‘దేవా’(దుల) ఇదేమిటి?

‘దేవా’(దుల) ఇదేమిటి?

  • పంటలు ఎండినంక నీరు ఇస్తారా?

  • నీళ్లు ఉన్నా విడుదల చేయని వైనం

  • ఆందోళనకు సిద్ధమవుతున్న రెండు మండలాల రైతులు

  • భీమదేవరపల్లి:  అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది.  ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరున్నప్పటికీ దేవాదుల ఉత్తర కాలువ ద్వారా పంట పొలాలకు నీరందించేందుకు అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో, మెట్ట ప్రాంత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత 15 రోజుల నుంచి వరుణుడు మోహం చాటేయడంతో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. పంటలకు నీరు అందించాల్సిన అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. 

     

    గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ అయ్యాక అందులో నుంచి దేవాదుల ఉత్తర కాలువ ద్వారా  వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవునూర్, సోమదేవరపల్లి గ్రామాల్లోని 2వేల ఎకరాలు హుస్నాబాద్, హుజురాబాద్‌ నియోజకవర్గాల పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, ముల్కనూర్, కొప్పుర్, మాణిక్యాపూర్, హుజురాబాద్‌ మండలం కాట్రపల్లి, ఇప్పల్‌నర్సింగపూర్‌ ఎల్కతుర్తి మండలం దామెర, జగన్నాధపూర్, జీల్గుల, చింతలపల్లి, గోపాలపూర్, పెంచికల్‌పేట గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాగా ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోగా గత 15 రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పంటలు ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బావులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. దాంతో రైతులు పంటలకు నీరు అందించడం గగనంగా మారింది. 

     

    కాలువల్లో చెట్లు

    కాగా దేవాదుల ఉత్తర కాలువ అనేక చోట్ల గండ్లు పడడంతో ఇసుక, మట్టి కొట్టుక వచ్చి కాలువల్లో పేరుకుపోయాయి. ఇక అనేక చోట్ల కాలువల్లో చెట్లు పెరిగాయి. దీంతో నీరు విడుదల చేసిన పక్షంలో నీరు చాల మేరకు వధా అయ్యే పరిస్థితులున్నాయి. కాలువల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక దేవాదుల కాలువ మూలంగా పంటలకు నీరు అందే విషయం దేవుడెరుగు వర్షం నీరు వధాగా పోతుంది.  ఇనుపరాతి గుట్ట నుంచి వచ్చే వర్షం నీరు అప్పాయి, మౌత కుంటలతో పాటుగా ఊర చెరువు, కొత్త చెరువుల్లోకి వరద నీరు వచ్చేవి. తద్వారా ఆయా కుంటలు, చెరువుల పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరు అందేది. కాని ఉత్తర కాలువ బ్రిడ్జిలు సక్రమంగా నిర్మించకపోవడంతో వరద నీరు దేవాదుల కాలువలోకి వృధాగా పోతుంది. కాగా ఇటీవల దేవాదుల డీఈఈ రాంమోహన్‌ కాలువలను పరిశీలించి వెళ్లినప్పటికీ ఏలాంటి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. S

     

    ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే విడుదల చేస్తాం

     – రాంమోహన్‌ డీఈఈ దేవాదుల

    ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఉత్తర కాలువ ద్వారా సాగు నీరు అందిస్తాం. దేవాదుల కాలువ కాంట్రాక్టర్‌ కేతిరి సుదర్శన్‌రెడ్డి మృతి చెందడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతుంది. ఈ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తాం. 

     

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top