గోదావరి వేగం ఆగిపోయిందా? | nannaiah describing godavari | Sakshi
Sakshi News home page

గోదావరి వేగం ఆగిపోయిందా?

Jul 19 2015 12:00 PM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి వేగం ఆగిపోయిందా? - Sakshi

గోదావరి వేగం ఆగిపోయిందా?

అన్ని ప్రాంతాల తెలుగు వారి చరిత్రలో ప్రధాన ఘట్టాలను తీసుకుని మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ‘ఆంధ్ర పురాణం’ పద్య చరిత్ర కావ్యం రాశారు.

 అన్ని ప్రాంతాల తెలుగు వారి చరిత్రలో ప్రధాన ఘట్టాలను తీసుకుని మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ‘ఆంధ్ర పురాణం’ పద్య చరిత్ర కావ్యం రాశారు. ఆచార్య సి.నారాయణ రెడ్డి ‘కంకాళముల వంటి చారిత్రకాంశములకు కమనీయ రూపకల్పన ఆంధ్ర పురాణం’ అని ఒకే ఒక్క వాక్యంలో విశ్లేషించారు. నవ పర్వాల ఈ కావ్యంలో చాళుక్య పర్వం ఓ రసవత్తర ఘట్టం. శ్రవ్య కావ్యాన్ని దృశ్య కావ్యంగా చూపించారు. ఆ రోజు మేలిరోజు నన్నయ్య రాజరాజనరేంద్రుని కోరికను అనుసరించి మహాభారత అనువాదానికి శ్రీకారం చుట్టేరోజు.


 తెల్లవారుజామున ఆరుబయట పడుకుంటే ఒక గాలి చల్లగా సుతారంగా మన మేనుల్ని తాకి నిద్రకు హాయిగొలుపుతుంది. దీన్ని ‘సౌఖశాయనికత’ అంటారు. అలాంటి వేళ నన్నయ్య లేచారు. కాలకృత్యాలు తీర్చుకుని గోదారి ఒడ్డుకు వెళ్లారు. గౌతమిలో వార్చుకున్నారు. మంత్రపాఠాలు అవీ చదువకున్నారు. గోదావరిలో అణువణువూ శాంతతత్వానికి ఆధారంట. అలాంటి గోదావరి మేలితాకులు పలకరిస్తుండగా నన్నయ్య ఇంటికి వెళ్లారు. శాస్త్రీయంగా రచన ప్రారంభించేందుకు గంటం ఎత్తాడు. పంచమ శ్రుతికృతి క్రియకు ఓం కృతి చుట్టాడు.
 

ఈ సందర్భ రచనలో మధునాపంతుల నన్నయ్య రాజరాజుల కాలాన్ని కళ్లకు కట్టించేలా రాశారు. వేలూరి శివరామశాస్త్రి గారే ‘మధునాపంతులవారూ మీ దగ్గరేమైనా కవిత్వ ఇంద్రజాలం వుందా? ఏ పసరునైనా కలంలో ఇంకించి రాస్తున్నారా? ఆ కాలంలోకి మీరు మమ్మల్ని తీసుకుపోతున్నారు’ అనే భావంతో పద్య ప్రశంస చేశారంటే మాటలా? కావు రస గుళికలు.
 
 ‘ఆగినదల్ల నన్నయ మహారుషి గంటము కాదు, సాధువీ
 చీగతి చాతురీ మధురుచిప్రచురోత్తమ గౌతమీ ధునీ
 వేగమె ఆగిపోయెననిపించి రసజ్ఞులడెందముల్ పిపా
 సాగళితంబులై పరవశత్వమునందె నమందవేదనన్’

 ఆగింది నన్నయ్య గారి గంటం కాదు. మంచి అలల బాటల తీయని రుచులు ప్రకటించే ఆ గోదావరి నదీ వేగమే ఆగిపోయెననిపించింది. రసజ్ఞుల హృదయాలు అధిక వేదనకు గురయ్యాయి.
 -సన్నిధానం నరసింహ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement