నాకేంటో నాకే తెలియదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:‘‘పార్టీలో నా కేందనేది నాకే తెలియదు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే ముందు నన్ను కూర్చోబెట్టి మాట్లాడి కలిసి పనిచేయాలని చెప్పివుంటే నాకు గౌరవంగా ఉండేది. పార్టీలో నా పరిస్థితే ఇలా ఉంటే, మీ గుర్తింపు విషయంలో నేనేం హామీ ఇవ్వగలను’’ ఆత్మకూరు టీడీపీ నాయకుడు గూటూరు కన్నబాబు తన మద్దతు దారుల ముందు వ్యక్తం చేసిన ఆవేదన, ఆందోళన, ఆక్రోషం ఇది.
-
అవసరాలకు పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారు
-
రామనారాయణరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు
-
లోకేష్‌తో మాట్లాడాకే ఉండాలా? పోవాలా? నిర్ణయం
-
మద్దతుదారుల ఆత్మీయ సమావేశంలో గూటూరు కన్నబాబు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:‘‘పార్టీలో నా కేందనేది నాకే తెలియదు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే ముందు నన్ను కూర్చోబెట్టి మాట్లాడి కలిసి పనిచేయాలని చెప్పివుంటే నాకు గౌరవంగా ఉండేది. పార్టీలో నా పరిస్థితే ఇలా ఉంటే, మీ గుర్తింపు విషయంలో నేనేం హామీ ఇవ్వగలను’’ ఆత్మకూరు టీడీపీ నాయకుడు గూటూరు కన్నబాబు తన మద్దతు దారుల ముందు వ్యక్తం చేసిన ఆవేదన, ఆందోళన, ఆక్రోషం ఇది. రామనారాయణరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా నియమించిన నేపథ్యంలో తామేం చేయాలనే అంశం గురించి చర్చించడానికి ఆత్మకూరు మండలం కరటంపాడులోని తన ఇంట్లో కన్నబాబు సోమవారం ఆత్మీయుల సమావేశం జరిపారు. మాజీ మంత్రి రామనారాయణరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చిన రోజు కన్నబాబుతో పాటు ఆయన ముఖ్య అనుచరులంతా సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. మరుసటి రోజు కన్నబాబు ముఖ్యులతో మాట్లాడుకుని కొన్ని రోజులు వేచి చూసి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని తీర్మానించుకున్నారు. రేపో, మాపో రామనారాయణరెడ్డి నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారనీ, తామేం చేయాలని మద్దతుదారుల నుంచి కన్నబాబు మీద ఒత్తిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ ముఖ్యులు, ముఖ్య కార్యకర్తలను సమావేశానికి పిలిచారు. మీడియాను అనుమతించకుండా జరిపిన సమావేశంలో తొలి నుంచి టీడీపీలో ఉన్న కార్యకర్తలు పార్టీ హై కమాండ్ విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇంతకీ చంద్రబాబు నాయుడు మీకేం చెప్పారు’’అని ఆయ న మద్దతుదారులు ప్రశ్నించారు. తనకైతే ఎలాంటి హామీ ఇవ్వలేదనీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ఈరోజు (సోమవారం) ఉదయమే పిలిస్తే వెళ్లాననీ, ఆయనతో గంట సేపు మాట్లాడినా నా పరిస్థితి ఏమిటో స్పష్టంగా చెప్పలేక పోయారని కన్నబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికంటే మధ్యలో వచ్చిన వారికే గుర్తింపు, పదవులు ఇస్తున్నారనీ చంద్రబాబు కానీ, జిల్లా ముఖ్యులు కానీ తనకేం చేయబోతున్నారనే విషయం చెప్పలేదన్నారు. రామనారాయణరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదనీ, శనివారం రామనారాయణరెడ్డి తనకు ఫోన్ చేసినప్పుడు ఇదే విషయం గట్టిగా చెప్పానని కన్నబాబు కార్యకర్తలకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అవమానాలు ఎదుర్కొంటూ ఈ పార్టీలోనే ఎందుకు ఉండాలి? వైఎస్సార్ సీపీలో చేరదాం పదండి. అని కొందరు నాయకులు తమ అభిప్రాయం వెల్లడించారు. తొలి నుంచి పార్టీనే నమ్ముకున్నందువల్ల తాను తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేననీ, ఇప్పటికిప్పుడు టీడీపీలో తనకు ఏదో మేలు జరుగుతుందనే నమ్మకం కూడా లేదని కన్నబాబు వివరించారు. నాలుగైదు రోజు ల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబును కలిసి ఆయనతో అన్ని విషయాలు చర్చించాకే ఒక నిర్ణయానికి వద్దామని కన్నబాబు తన మద్దతుదారులకు సూచించారు. కన్నబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతోనే ఉం డాలని సమావేశానికి హాజరైన వారం తా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఆనంతో కలిసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్న కన్నబాబు అదే మాట మీద ఉంటారా? లేక చినబాబో, పెద్దబాబో పిలిచి బుజ్జగిస్తే మనసు మా ర్చుకుంటారా? అనేది వేచి చూడాల్సి వుంది. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డికి నియోజకవర్గంలో అధికారికంగా అడుగుపెట్టకముందే అసంతృప్తుల సెగ ప్రారంభమైంది.