
ఖాకీ నిఘాలో కాపులు
రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పిలుపినివ్వడం ....
►కాపు నేతలపై ఆంక్షల కత్తి
►వందలాది నేతలకు నోటీసులు.. కౌన్సెలింగ్
►కాలు కదపనీయకుండా అడుగడుగునా అడ్డంకులు
►జిల్లాలో 11 చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు
►59 బైండోవర్ కేసులు
►ముద్రగడ పాదయాత్రను విఫలం చేసేందుకు యత్నం
ఒంగోలు క్రైం : రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పిలుపినివ్వడం సర్కారుకు దడ పుట్టిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న పోలీసులు జిల్లాలోని కాపులు, కాపు నాయకుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రెండు రోజులుగా జిల్లా పోలీస్ యంత్రాంగం కాపు ముఖ్య నేతలకు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా ఏ ఒక్క కాపు నాయకుడు వెళ్లకుండా నిలువరించేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ఏ ఒక్కరూ బయటకు పోకుండా గట్టి నిఘా పెట్టి వారి కదలికలపై దృష్టి సారించారు.
2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడూళ్ల పూర్తయినా ఆ హామీ అమలు చేయకపోవటంతో ‘చావో రేవో చలో అమరావతి’ పాదయాత్రకు పిలుపునిచ్చారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి పాదయాత్రకు పూనుకున్నారు. ఆ పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకు పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పాదయాత్రను విఫలం చేయటానికి ఖాకీని రంగంలోకి దించింది. జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం ఆయన కనుసన్నల్లో కాపు నాయకులను, కార్యకర్తలను కట్టడి చేయటానికి చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. తొలుత నోటీసులు జారీ చేసిన పోలీసులు కాపులకు కౌన్సెలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఊరు వదిలి వెళ్లకూడదని, ముద్రగడ పాదయాత్రకు ఏ ఒక్కరూ మద్దతుగా బయలుదేరి వెళ్లవద్దని హుకుం జారీ చేశారు.
11 చెక్ పోస్ట్‌లు...
ముద్రగడ పాదయాత్రకు వెళ్లే వారిని అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాగం జిల్లా వ్యాప్తంగా 11 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. విజయవాడ–చెన్నైం 16వ నంబర్ జాతీయ రహదారిపై సింగరాయకొండ మండలం కనుమళ్ళ వద్ద ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్‌సెంటర్ వద్ద, మార్టురులోని రాజుపాలెం వద్ద మరో చెక్ పోస్ట్, పర్చూరు వై జంక్షన్‌లో, చీరాల రోట్‌లో ఈపూరుపాలెం వద్ద, అద్దంకి భవాని సెంటర్‌లో, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్‌లో, ముండ్లమూరు పోలీస్ స్టేషన్ ఎదురు, పెద్దారవీడు కుంట జంక్షన్, బేస్తవారిపేట జంక్షన్‌లో, త్రిపురాంతకం పెట్రోల్‌బంక్ వద్ద చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి కాపులను జిల్లా దాటి వెళ్లనీయకుండా కట్టడి చేసేందుకు సన్నాహాలు చేశారు.
1,023 మంది కాపులకు కౌన్సెలింగ్....
పాదయాత్రకు వెళితే ఊరుకునేది లేదని కాపు నాయకులకు,కార్యకర్తలకు 1,023మందికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 453 మందికి నోటీసులు జారీ చేశారు. 59 మంది ముఖ్య నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 373 మందిని సంబంధిత తహశీల్దార్‌ల ముందు హాజరు పరిచి వారి వద్ద నుంచి రూ.50 నుంచి రూ.లక్ష వరకు పూచి కత్తు తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్‌లలో 98 ఏసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. 344 వాహన చోదకులకు, వాహన యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు.