ఎట్టకేలకు ఎస్‌–440 ఒప్పందం

Editorial On India And Russia Missile Agreement - Sakshi

భారత్‌–రష్యాల మధ్య ఎస్‌–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ(ఏడీఎంఎస్‌) విషయంలో సాగుతున్న చర్చలు ఫలించి ఒప్పందం కుదురుతుందా, లేదా అన్న అంశంపై చెలరేగుతున్న ఊహాగానాలకు తెరపడింది. రెండురోజుల పర్యటన కోసం గురువారం మన దేశం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని నరేంద్రమోదీతో వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిపాక ఇరు దేశాల మధ్యా అత్యంత కీలకమైన ఈ ఒప్పందంపై సంతకాలయ్యాయి. దీంతోపాటు మరో ఏడు ఒప్పం దాలపై కూడా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. ఎస్‌–400 మన సైన్యానికి ఎంతో అవసరమై నదే అయినా, అది మన రక్షణ వ్యవస్థ తీరుతెన్నులను మలుపు తిప్పేదే అయినా కొన్నేళ్లుగా మన దేశం తటపటాయిస్తోంది. దీనిపై ఒక ఒప్పందానికి వచ్చినా చివరి నిమిషంలో ఆగిపోయిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఈసారి కూడా ఎంతో అనిశ్చితి నెలకొంది. అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే ఒప్పందం కుదరడం లేదని గతంలో కథనాలు వెలువడినా దానిపై అటు రష్యాగానీ, ఇటు మన దేశంగానీ ఎప్పుడూ వివరణనివ్వలేదు. 

సోవియెట్‌ యూనియన్‌ పతనమై అమెరికా ప్రభావం ప్రపంచ దేశాలపై పెరిగిన తర్వాత ఇత రుల తరహాలోనే మన దేశం కూడా అమెరికాకు దగ్గరవుతూ వచ్చింది. రష్యా ఆధ్వర్యంలో పూర్వపు సోవియెట్‌ దేశాల్లో అత్యధికం ఒక కూటమిగా ఏర్పడి క్రమేపీ కోలుకున్నాక పాత మిత్రులకు మళ్లీ సన్నిహితం కావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంట్లో భాగంగానే ఇకపై ఏటా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని భారత్‌–రష్యాలు 2000 సంవత్సరంలో నిర్ణయించాయి. అప్పటినుంచీ అవి క్రమం తప్పకుండా సాగుతూనే ఉన్నా, ఇరు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబం ధాలూ ఉన్నతస్థాయికి చేరినా... అమెరికాతో మనకు అణు ఒప్పందం కుదిరిన అనంతరకాలంలో అనుమానాలు ముసురుకోవడం మొదలైంది. తన ప్రయోజనాలకు విరుద్ధంగా మనం అమెరికాతో సన్నిహితమవుతున్నామని రష్యా భావించడం మొదలుపెట్టింది.

ఏటా శిఖరాగ్రసమావేశాలు సాగు తున్నా ఆ అనుమానాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. భారత్‌ తన వ్యూహాత్మక వైఖరిని మార్చుకుంటున్నదని, అమెరికాకు మాత్రమే కాక దాని మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా వగైరా లతో కూడా కలిసి అడుగులేస్తున్నదని రష్యా అంచనా వేసింది. మన విషయంలో రష్యాకు అనుమా నాలున్నట్టే, మనకూ పలు సందేహాలున్నాయి. అది చైనాతో జట్టు కడుతున్న తీరు మన దేశానికి నచ్చటం లేదు. చైనాతో మనకున్న సరిహద్దు వివాదాలు కావొచ్చు, పాకిస్తాన్‌కు అది అన్నివిధాలా అండగా నిలుస్తున్న తీరువల్ల కావొచ్చు... ఆ దేశంతో రష్యా దగ్గరైతే భారత్‌ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న భావన మనకుంది. ఈమధ్య రష్యా చైనాకు యుద్ధ విమానాలను విక్ర యించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. భద్రత పరంగా ఇది చేటు తెస్తుందని మన దేశం విశ్వసి స్తోంది. అలాగే ఆ దేశానికి అత్యంతాధునాతన కిలో క్లాస్‌ జలాంతర్గాముల అమ్మకం కూడా భార త్‌కు ససేమిరా ఇష్టం లేదు. వీటికితోడు రష్యా తొలిసారిగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, కరాచీలోని అణుశక్తి కర్మాగారానికి శత్రుదేశాలనుంచి ముప్పు కలగకుండా కాపాడే రాడార్‌ను అంద జేయడానికి అంగీకరించింది. 

