Sakshi News home page

ఔషధ రాజధానిగా తెలంగాణ

Published Sat, Aug 1 2015 2:37 AM

ఔషధ రాజధానిగా తెలంగాణ - Sakshi

ఐపీఎస్‌ఎఫ్ వరల్డ్ కాంగ్రెస్‌లో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగానికి రాజధానిగా తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐపీఎస్‌ఎఫ్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్తంగా శుక్రవారం హోటల్ మారియట్‌లో 61వ వరల్డ్ కాంగ్రెస్-2015ను నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశమంతటా తయారవుతున్న బల్క్ డ్రగ్స్‌లో తెలంగాణ నుంచే 40 శాతం ఉత్పత్తి జరుగుతోందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్‌లలో మూడోవంతు టీకాలు హైదరాబాద్‌లో ఉత్పత్తి చేసినవేనన్నారు. ఇండియాతో పాటు అన్ని దేశాలు పరిశోధనల కోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్నాయని,  అయితే సమాజానికి మేలు చేయని పరిశోధనల వలన ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువైన ఔషధాలను అందించాల్సిన కర్తవ్యం ఔషధ రంగ నిపుణులపై ఉందన్నారు. హైదరాబాద్‌లో లైఫ్‌సెన్సైస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చిందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధ రంగ పరిశోధనల ఫలితాలను మేళవించి సమాజానికి మేలు జరిగే విధంగా కొత్త ఆవిష్కరణలు తెచ్చేందుకు ఈ సదస్సు దోహదపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సురేశ్ మాట్లాడుతూ.. భారతీయ ఔషధ మండలిలో 10 లక్షల మంది ఔషధ రంగ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ప్రకటించారు. ఏటా లక్షమంది ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఉపాధ్యక్షుడు నర్సింహారె డ్డి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రావు వడ్లమూడి, ఉపాధ్యక్షుడు టీవీ నారాయణ, ఐపీఎస్‌ఎఫ్ అధ్యక్షురాలు పరాంక్, వరల్డ్ కాంగ్రెస్-2015 చైర్‌పర్సన్ నేహా దెంబ్లా, ప్రోగ్రామ్ కన్వీనర్ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, 55 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement