనే వచ్చాయి. అందులోని వింతలనూ, విశేషాలనూ మధించాయి. ఆయన ఆత్మ స్థైర్యం ముందు ఆ మాయదారి వ్యాధి ఓడిపోయింది. అనుక్షణమూ దాన్ని ధిక్క రిస్తూ అపురూపమైన, అనూహ్యమైన సిద్ధాంతాలను ప్రతిపాదించి శాస్త్ర విజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏఎల్‌ఎస్‌ వ్యాధి సోకింది గనుక ఇక రెండే ళ్లకు మించి బతకడని చెప్పిన వైద్యుల్ని పరిహసించడమే కాదు... అంతక్రితం ఎవరి చూపూ పడని అనేకానేక అంశాలపై దృష్టి సారించి అరుదైన ప్రతిపాదనలు చేశారు. అసంఖ్యాకంగా గ్రంథాలు వెలువరించారు. ఆయన రాసిన ‘ఏబ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ ప్రపంచవ్యాప్తంగా నలభై భాషల్లోకి అనువాదమైంది. 237 వారాలపాటు నిరంతరాయంగా లండన్‌ ‘సండే టైమ్స్‌’ బెస్ట్‌ సెల్లర్‌ గ్రంథాల్లో అగ్రభాగాన ఉంది. ప్రపంచ దేశాల్లో ఆ గ్రంథం చదివిన అనేకులు అనంతరకాలంలో శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకున్నారు. 

చిన్నప్పుడు తరగతి గదిలో టీచర్‌ పాఠం చెబుతుంటే బుద్ధిగా కూర్చుని వినే లక్షణం హాకింగ్‌కు లేదు. ఆ పాఠంలో టీచర్‌ కూడా గమనించని సంగతుల్ని ఇట్టే పట్టేయడం, వాటిల్లోని గుణదోషాలను చర్చించడం ఆయనకు హాబీ. కాగితం, కలంతో పనిలేకుండా కేవలం కళ్లతో చూసి చటుక్కునచెప్పే హాకింగ్‌ టీచర్లకు ఒక వింత. గెలీలియో త్రిశత జయంతి రోజునే పుట్టిన హాకింగ్‌కు ఆ శాస్త్రవేత్తంటే వల్ల మాలిన అభిమానం. ‘అందరూ కళ్లతో వస్తువుల్ని చూస్తారు. అందుకోసమే వాటిని వినియోగిస్తారు. కానీ ఆ వస్తువుల లోలోతుల్ని ఆరా తీసేలా కళ్లను సమ ర్ధవంతంగా వినియోగించింది గెలీలియోనే’ అని ఒక సందర్భంలో హాకింగ్‌ అంటాడు. చిత్రమేమంటే ఈ మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. కృష్ణ బిలాల గురించి, వాటి పనితీరు గురించి అంచనా వేయడానికి హాకింగ్‌ ఒక విధానాన్ని రూపొందిం చారు. విజ్ఞాన శాస్త్రంలో అది ‘హాకింగ్‌ రేడియేషన్‌’గా గుర్తిం పుపొందింది. భౌతిక శాస్త్రంలోని ఏ రెండు విభాగాలకూ పొసగదని ఒక చమత్కారం ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటమ్‌ మెకానిక్స్‌నూ మేళ వించి అందులోని సూక్ష్మాంశాల ప్రాతిపదికగా కృష్ణబిలాలు క్రమేపీ ద్రవ్యరాశిని కోల్పోతూ నక్షత్రాల్లాగే అవి అంతరించి పోతాయని హాకింగ్‌ రుజువుచేశాడు. అంతేనా... ‘మీ జీవితం ఒక కృష్ణబిలం అను కుంటున్నారా... అను కోండి. కానీ అది కూడా అంతరించిపోయి కొత్తరూపు దాల్చకతప్పదని తెలుసుకోండి’ అంటూ నిరా శావాదులకు ఆత్మవిశ్వాసం నూరి పోశాడు. ‘కిందనున్న పాదాలకేసి కాదు... నక్షత్రాలవైపు చూపు సారించండ’ని ఉద్బోధించాడు. 

హాకింగ్‌కొచ్చిన వ్యాధి ఎలాంటిదో, దానివల్ల ఆయన పడుతున్న యాత నేమిటో, అందుకు అలవాటుపడి ఆ పరిమితుల్లోనే ఎలా జీవనం సాగిస్తున్నాడో తెలియజెప్పే ‘ద థియరీ ఆఫ్‌ ఎవ్విర్‌థింగ్‌’ అనే చిత్రం నాలుగేళ్లక్రితం వచ్చింది. ‘మనమేం అధికులం కాదు. కోతుల్లో కాస్త అభివృద్ధిచెందిన జాతివాళ్లం’ అంటూ హెచ్చరించి మన చేష్టలతో పర్యవరణకొస్తున్న ప్రమాదాన్నీ, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) తెచ్చే పరిణామాల్నీ చర్చించిన అరుదైన శాస్త్రవేత్త ఆయన. అయిదారు నెలలక్రితం ఒక చర్చ సందర్భంగా ‘ప్రజలకు రోబోలకన్నా పెట్టుబడిదారీ విధానంతోనే, అది తెచ్చే అసమానతలతోనే ముప్పు ఎక్కువ’ని హాకింగ్‌ చెప్పడాన్నిబట్టి ఆయన ఆలోచనాధారను అర్ధం చేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రంపైన మాత్రమే కాదు... సమాజగమనంపై కూడా ఆయన చూపెంత నిశితమో ఈ వ్యాఖ్య పట్టి చూపుతుంది. స్టీఫెన్‌ హాకింగ్‌వంటి అరుదైన మేధావిని, అపు రూపమైన శాస్త్రవేత్తను కోల్పోవడం మానవాళి చేసుకున్న దురదృష్టం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top