అయితే రష్యాతో మనకున్న అనుబంధం దశాబ్దాలనాటిది. అది వెనువెంటనే తెగేది కాదు. ఇప్పటికీ రక్షణ రంగ కొనుగోళ్ల విషయంలో మనం రష్యాపైనే ఆధారపడతాం. మన రక్షణ అవస రాల్లో 73 శాతం అక్కడినుంచే దిగుమతి అవుతాయి. అలాగే అణు జలాంతర్గాములతోసహా అత్యంత కీలకమైన సాంకేతికతలను మనకు అందించడంలో రష్యా ఎప్పుడూ ముందుంది. అమె రికా తదితర దేశాలతో పోలిస్తే రష్యా విధానం మనకు అనుకూలంగా ఉంటుంది. అది అమ్మకా లతో సరిపెట్టకుండా సాంకేతికతను కూడా బదిలీ చేస్తుంది. బ్రహ్మోస్‌ క్షిపణులు, బహువిధ సైనిక రవాణా విమానాలు, యుద్ధ విమానాలు, టి–90 ట్యాంకులు రష్యా సాంకేతిక సాయంతో మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇలా ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నా, తెలియని వెలితి రెండు దేశాలనూ వెంటాడుతోంది. ఈలోగా రష్యాపై అమెరికా ఆంక్షలు అమల్లోకొచ్చాయి. ఆ దేశంతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందం కుదుర్చుకునే దేశాలపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తా మని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. రష్యాతో ఎస్‌–400 క్షిపణి ఒప్పందం కుదిరితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనని మన దేశం ఆందోళన పడింది. అయితే మా మిత్రుల సైనిక సామ ర్థ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం లేదని అమెరికా ప్రకటించింది. ఎస్‌–400 ఒప్పందం విషయంలో భార త్‌పై ఆంక్షలు విధించబోమని అమెరికా రక్షణమంత్రి జేమ్స్‌ మాటిస్‌ కూడా ఇంతక్రితం చెప్పారు. 

సాంకేతికంగా చూస్తే ఎస్‌–400 గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ మైనది. బాలిస్టిక్‌ క్షిపణుల రాకను చాలా ముందుగానే పసిగట్టి వాటిని నేరుగా ఢీకొని తుత్తినియలు చేసే సామర్థ్యం దీనికుంది. బహుళ ప్రయోజనకర రాడార్‌ వ్యవస్థ, మూడు రకాల క్షిపణుల్ని ఏకకా లంలో సంధించగల శక్తి, 400 కిలోమీటర్ల పరిధిలోని, 30 కిలోమీటర్ల ఎత్తులోని విమానాలను, మానవరహిత విమానాలను, బాలిస్టిక్‌ , క్రూయిజ్‌ క్షిపణులను పసిగట్టి ధ్వంసం చేసే నేర్పు దీని సొంతం. ఏకకాలంలో గగనతలంలోని 100 లక్ష్యాలను పసిగట్టగలదు. మెరుపు వేగంతో దూసు కొచ్చే అమెరికా తయారీ ఎఫ్‌–35 యుద్ధ విమానాలైనా ఆరింటిని ఒకేసారి ఎదుర్కొనగలదు. మాస్కో మహానగర రక్షణ వ్యవస్థకు రష్యా దీన్నే వినియోగిస్తోంది. మూడేళ్లక్రితం చైనా సైతం దీన్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాతే మన దేశం ఇది అత్యవసరమని భావించింది. మొత్తానికి రష్యాతో కుదిరిన తాజా ఒప్పందాలు ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడేందుకు దోహదపడ్డాయి. మున్ముందు మనతో అమెరికా వ్యవహారశైలి ఎలా ఉంటుందో వేచిచూడాలి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top