అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Sat, Mar 11 2017 3:38 AM

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి - Sakshi

► తూంపల్లి శివారులోని బిస్కెట్‌ పరిశ్రమ ఎదుట మృతదేహం
► పురుగుమందు తాగి ఆత్మహత్య..!


కొందుర్గు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం తూంపల్లి శివారులోని బిస్కెట్‌ పరిశ్రమ ఎదుట చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం పద్మారం గ్రామపంచాయతీ ఎల్కగూడ గ్రామానికి చెందిన బోయ చిన్నమ్మ, ఈదయ్యలకు నలుగురు కుమారులు. వీరిలో కిశోర్, నరేష్‌ అనే ఇద్దరు సోదరులు గతంలో హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండేవారు.

సురేష్, అజయ్‌ అనే మరో ఇద్దరు సోదరులు తల్లిదండ్రులతోపాటు ఇంటి వద్దనే ఉండేవారు. రెండేళ్ల క్రితం కిశోర్‌ కూడా ఇంటికొచ్చి బిస్కెట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నరేష్‌(26) మాత్రం హైదరాబాద్‌లోనే కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం నరేష్‌ మృతదేహం తూంపల్లి శివారులోని బిస్కెట్‌ పరిశ్రమ ఎదుట కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నరేష్‌ నోట్లో నుంచి నురగలు రావడం చూస్తుంటే పురుగుల మందు తాగి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ప్రేమ వ్యవహారమే కారణమా..?
నరేష్‌ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా పదిహేను రోజుల క్రితం విజయ అనే యువతి బంధువులతో కలిసి నరేష్‌ ఇంటికి వచ్చింది. ఎల్కగూడ గ్రామానికి వచ్చిన ఆమె.. తానూ, నరేష్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ బట్టల దుకాణంలో పనిచేసేవారమని, అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని గ్రామస్తులకు వివరించింది. నరేష్‌ రెండు నెలల క్రితం తనను వదిలి వెళ్లిపోయాడని అతడిని పిలిపించి తనకు న్యాయం చేయాలని కోరింది. గ్రామంలో నరేష్‌ లేడని తెలుసుకుని తిరిగి వెళ్లిపోయింది.

దీంతో నరేష్‌ కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు నరేష్‌ను తీసుకురావడానికి అతడి తమ్ముడిని హైదరాబాద్‌ పంపించారు. ఈ నెల 6న నరేష్, అతడి తమ్ముడు కలిసి ఎల్కగూడ గ్రామానికి బైక్‌పై వస్తుండగా ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని తమ్ముడిని బుద్వేల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్దనే ఉంచి పరారయ్యాడు. నరేష్‌ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో నరేష్‌ శుక్రవారం మధ్యాహ్నం శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

శుక్రవారం ఎస్సై లింగం, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ మధుసూదన్  సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఈదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింగం తెలిపారు. నరేష్‌ మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. నరేష్‌ అన్న కిశోర్‌ కూడా గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వారిరువురి మధ్య నెలకొన్న వివాదంలోనూ నరేష్, అతడి అన్నపై కుల్కచర్ల పోలీసుస్టేషన్ లో రెండేళ్ల క్రితం కేసు నమోదైంది. ఈ కేసులో అన్నదమ్ములు జైలుకు కూడా వెళ్లొచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement