అడిగేదెవరు! | who asking? | Sakshi
Sakshi News home page

అడిగేదెవరు!

Aug 8 2016 11:15 PM | Updated on Aug 29 2018 9:29 PM

అడిగేదెవరు! - Sakshi

అడిగేదెవరు!

కృష్ణా జలాలతో ఒకప్పుడు కళ కళలాడిన పంట భూములు నేడు బీళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం కర్నూలు, కడప జిల్లాల్లోనే సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు.

 కృష్ణా జలాల్లో సీమ వాటా ఎంత?
– మొన్న తాగునీటికని 10, నేడు పుష్కరాల పేరుతో మరో 5 టీఎంసీలకు ఎసరు
– గుండ్రేవుల డీపీఆర్‌పై నోరు మెదపని అధికార పార్టీ నేతలుl
– తుంగ నీటిపై కేసీ, దిగువ రైతుల్లో దిగాలు
– గత రెండేళ్ల తీర్మానాలను ప్రభుత్వానికి పంపని అధికారులు
– నేడు సాగు నీటి సలహా మండలి సమావేశం
 
 
జిల్లా ఆయకట్టుదారులకు తుంగభద్ర, కృష్ణానదులు ఆధారం. అయితే, పాలకులు చూపుతున్న వివక్షతో ఈసారి ఆయకట్టు సాగు చేస్తామో...లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది.  తుంగభద్ర నది పరివాహాక ప్రాంతంలో ఆశించిన మేరా వర్షాలు కురవలేదు.  గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి.  ఇక కృష్ణమ్మ మాత్రం బిర బిర మంటున్నా కరువు సీమ గొంతు తడపకముందే దిగువకు తరలిస్తున్నారు. కష్ణా జలాల్లో రాయల సీమ జిల్లాలకు రావాల్సిన వాటా ఎంత? అని ప్రభుత్వాన్ని  నిలదీయాల్సిన అధికారపార్టీకి చెందిన జిల్లా నేతలు అధికారులపై చిందులు వేసి చేతులు దులుపుకుంటున్నారు.  
 
నేటి ఐఏబీ సమావేశంపై ఆశలు
 మంగళవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌ సమావేశ  మందిరంలో 2016–17 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సాగు నీటి కాల్వలకు ఖరీఫ్‌ సీజన్‌లో ఇచ్చే నీరు, సాగుపై నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనైనా సీమకు కృష్ణా జలాల్లో రావాల్సిన వాటా నీటిపై, దిగువ నీటి జల చౌర్యంపై, హంద్రీనీవా నుంచి ట్యాంకులకు నీటిని నింపేందుకు 155 కోట్ల ప్రతిపాదనలపై, గుండ్రేవుల ప్రాజెక్టు కోసం 2300 కోట్లతో పంపిన డీపీఆర్‌(డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) మంజూరు చేయకపోవడంపై నేతలు గళమెత్తి...జల వాటా సాధిస్తారని ఆయకట్టుదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
 
