అయోమయం | not complete of teachers transfer | Sakshi
Sakshi News home page

అయోమయం

Jun 9 2017 11:03 PM | Updated on Sep 5 2017 1:12 PM

అయోమయం

అయోమయం

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ), ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంధకారంగా మారింది.

- కొలిక్కిరాని బదిలీలు, రేషనలైజేషన్‌
– జుట్టు పీక్కుంటున్న అధికారులు
– ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు


అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ), ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంధకారంగా మారింది. మార్గదర్శకాలపై జీఓలు, టీచర్ల బదిలీపై షెడ్యూలు ఇచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. షెడ్యూలు ప్రకారం రేషనలైజేషన్‌ ((హేతుబద్ధీకరణ) ప్రక్రియ ఈ నెల 8 నాటికి పూర్తి కావాల్సి ఉంది. శుక్రవారం నుంచి 12 వరకు అన్ని కేడర్లు  టీచర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే రేషనలైజేషన్‌ ప్రక్రియ కొలిక్కి రాలేదు. మరోవైపు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ పని చేయడం లేదు.

దరఖాస్తు చేసుకునేందుకు ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేషనలైజేషన్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వివిధ అంశాలు ప్రతిబంధకంగా మారాయి. హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయితే పలు పాఠశాలలు మూతపడనున్నాయి. ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు బదలాయించనున్నారు.  ముఖ్యంగా యూపీ స్కూళ్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదు. చాలా స్కూళ్ల నుంచి బయాలజీ టీచర్లు బయటకు రానున్నారు. వారిని  ఎలా సర్దుతారనే దానిపై సమాచారం లేదు. హేతుబద్ధీకరణ పూర్తయితేనే టీచర్ల బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది.

తలనొప్పిగా పాయింట్ల కేటాయింపు
మరోవైపు టీచర్లకు వివిధ ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయింపు  తలనొప్పిగా మారింది. సంబంధిత ఉపాధ్యాయులు ఫలానా పాయింట్లు తనకు వర్తిస్తాయని ఎంఈఓలకు వినతులిచ్చారు. దీనిపై రికార్డులు పరిశీలించేందుకు స్కూళ్లు పునఃప్రారంభం కాలేదు. ఇదే అదనుగా అక్రమాలకు చోటు చేసుకునే వీలుంది. మండల విద్యాశాఖ అధికారులు, డెప్యూటీ డీఈఓలు ధ్రువీకరించే పాయింట్లపై కొందరు వ్యాపారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

– పదో తరగతిలో 90–99.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 5 పాయింట్లు, 80–89.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి ఉంటే 3 పాయింట్లు ఇస్తారు. ఇది కేవలం ఉన్నత పాఠశాలల టీచర్లకే మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే పదో తరగతి ఆ స్కూళ్లలో మాత్రమే ఉంటుంది. మరి ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్ల పరిస్థితి ఏమిటి? తాము స్కూల్‌ అసిస్టెంట్లు కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

– మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి 90 శాతం రోజుల్లో  గడువులోగా ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ వివరాలు పంపింటే 2 పాయింట్లు. 80–89.99 శాతం రోజుల్లో పంపింటే 1 పాయింటు కేటాయిస్తారు. వాస్తవానికి ఇండెంట్‌ దాదాపు ప్రతి మండలంలోనూ ఎమ్మార్సీ సిబ్బందే పంపుతున్నారు. మరి ఏస్కూల్‌లో ఏ టీచరుకు పాయింట్లు కేటాయిస్తారన్నది అంతుచిక్కడం లేదు.
– స్పౌజ్‌ పాయింట్లు వినియోగించుకునేందుకు 8 ఏళ్లా లేక 8 ఏళ్లు పూర్తి కావాలా? దీనిపై స్పష్టత లేదు.
– పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ పోస్టుల్లో ఉన్న పండిట్లు, పీఈటీలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో లేదు.

స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ
రేషనలైజేషన్‌ ప్రక్రియ ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం నుంచే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా...వెబ్‌సైట్‌ పని చేయడం లేదు. వివిధ పాయింట్లపై స్పష్టత కోసం ప్రభుత్వానికి రాశాం.
-లక్ష్మీనారాయణ, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement