లక్ష్మీపేట ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం | it is govt negligence | Sakshi
Sakshi News home page

లక్ష్మీపేట ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం

Aug 30 2016 11:12 PM | Updated on Aug 13 2018 8:12 PM

సభలో మాట్లాడుతున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి పి.మధు - Sakshi

సభలో మాట్లాడుతున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి పి.మధు

లక్ష్మీపేట మారణకాండపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంగర : లక్ష్మీపేట మారణకాండపై  ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.  లక్ష్మీపేట గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. 2012 జూన్‌ 12న జరిగిన దళితుల మారణకాండ ఘటనలో మృతి చెందిన మృతుల సమాధుల వద్ద నివాళులర్పించారు. మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో మిగులు భూములను పరిశీలించారు. వీధుల్లో పర్యటించి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం కేవీపీఎస్, లక్ష్మీపేట దళిత పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఘటనలో దళితులను అతి కిరాతకంగా దాడి చేసి చంపారని, అటువంటి దోషులను కఠినంగా శిక్షించాల్సి ఉండగా కోర్టు కేసు విచారణలో తాత్సారం జరుగుతోందని తెలిపారు. ప్రత్యేక కోర్టుకు ఏక కాల న్యాయమూర్తిని నియమించకపోవడంతో కేసు విచారణ ఇష్టారాజ్యంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని, గ్రామంలో పోలీసులు బీసీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, మడ్డువలస ప్రాజెక్టులో మిగులు భూములు దళితులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.
 
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గ్రామంలో పర్యటించినా ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. మూడు నెలల్లో దళితుల సమస్యలు పరిష్కరించకపోతే శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమ సంఘాలను సమీకరించి ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబునాయుడును కలిసి సమస్యను వివరిస్తామన్నారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ప్రాజెక్టులో మిగులు భూమిపై నాగళితో దుక్కి చేస్తామని, ఆ తేదీ ఖరారు చేస్తామన్నారు. అనంతరం పలువురు నాయకులు దళితులకు జరిగిన అన్యాయంపై తూర్పారబట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ గొంతెత్తారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి డి.గణేష్, చిత్తిరి గంగులు, డర్రు రాంబాబు, కె.నాగమణి, సీపీఎం, కేవీపీఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement