ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుతీరుతున్నా నగదు అందడం లేదు. రిజర్వ్‌బ్యాంక్ నుంచి నగదు రాకపోవడంతో బ్యాంకులు నో క్యాష్ బోర్టులు పెడుతున్నాయి. గత నాలుగు రోజులుగా తమ వద్ద ఉన్న నగదునే అందరికీ సర్దుతున్న
-
అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరతే
-
పరిమితులు విధించి అందరికీ సర్దుతున్న బ్యాంకులు
-
బ్యాంకుల్లో నిండుకున్న నిల్వలు
-
ఖాతాదారుల ఆందోళనలు
సాక్షి, రాజమహేంద్రవరం :
ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుతీరుతున్నా నగదు అందడం లేదు. రిజర్వ్‌బ్యాంక్ నుంచి నగదు రాకపోవడంతో బ్యాంకులు నో క్యాష్ బోర్టులు పెడుతున్నాయి. గత నాలుగు రోజులుగా తమ వద్ద ఉన్న నగదునే అందరికీ సర్దుతున్న రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ’నో క్యాష్’ బోర్డులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా పలు బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖాతాదారులు తమను నిలదీస్తుండడంతో బ్యాంకు అధికారులు వారికి సర్దిచెప్పలేక సతమతమవుతున్నారు. ఏలేశ్వరంలోని ఆంధ్రా బ్యాంకులో నగదు ఇవ్వకపోవడంతోపాటు ఖాతాదారులకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ సీపీఐ(ఎల్) నాయకులు బ్యాంకు రోడ్డుపై ధర్నా చేశారు. కొత్తపేట ఎస్బీఐ వద్ద ఖాతాదారులకు నగదు ఇవ్వకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే నగదు తెప్పించి ఇవ్వాలని కోరారు.
ఏటీఎంల వద్ద అదే తీరు...
బ్యాంకులకు నగదు రాకపోవడంతో ఏటీఎంలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లాలో 931 ఏటీఎంలుండగా అందులో 10 శాతం ఏటీఎంలలో నగదు ఉండడంలేదు. ఉన్న చోట్ల భారీ క్యూలు. రెండు వేలు తీసుకోవడానికి నాలుగైదు గంటల సమయం పడుతోందని ప్రజలు వాపోతున్నారు. రాజమహేంద్రవరం నగరంలో కేవలం రెండు ఏటీఎంలలో మాత్రమే నగదు వస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.