విద్యార్థులపై నారాయణ కళాశాల యాజమాన్యం దాడి ఘటన విచారణ పక్కదారి పట్టింది.
పక్కదారి పట్టిన విద్యార్థులపై దాడి ఘటన
ఆర్‌ఐఓ విచారణలో వాస్తవాలు కనుమరుగు
అల్లరి చేశారనే నెపంతోనే కొట్టినట్లు చెప్పిన కళాశాల యాజమాన్యం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులపై నారాయణ కళాశాల యాజమాన్యం దాడి ఘటన విచారణ పక్కదారి పట్టింది. ఘటనపై ఆర్‌ఐఓ సురేష్‌బాబు శుక్రవారం కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో విడివిడిగా మాట్లాడారు. యాజమాన్యం ఒత్తిళ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు, బాధిత విద్యార్థులు తలొగ్గడంతో వాస్తవాలు కనుమరుగయ్యాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక టీవీటవర్ సమీపంలో ఉన్న నారాయణ కళాశాలలో మౌలిక వసతులపై ప్రశ్నించిన పాపానికి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సతీష్, జీవన్, అరుణ్‌ల ఒంటిపై వాతలు పడేలా చావబాదారు. హాస్టల్‌లో వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయని, మెస్‌లో అన్నం తినలేకున్నామని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, బాత్రూంలు లేవని, మరుగుదొడ్లలో స్నానం చేయాల్సిన దుస్థితి అని ముందురోజు స్వయంగా విద్యార్థులు మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
చివరకు పోలీసులకు వీటిపైనే ఫిర్యాదు చేశారు. అయితే రోజు గడిచేలోగా ఏమి జరిగిందో ఏమో కాని మొత్తం సీను రివర్సయింది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులపై యాజమాన్యం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు తెలిసింది. తమ పిల్లలకే ఇబ్బంది కల్గుతుందనే భయంతో తల్లిదండ్రులు రాజీకొచ్చినట్లు సమాచారం. దీంతో విచారణాధికారి ఎదుట వాస్తవాలు కప్పి పుచ్చుతూ ఘటన జరిగిన రోజు రాత్రి కరెంటు పోయిన సమయంలో అల్లరి చేస్తుండడంతో ప్రిన్సిపల్, ఇన్‌చార్జ్‌ల వచ్చి మందలించే క్రమంలో కొట్టారని వివరించారు. యాజమాన్యం కూడా ఇదే విధమైన వివరణ ఇచ్చింది. ఈ నివేదికను ఇంటర్ విద్య కమిషనర్‌కు పంపనున్నట్లు ఆర్‌ఐఓ తెలిపారు.