15న ‘పురుషోత్తపట్నం’ నీరు విడుదల

15న ‘పురుషోత్తపట్నం’ నీరు విడుదల

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు, గండికోట వద్ద నీటి డెలివరీ ఫాయింట్‌, పురుషోత్తపట్నం నుంచి సీతానగరం, నాగంపల్లి మీదుగా అచ్చయ్యపాలెం, గండికోట మార్గాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

పైలాన్‌ ఏర్పాటుపై అసహన వ్యక్తం

పైలాన్‌ ఏర్పాటుపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి కాస్త దూరంలో విద్యుత్‌ స్తంభాల వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను తక్షణమే తొలగించి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమోట్‌ ద్వారా స్విచ్‌ ఆన్‌ చేసి మొదటి దశ నీరు విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం సీతానగరం నుంచి పథకం వద్దకు కాన్వాయ్‌ ద్వారా చేరుకుని నీరు విడుదల చేస్తారని చెప్పారు. అనంతరం సీతానగరం చేరుకుని గండికోట వద్ద పోలవరం ఎడమ కాలువలో పథకం నీరు డెలివరీ పాయింట్‌ను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడి నుంచి జగ్గంపేటలో నిర్వహించే సభకు వెళ్తారని చెప్పారు. కలెక్టర్‌ వెంట రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ ఎస్‌.పి.బి.రాజకుమారి, సబ్‌ కలెక్టర్‌ వి.విజయరామరాజు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆనంద్, జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎస్‌.సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సి.ఎస్‌.ఎన్‌.మూర్తి, విద్యుత్‌ శాఖ డీఈ రాజబాబు, ఏడీఈ కె.రత్నాలరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ టి.రమేష్‌ కిషోర్, అడిషనల్‌ ఎస్పీ ఆర్‌.గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, తహసీల్దార్‌ కె.చంద్రశేఖరరావు, టి.గోపాలకృష్ణ, కె.పోశయ్య, దేవి, ఎంపీడీఓ డి.శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top