కర్నూలు సిటీ: కృష్ణా జలాలతో ఒకప్పుడు  కళ కళలాడిన పంట భూములు నేడు బీళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం కర్నూలు, కడప జిల్లాల్లోనే సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు.  జలాల్లో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 118 టీఎంసీల నీరు కేటాయించింది. ఇందులో 48 టీఎంసీలు నికర జలాల వాటాగా, మిగిలిన 70 టీఎంసీల నీరు వరద జలాల వాటా ఉంది. మొదటగా సీమకు రావాల్సిన 48 టీఎంసీల నికర జలాలు ఇచ్చిన తర్వాతనే దిగువన ఉన్న సాగర్‌కు నీటిని విడుదల చేయాలి. ఈ నీరు సీమ జిల్లాలకు రావాలంటే శ్రీశైలం డ్యాంలో కనీస నీటి మట్టం 854 అడుగుల మేరకు నీరు ఉండాలి. కానీ 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ 69 జీఓ తీసుకువచ్చారు. ఈ జీఓతో రాయల సీమ జిల్లాలకు కనీసం నికర జలాల వాటా కూడా రావడం లేదు. వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యాక 2004లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా 107 జీఓ తీసుకువచ్చారు. ఈ జీఓను 2010 నుంచి సక్రమంగా అమలు చేయడం లేదు. దీంతో 69 జీఓను సాకు చూపి «శ్రీశైలం నీటిని 790 అడుగుల వరకు తాగునీటి అవసరాల పేరుతో దిగువకు తీసుకుపోతున్నా కర్నూలు జిల్లా నుంచి అడిగేవారు కరువయ్యారు.  గతేడాది 790 అడుగుల వరకు నీటిని సాగర్‌కు తీసుకుపోయారు. కానీ రాయల సీమలో నెలకొన్న తాగు నీటి ఎద్దడి గురించి మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా 790 అడుగుల వరకు నీటిని తీసుకుపోయేందుకు త్రెషోల్డ్‌ లెవెల్‌ అనే పేరును ఇటీవల కష్ణా బోర్డు మీటింగ్‌లో తీసుకువచ్చారు. శ్రీశైలంలో కనీస నీటి మట్టానికి కూడా చేరకముందే తాగు నీటి పేరుతో 7 టీఎంసీలు డెల్టాకు, 3 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. మరో సారి పుష్కరాల పేరుతో మరో 5 టీఎంసీలను సాగర్‌కు తరలించేందుకు కష్ణా బోర్డు అనుమతి తీసుకున్నారు. నేడో, రేపో పవర్‌ ఉత్పత్తి ద్వారా20 వేలు, గేట్లు ఎత్తి మరో 30 వేల క్యుసెక్కుల నీరు దిగువకు వదలనున్నారు. ఇప్పటికైనా సీమ నేతలు మేల్కోకుంటే ఈ ఏడాది ఆయకట్టురైతులక మిగిలేది కన్నీళ్లే.
6.3 టీఎంసీలతో సరిపెట్టే ఎత్తుగడ...!
 పట్టిసీమ పూర్తి అయ్యాక..కష్ణాడెల్టాకు శ్రీశైలం నీరు అవసరం లేదని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ తాగునీటి పేరుతో 10 టీఎంసీలు, పుష్కరాల పేరుతో మరో 5 టీఎంసీలకు ఎసరు పెట్టారు. ఇప్పటి వరకు డెల్టాకు పట్టిసీమ ద్వారా 6.3 టీఎంసీల నీరు ఇచ్చామని,  అంతే మొత్తంలో 6.3 టీఎంసీలు రాయల సీమ ప్రాజెక్టులకు ఇస్తామని ఇటీవల మంత్రి ప్రకటన చేశారు. వాస్తవంగా శ్రీశైలంలో నీటి మట్టం పెరగడంతోనే నీటిని వదిలారు. అయితే దిగువకు నీటిని వదిలేసి 6.3 టీఎంసీల నీటితోనే సీమకు పరిమితం చేసేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడ వేస్తున్నారు.
గత సమావేశాల్లో తీర్మానాలకే సరి...!
గత రెండేళ్ల ఖరీఫ్‌ సీజన్‌లో నిర్వహించిన నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశాల్లో చేసిన తీర్మానాలేవి నేటికి అమలుకు నోచుకోలేదు. వాస్తవంగా ఈ సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఐఏబీ చైర్మన్‌గా వ్యవహారించే కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపించాలి.  అయితే ఏ ఒక్క తీర్మారం కూడా ప్రభుత్వానికి పంపించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో తుంగభద్రపై నిర్మిస్తామన్న గుండ్రేవుల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేసి రెండేళ్లు గడిచినా...నాలుగు సార్లు ఐఏబీలో తీర్మానం చేసినా అతీగతీ లేదు. ఇక వేదావతి, జోలదరాశి ఊసే ఎత్తడం లేదు.  కష్ణా జలాల్లో సీమ న్యాయం జరగాలంటే కష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో పెట్టాలని డిమాండ్‌ ఉన్నా నేతలు పట్టించుకోవం లేదు. వీటిపై సభ్యులు సమావేశంలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అన్నదాతలు కోరుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement