న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ కంపెనీ ‘ఫిజిక్స్‌వాలా’ చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ రూపొందించిన ఒక ప్రకటన.. కశ్మీర్‌లోని పర్యావరణాన్న దెబ్బతీసేవిధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలోని బాదర్‌కోట్ అడవుల గుండా ‘‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు స్కార్పియో వాహనాల్లో వెళుతున్నట్లు చూపిన ఈ ప్రకటన పోలీసు దర్యాప్తుకు దారితీసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుల్మార్గ్ ఇఫ్తిఖర్ అహ్మద్ ఖాద్రీ ఫిర్యాదు మేరకు టాంగ్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని ఆరు నల్ల స్కార్పియో వాహనాల్లో ‘ఫిజిక్స్‌వాలా’ అధ్యాపకులు అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించే ఈ యూట్యూబ్ వీడియోపై ఫిర్యాదు నమోదయ్యింది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫిజిక్స్‌వాలా ఈ ఫుటేజ్ ఉపయోగించింది. ఈ చర్య భారత అటవీ చట్టం 1927, అటవీ సంరక్షణ చట్టం 1980కు విఘాతం కలిగించేలా ఉంది. ‘ఫిజిక్స్‌వాలా’ పై అటవీ అధికారి చేసిన ఫిర్యాదులో ఆ వాహనాలను పచ్చని పచ్చిక బయళ్లపై నడిపి, మూలికలు, వృక్షజాలానికి నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద.. ‘ఫిజిక్స్‌వాలా’ ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందంటూ కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసినందుకు పలువురు యూట్యూబర్లపై కేసు నమోదయ్యింది. వారు పచ్చిక బయళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో డిప్యూటీ కమిషనర్ బిలాల్ మోహిదిన వారిపై ఎఫ్ఐఆర్‌కు ఆదేశించారు. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


