
విలేకరులతో మాట్లాడుతున్న పబ్లిక్‌ప్రాసిక్యూటర్ నాగమల్లేశ్వరరావు, డీఎస్పీలు: విలేకరులతో మాట్లాడుతున్న పబ్లిక్‌ప్రాస
లక్ష్మీపేట ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులైన ఆరుగురు నిందితులు ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసుకున్న పిటీషన్‌ను లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం డిస్మిస్ చేసిందని బాధితుల పక్ష న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.నాగమల్వేశ్వరరావు వెల్లడించారు. లక్ష్మీపేటలో దళితుల మారణకాండకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ శుక్రవారం జరిగింది.
వంగర : లక్ష్మీపేట ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులైన ఆరుగురు నిందితులు ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసుకున్న పిటీషన్‌ను లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం డిస్మిస్ చేసిందని బాధితుల పక్ష న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.నాగమల్వేశ్వరరావు వెల్లడించారు. లక్ష్మీపేటలో దళితుల మారణకాండకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ శుక్రవారం జరిగింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి వి.గోపాలకృష్ణ కేసును విచారించారు. ఈ సందర్భంగా కోర్టు బయట పీపీ విలేకరులతో కాసేపు మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులైన ఆవు శ్రీనివాసరావు, రౌతు వాసునాయుడు, వాన నారాయణరావు, గంట్యాడ బలరాం, రౌతు బాలకృష్ణ, శాసపు సింహాచల వెంకట సత్యనారాయణనాయుడు సంఘటన సమయంలో తమ విధుల్లో ఉన్నారని నిందితుల పక్షాన న్యాయవాది వాన కృష్ణచంద్ పిటీషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి వీరికి ఎటువంటి సంబంధం లేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తమ విధులు నిర్వర్తించి అపీల్ చేశామని, వారంతా ఘటనలో పాల్గొన్నారని దళిత బాధితుల పక్షాన వాదించామని తెలిపారు. దీనిపై హైకోర్టు నియామవళి ప్రకారం జడ్జి గోపాలకృష్ణ మూడు వాయిదాల్లో సుదీర్ఘంగా విచారించి నిందితుల పిటీషన్‌ను డిస్మిస్ చేశారని వెల్లడించారు. వారిపై నేర అభియోగాలను మోపుతూ కోర్టు తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో విశాఖ సీఐడీ విభాగం డీఎస్పీ ఎం.మోహనరావు, పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, ఎస్‌ఐ వై.మధుసూదనరావు పాల్గొన్నారు.
28కి కేసు వాయిదా..
లక్ష్మీపేట దళితుల మారణకాండ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేశారు. శుక్రవారం జరిగిన విచారణకు మొత్తం 79 మంది నిందితులకు 68 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరయ్యారు. ఒకరు మృతి చెందారు. విచారణ అనంతరం జడ్జి వి.గోపాలకృష్ణ కేసును వాయిదా వేసినట్లు వెల్లడించారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, విశాఖ సీఐడీ విభాగం డీఎస్పీ ఎం.మోహనరావులు కోర్టును పరిశీలించారు. సీఐలు, ఎస్‌ఐలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.