జాతి మరువని చరితార్థుడు వాజ్‌పేయి

Pentapati Pullarao Article On Atal Bihari Vajpayee - Sakshi

విశ్లేషణ

నిఖార్సుగా 93 ఏళ్ల జీవితం గడిపిన ప్రియతముడు అటల్‌ వాజ్‌పేయి వయోగత సమస్యలతో చాలాకాలంగా ఇబ్బందిపడ్డారు. దేశ ప్రజల్లో అనేకమంది వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. జూలియస్‌ సీజర్‌ గురించి షేక్స్‌పియర్‌ వర్ణిస్తూ, ‘‘మనుషులు చేసిన చెడుపనులు వారు మరణించాక వెన్నాడుతుంటాయి. చేసిన మంచి పనులు వారితోపాటు శిథిలమవుతాయి’’ అన్నాడు.
 

గత పదిరోజులుగా మనం 94 ఏళ్ల ఎం కరుణానిధి, 93 ఏళ్ల ఏబీ వాజ్‌పేయి గురించి తీవ్ర విషాద ప్రకటనలను, అద్వితీయ ప్రశంసలను చూస్తూ వచ్చాం. షేక్స్‌పియర్‌ భారతీయులను ఎన్నడూ కలుసుకోలేదు కాబట్టి మరణించిన వారి గురించి ఆయన చెప్పిన మాటలు తప్పు కావచ్చని మనం భావించవచ్చు. చనిపోయిన తమ నాయకుల పట్ల భారతీ యులు చాలా ఉదారంగా ఉంటారు. ఆ సమయంలో నేతలు చేసిన మంచిపనులు మాత్రమే మన దృష్టికి వస్తుంటాయి. నాయకులు మరణించాక భారతీయులు వారిని పూర్తిగా క్షమించేస్తూ ఉంటారు. 

చరిత్ర అనేది సమతుల్యతతో చేయాల్సిన కృషిగా చెబుతుంటారు. నాయకుడు మరణించిన వారంలోపు ఎవరూ ఆయన చరిత్ర గురించి రాయలేరు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1996 మే నెలలో ప్రధాని పదవినుంచి దిగిపోయినప్పుడు ఆయన్ని ఒక విఫల ప్రధానిగా అందరూ భావిం చారు. కానీ కాలం గడిచేకొద్దీ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రుల్లోనే అగ్రగణ్యుడిగానూ గణుతికెక్కారు. ఆర్థిక వ్యవస్థలో అతి గొప్ప మార్పులను చేశారని, పాకిస్తాన్‌ ఉగ్రవాదం నుంచి పంజాబ్‌ను కాపాడారని, అస్సాం సమస్యలను పరిష్కరించారని, విదేశీ విధానాన్ని సునిశిత మేధస్సుతో నిర్వహించారని ప్రజలు రాన్రానూ గ్రహిస్తూ వచ్చారు. 

అటల్‌ బిహారీ వాజ్‌పేయి 1957లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. తర్వాత మరొక తొమ్మిదిసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ హత్యకు గురయ్యాక 1985 లోక్‌సభ ఎన్నికల్లో సీటు కోల్పోయారు. ఆయన జీవితంలో అత్యంత ఉన్నత స్థితి ఏదంటే మూడుసార్లు ప్రధాని కావడమే. 1996లో కేవలం 14 రోజులపాటు ప్రధానిగా ఉండగా, 1998లో ఒక సంవత్సరంపాటు, తర్వాత 1999లో అయిదేళ్లపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 

తన పాలనాకాలంలో వాజ్‌పోయి ఎదుర్కొన్న అతి పెద్ద పరీక్ష పాకిస్తాన్‌ కార్గిల్‌పై చేసిన దాడి. దీంట్లో ఆయన స్పష్టమైన విజయం సాధించారు. కశ్మీర్‌పై భారత్‌ పట్టును పూర్తిగా మార్చివేసింది కాబట్టి కార్గిల్‌ ఏ దశలోనూ పరాజయానికి తావివ్వలేదు. అదేసమయంలో పాకిస్తాన్‌తో శాంతి స్థాపన అవసరాన్ని గుర్తించి ఆమోదించిన అటల్‌ పాకిస్తాన్‌కు బస్సుయాత్రతో చరిత్ర సృష్టించారు. నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో మిత్రత్వం ఏర్పర్చుకుని భారత్‌ ప్రతిష్టను పెంచారు. 

వాజ్‌పేయి రాజకీయ విజయాల్లో మరొక ప్రముఖ అంశం ఏదంటే, ఆయన దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక ఆమోదనీయతను తీసుకొచ్చారు. చివరకు ద్రవిడ రాజకీయపార్టీలైన డిఎంకే, ఏఐడీఎంకె కూడా బీజేపీతో పొత్తుకు అనుకూలత వ్యక్తపరిచాయి. వాజ్‌పేయి ప్రశాంత వైఖరి, ఆయన వదనం వ్యక్తీకరించే గొప్ప ప్రకాశం కారణంగా దేశప్రజలు ఆయనను ఎంతో ఇష్టుడిగా చూశారు. అటల్‌ ప్రజాకర్షణ వల్లే 1998లో బీజేపీ అనేక ఎంపీసీట్లు గెల్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పొత్తూ లేకుండానే 1998లో 42 ఎంపీస్థానాలకు గానూ బీజేపీ 6 స్థానాలు గెల్చుకోవడానికి కారణాన్ని ఎవరయినా ఊహించుకోవచ్చు. 

అమెరికా నగరాలపై ఒసామా బిన్‌ లాడెన్‌ దాడిచేసిన తర్వాత జార్జి బుష్‌ హయాంలో అమెరికా మనసు గెల్చుకోవడంలో వాజ్‌పేయి విజయం సాధించారు. ఆనాటి నుంచి పాకిస్తాన్‌ అమెరికాతో సరైన సంబంధాలను ఎన్నటికీ సాధించలేకపోయింది. 1977లో మొరార్జీ దేశాయ్‌ కేబినెట్‌లో విదేశాంగశాఖను నిర్వహించిన వాజ్‌పేయి వీసా దరఖాస్తుల వ్యవస్థను సులభతరం చేశారు. దీంతో లక్షలాది భారతీయులు సులభంగా వీసాలను పొందగలిగారు. అటల్‌ గొప్ప విజయాల్లో ఇదీ ఒకటి. దేశంలో మౌలిక వ్యవస్థల కల్పనకు అటల్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలోని అన్ని నగరాలను అనుసంధానిస్తూ తీసుకొచ్చిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారుల పథకం అటల్‌ మానసపుత్రిక అనే చెప్పాలి. అలాగే గ్రామీణ రహదారుల నిర్మాణానికి కూడా నిధులు సమకూర్చారు.

అయోధ్యలో రామమందిర్‌ ఉద్యమం కారణంగానే బీజేపీ ఎన్నికల్లో గెలుపు సాధించినప్పటికీ, వాజ్‌పేయి దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. ఆ ఉద్యమానికి ఆయన దూరంగా ఉన్నారు కాబట్టే ఆయన భావాలరీత్యా ఛాందసవాది కాదంటూ ప్రజల్లో ప్రతిష్ట పెరిగింది. ఇది వాజ్‌పేయి సాధించిన గొప్ప విజయం.పైకి మృదుస్వభావిగా కన్పించినప్పటికీ వాజ్‌పేయిది ఉక్కుహృదయం. సరైన సమయం వచ్చేంతవరకు కొన్ని నిర్ణయాలను ఆయన ఎన్నడూ మార్చుకునేవాడు కాదు. మధ్యప్రదేశ్‌ సీఎం ఉమాభారతి, ఢిల్లీ ముఖ్యమంత్రులు సుష్మాస్వరాజ్, మదన్‌లాల్‌ ఖురానా వ్యవహారం దీనికి ఉదాహరణ. తమపై కేసుల కారణంగానే వీరు ముగ్గురూ తమ పదవులకు రాజీనామా చేశారు. కోర్టులు క్లీన్‌ చిట్‌ ఇచ్చినప్పటికీ ఉమాభారతి, ఖురానాలు మళ్లీ సీఎం పదవిలో కూర్చోవడానికి వాజ్‌పేయి ఎన్నడూ అనుమతించలేదు. ఇక సుష్మాకు కేంద్రమంత్రి పదవి చేపట్టడానికి మరొక 15 నెలల కాలం వేచి ఉండాల్సి వచ్చింది.

ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే వాజ్‌పేయి హయాంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించాలంటే చమురుధరలు తక్కువగా ఉంటేనే సాధ్యం. దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమింపజేయలేదు కానీ అటల్‌ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహిం చలేకపోయింది. మన్మోహన్‌సింగ్‌ లాంటి నిపుణుడు అట ల్‌కు దొరకలేదు. వాజ్‌పేయికి నేడు దక్కుతున్న విశేష ప్రశంసలను గమనించినట్లయితే, అవన్నీ నేటి ప్రధాని మోదీపై విమర్శల ప్రతిఫలనంగానే చూడాల్సి వస్తుంది. అటల్‌ని ప్రశంసించడం ద్వారా మోదీలోని అహంభావాన్ని, ఆధిక్యతా భావాన్ని ప్రజలు విమర్శిస్తున్నారనే ఇది సూచిస్తుంది. 

అటల్‌ అస్తమయం సందర్భంగా ప్రతి టీవీ చానల్లో, ప్రింట్‌ మీడియాలో వాజ్‌పేయి గురించి ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు కానీ అటల్‌ 2004లో అనూహ్యంగా ఎదుర్కొన్న ఘోరపరాజయాన్ని, ఆయన రాజకీయ కెరీర్‌కే అది ముగింపు పలకడాన్ని గురించి ఎవరూ చర్చించడం లేదు. ఒక ప్రభుత్వ అనూహ్య పరాజయం అనేక బలహీనమైన అంశాలను ఎత్తి చూపిస్తుంది కానీ వాజ్‌పేయి విషయంలో అలాంటి క్షణం ఇంకా తటస్థించటం లేదు. తీరంలోని ఇసుకతిన్నెలపై పడిన పాదముద్రలను ప్రజలు కాలక్రమంలో మర్చిపోతారంటూ ప్రముఖ కవి హెన్రీ లాంగ్‌ఫెల్లో గతంలో పేర్కొన్నారు. వాజ్‌పేయిపై కాలం ఇచ్చే తీర్పునకు మనం కూడా వేచి ఉండాలి.

పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top