వెలుగులో బది‘లీలలు’ | transfers issues in velugu department | Sakshi
Sakshi News home page

వెలుగులో బది‘లీలలు’

May 18 2017 11:56 PM | Updated on Sep 5 2017 11:27 AM

వెలుగులో బది‘లీలలు’

వెలుగులో బది‘లీలలు’

అయినవాళ్లకు అందలం ఎక్కించారు. కాని వాళ్లకు ‘మండలం’ దాటించారు. ‘పనితీరు’ పేరుతో మాయాజాలం ప్రదర్శించారు.

– చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు
– కీలకంగా వ్యవహరించిన ఓ మంత్రి
– సీసీల బదిలీపై ‘పనితీరు’ ప్రభావం
– పెర్ఫార్మెన్స్‌ లేకున్నా ఏపీఎంలు అక్కడే
– కొన్ని ఖాళీలు ‘బ్లాక్‌’ చేశారన్న ఆరోపణ

అనంతపురం టౌన్‌ : అయినవాళ్లకు అందలం ఎక్కించారు. కాని వాళ్లకు ‘మండలం’ దాటించారు. ‘పనితీరు’ పేరుతో మాయాజాలం ప్రదర్శించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకూ తలొగ్గారు. ఓ మంత్రి చక్రం తిప్పడంతో ఖాళీలను ‘బ్లాక్‌’ చేసి సరికొత్త బది‘లీలలు’ ప్రదర్శించారు. ఇదీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)–వెలుగులో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌ తీరు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ఆరుగురు డీపీఎంలు, 20 మంది ఏపీఎంలు, 111 మంది సీసీలను బదిలీ చేసేందుకు చేపట్టిన ఈ కౌన్సెలింగ్‌ ‘రాజకీయ రంగు’ పులుముకుంది.

ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. కొన్ని చోట్ల అనర్హులకు అందలం ఎక్కించారు. సీసీ కేడర్‌లో గతంలో చేపట్టిన బదిలీల్లో సొంత మండలాలకు పంపారు. అయితే.. ఈసారి ఆ అవకాశం లేదని చెప్పడంతో కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉరవకొండకు చెందిన ఓ సీసీ.. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో చివరకు ఆయనకు అక్కడే పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కీలక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల నేపథ్యంలో అనంతపురం రూరల్, గోరంట్లతో పాటు ధర్మవరం, ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పోస్టులను బ్లాక్‌ చేశారన్న ఆరోణలున్నాయి. తమకు కావాల్సిన వారికి ఆయా స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పించడం కోసం ఇప్పటికే సిఫారసు లేఖలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈసారి బదిలీలను 2015–16  సంవత్సరంలో ఉద్యోగుల పనితీరు ఆధారంగా చేపట్టాలని ఉత్తర్వులు వచ్చాయి.

దీంతో అధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు.. నచ్చని వారికి తక్కువ మార్కులు వేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ‘మార్కుల’ మాయాజాలంతో నష్టపోయిన సీసీలు ఇదేమని అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఉద్యోగం ఉంటే చాలని, ఎదురుతిరిగితే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని కొందరు సీసీలు ‘సాక్షి’తో అన్నారు. సీసీలకు మార్కులు తక్కువగా వేశారని, అయితే వారిపైనున్న ఏపీఎంలకు మాత్రం ఎక్కువగా ఎలా వేస్తారని అంటున్నారు. పనితీరు సరిగా లేదని 10 మంది ఏపీఎంలను బదిలీల కోసం పిలిపించారు. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వాళ్లను బదిలీ చేయకుండా ప్రస్తుత స్థానాల్లోనే ఉంచేశారు. ఇది కూడా వివాదానికి తెరతీస్తోంది. సీసీల విషయంలోనూ  ఇలాగే వ్యవహరించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా కొంత మంది సీసీలు, ఏపీఎంలు, డీపీఎంల బదిలీల ప్రక్రియ మిగిలివుంది. వీరికి శనివారం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు.

కోర్టుకు వెళ్తాం : అశ్వర్థరెడ్డి, వెలుగు ఎల్‌1,ఎల్‌2 అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు
సీసీల విషయంలో అన్యాయం జరిగింది. పనితీరని చెప్పి పీడీ అన్యాయం చేశారు. కావాల్సిన వాళ్లకు కావాల్సిన మండలాలు ఇచ్చారు. ఇదేం పద్ధతి? ఈ విషయమై కోర్టుకు వెళ్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement