ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నా..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కృష్ణమ్మను వేడుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా తెలిపారు.
– గుడులను కూల్చి మరుగుదొడ్లను కట్టారని రోజా విమర్శ
– లింగాలగట్టులో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కృష్ణమ్మను వేడుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉందని అభిప్రాయపడ్డారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో మంగళవారం పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ నది ఎంతో పవిత్రమైనదని.. కోరుకున్నది ప్రసాదిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. అందుకే కృష్ణా నదిలో స్నానమాచరించి ప్రత్యేక హోదా కోరుకున్నట్లు తెలిపారు. విజయవాడలో దేవుళ్ల గుడులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో మరుగుదొడ్లను నిర్మించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఆధ్యాత్మికత పట్ల ఉన్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుందని విమర్శించారు. ఆమెతో పాటు భర్త సెల్వమణి, కూతురు, కుమారుడు ఉన్నారు.