
కానిస్టేబుల్ కాబోయి.. మృత్యుఒడికి..
పోలీస్‌శాఖలో కొలువు సాధించాలనదే ఆ యువకుడి లక్ష్యం.. అందుకు అనుగుణంగా కఠోరంగా శ్రమిస్తున్నాడు..
కొలువు సాధనలో యువకుడి మృత్యువాత
శ్వాసప్రక్రియ వ్యాయామం చేస్తుండగా దుర్ఘటన
గణపవరంలో విషాదం
గణపవరం(మునగాల) ; పోలీస్‌శాఖలో కొలువు సాధించాలనదే ఆ యువకుడి లక్ష్యం.. అందుకు అనుగుణంగా కఠోరంగా శ్రమిస్తున్నాడు.. అందులో భాగంగానే శ్వాసప్రక్రియ వ్యా యామం చేస్తూ మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాదకర ఘటన మునగాల మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. గణపవరం గ్రామానికి చెందిన సారెడ్డి నారాయణరెడ్డి, బుచ్చమ్మ దంపతుల ఏకైక కుమారుడు సారెడ్డి పాపిరెడ్డి(26) డిగ్రీ పూర్తి చేశాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చూసూకుంటూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గతంలో పోలీస్‌శాఖలో ఉద్యోగం సం పాదించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ ఏడాది కానిస్టేబుల్ పోస్టులకు జరిగిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడైన పాపిరెడ్డి ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి ప్రతి రోజుఉదయం దేహదారుఢ్య పరీక్షలకు సాధన చేస్తున్నాడు.
గంట వ్యవధిలోనే..
ఎప్పటిలాగానే పాపిరెడ్డి తన స్నేహితులతో కలిసి పక్క గ్రామమైన పెనపహాడ్ మండలం చీదెళ్ల శివారులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వ్యాయామం కోసం ఉదయం వెళ్లాడు. మిగతా స్నేహితులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పాపిరెడ్డి ఛాతీ పెరిగేందుకు శ్వాసప్రక్రియ వ్యాయామం ప్రారంభించాడు. శ్వాసను గట్టిగా పీల్చి తన స్నేహితుడిని కొలతవేయమని కోరాడు. ఈ లోగా ఒక్కసారిగా పాపిరెడ్డి వెనుకకు పడిపోయాడు. రొప్పుతూ ఉండడంతో మిగతా స్నేహితులు పాపిరెడ్డి గుండె నిమురుతూ ఉండగానే క్షణాల్లో నోటినుంచి రక్తం పడుతుండడంతో ఆందోళన చెందారు. వెంటనే బైక్‌పై పాపిరెడ్డిని సమీపంలో ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. అప్పటివరకు అందరినీ నవ్వుతూ పలకరించిన పాపిరెడ్డి గంట వ్యవధిలోనే మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.