
‘మూల్యాంకనం’ ప్రశ్నార్థకం
నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో భాగంగా జరుగుతున్న సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనం ప్రశ్నార్థకం అవుతోంది.
– నేటి నుంచి మండల కేంద్రాల్లో 5 శాతం జవాబు పత్రాల మూల్యాంకనం
– ఎంపికకాని టీచర్లు
– సాధ్యాసాధ్యాలు గాలికి
– అయోమయంలో ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్ : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో భాగంగా జరుగుతున్న సమ్మేటివ్–1 పరీక్షల మూల్యాంకనం ప్రశ్నార్థకం అవుతోంది. 6–10 తరగతులకు సంగ్రహణాత్మక మూల్యంకనాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ, అన్ని తరగతుల్లోనూ 5 శాతం జవాబు పత్రాలను మండలస్థాయి కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక బందం ద్వారా సోమవారం నుంచి మూల్యాంకనం ప్రారంభించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
మండల స్థాయిలో జరిగే మూల్యాంకనానికి ఇప్పటిదాకా సబ్జెక్టు టీచర్లను ఎంపిక చేయలేదు. అసలు కమిటీల్లో ఉన్న సభ్యులకే చాలాచోట్ల సమాచారం లేదు. మరోవైపు ఈ నెల 22న తెలుగు పరీక్ష జరిగింది. చాలా స్కూళ్లలో పాఠశాల స్థాయి మూల్యాంకనం జరగనేలేదు. కొన్ని స్కూళ్లలో 6–10 తరగతుల విద్యార్థులు 1000 మంది దాకా ఉన్నారు. ఒక ప్రశ్నకు పలురకాల జవాబులు రాసింటారు. ఈ పరిస్థితుల్లో›ప్రతి ›జవాబు పూర్తిస్థాయిలో చదివితే తప్ప మార్కులు వేయలేని పరిస్థితి. ఇందుకు అధిక సమయం పడుతుంది. పైగా తెలుగు, సోషియల్ సబ్జెక్టుల్లో టీచర్ల కొరత అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూలు ప్రకారం మండల స్థాయిలో మూల్యాంకనం అనుమానమేనని ఉపాధ్యావర్గాలంటున్నాయి.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అనుమానాలు...
––––––––––––––––––––––––––––––––––––
– సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలు, దీర్ఘకాలిక సెలవు, మెటర్నటీ సెలవులో ఉన్న టీచర్ల పాఠశాలలో ఆయా సబ్జెక్టుల జవాబుపత్రాలు ఎవరు మూల్యాంకనం చేయాలి. సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో ఎలా చేయాలో అధికారులే చెప్పాలి?
– సీసీఈ విధానంలో జవాబుపత్రం దిద్దాలంటే రోజుకు సగటున 30 పేపర్లకంటే మించి దిద్దే అవకాశం లేదు. గడువులోగా ఇది సాధ్యమా?
– విద్యార్థులు అతి తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మండల కేంద్రాల్లో సాగే మూల్యాంకనానికి 5 శాతం ఎలా తీయాలి?
– 30 నుంచి దసరా సెలవులు ప్రకటించారు సెలవు దినాల్లో పని చే యించుకుంటే ప్రత్యేక భతి ఇస్తారా? దీనిని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయా?
– ఒక టీచరు జవాబుపత్రం దిద్ది మార్కులు వేసిన తర్వాత మరో టీచరుతో అదే పేపరు దిద్దించాల్సిన అవసరం ఏముంది?
––––––––––––––––––––
డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే...
షెడ్యూలు ప్రకారం సోమవారం నుంచి మండల కేంద్రాల్లో 5 శాతం జవాబుపత్రాలు మూల్యాంకనం జరుగుతుంది. ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా కమిటీలను ఆదేశించాం. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.