పుష్కరాలకు సర్వం సిద్ధం
కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలో 72 ఘాట్లను సిద్ధంగా ఉంచినట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. మంగళవారం అనుపు, కృష్ణవేణి, దేశాలమ్మ పుష్కర ఘాట్‌లను ఆయన పరిశీలించారు.
మేజర్ ఘాట్లు 14
14 పుష్కర నగర్‌ల ఏర్పాటు
భక్తుల భద్రతకు ప్రాధాన్యం
కలెక్టర్ కాంతిలాల్ దండే వెల్లడి
విజయపురిసౌత్ : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలో 72 ఘాట్లను సిద్ధంగా ఉంచినట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. మంగళవారం అనుపు, కృష్ణవేణి, దేశాలమ్మ పుష్కర ఘాట్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 14 మేజరు ఘాట్లు ఉన్నట్టు చెప్పారు. వాటిలో పల్నాడు ప్రాంతంలోని కృష్ణవేణి, సత్రశాల, దైద, పొందుగల ఘాట్లు ఉన్నాయన్నారు. మొత్తం 14 పుష్కర్‌నగర్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలో రోజుకు 9 నుంచి 10 లక్షల మంది పుష్కర భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో రావచ్చన్నారు. అన్ని ఘాట్ల వద్ద భక్తుల భద్రతే ప్రధానంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పుష్కర భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు మరుగుదొడ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీవో మురళి, తహసీల్దార్‌లు వెంకటేశ్వర్లు, ఏసుబాబు తదితరులు ఉన్నారు.